Friday, July 31, 2020

ఉషా పరిణయం - 59

( శివుడు కృష్ణుని స్తుతించుట ) 

10.2-449-మ.
కనియెన్ గోపకుమారశేఖరుఁడు రంగత్ఫుల్లరాజీవ కో
కనదోత్తుంగ తరంగసంగత లసత్కాసారకన్ భూరి శో
భన నిత్యోన్నత సౌఖ్యభారక నుదంచద్వైభవోదారకన్
జనసంతాపనివారకన్ సుజనభాస్వత్తారకన్ ద్వారకన్.
10.2-450-వ.
కని డాయంజనఁ బురలక్ష్మి కృష్ణ సందర్శన కుతూహలయై చేసన్నలం జీరు చందంబున నందంబునొందు నుద్ధూతతరళ విచిత్ర కేతుపతాకాభిశోభితంబును, మహనీయ మరకతతోరణ మండితంబును, గనకమణి వినిర్మితగోపురసౌధప్రాసాద వీథికావిలసితంబును, మౌక్తిక వితానవిరచిత మంగళ రంగవల్లీ విరాజితంబును, శోభనాకలితవిన్యస్త కదళికాస్తంభ సురభి కుసుమమాలి కాక్షతాలంకృతంబును, గుంకుమ సలిల సిక్త విపణిమార్గంబును, శంఖ దుందుభి భేరీ మృదంగ పటహ కాహళాది తూర్య మంగళారావ కలితంబును, వంది మాగధ సంగీత ప్రసంగంబును నై యతి మనోహర విభవాభిరామం బైన యప్పురవరంబు సచివ పురోహిత సుహృద్బాంధవ ముఖ్యు లెదురుకొన భూసురాశీర్వాదంబులను బుణ్యాంగనా కరకలిత లలితాక్షతలను గైకొనుచుం గామినీమణులు గర్పూరనీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం బ్రవేశించి యప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖం బుండె; నంత.

భావము:
గోపాలశేఖరుడైన శ్రీకృష్ణుడు వికసించిన కమలోత్పలాలతో, ఉత్తుంగ తరంగాలతో శోభిస్తున్న సరోవరాలతో నిండినదీ; అనునిత్యమూ సుఖవైభవాలకూ భోగభాగ్యాలకూ అలవాలమైనదీ; సుజనులకు కాపురమైనదీ అయిన ద్వారకను దర్శించాడు. ద్వారకానగరంలోని జండాలు శ్రీకృష్ణుడిని రా రమ్మని నగరలక్ష్మి పిలుస్తున్నట్లుగా ఉన్నాయి; మరకతాల తోరణాలతో మణులు పొదగిన బంగారు భవనాలతో నగరం విలసిల్లుతున్నది; పట్టణంలో ముత్యాల రంగవల్లులు తీర్చబడ్డాయి; అరటి స్తంభాలకు మంచి సువాసనల పుష్పమాలలు అలంకరించబడ్డాయి; ఆ పట్ణణ విపణిమార్గం కుంకుమ నీటితో తడుపబడింది; శంఖ, దుందుభి, భేరీ, మృదంగాది మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి; వందిమాగధుల సంగీత ప్రసంగాలు అతిశయించాయి; ఇంతటి వైభవంతో విలసిల్లుతున్న ద్వారకాపట్టణం లోనికి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు; పురోహిత, బంధుమిత్రులు స్వాగతం పలికారు; బ్రాహ్మణులు ఆశీర్వదించారు; పుణ్యస్త్రీలు శుభ అక్షతలు జల్లారు; కామినీమణులు కర్పూర హారతులు ఇచ్చారు; గోవిందుడు తన మందిరంలో ప్రవేశించి ఆనందడోలికలలో తేలియాడుతూ సుఖంగా ఉండసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=450

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: