Friday, July 3, 2020

ఉషా పరిణయం - 35


( బాణాసురునితో యుద్ధంబు )

10.2-400-సీ.
ఆ చక్రవాళాచలాచక్ర మంతయు;
బలసి కుమ్మరిసారె పగిదిఁ దిరిగె
ఘన ఘోణి ఖుర కోటిఘట్టిత నదముల;
కరణి నంభోనిధుల్‌ గలఁగి పొరలెఁ
గాలరుద్రాభీల కర శూలహతి రాలు;
పిడుగుల గతి రాలె నుడుగణంబు
చటులానిలోద్ధూత శాల్మలీతూలంబు;
చాడ్పున మేఘముల్‌ చదలఁ దూలె
10.2-400.1-తే.
గిరులు వడఁకాడె దివి పెల్లగిల్లె సురల
గుండె లవిసె రసాతలక్షోభ మొదవె
దిక్కు లదరె విమానముల్‌ తెరలి చెదరెఁ
గలఁగి గ్రహరాజ చంద్రుల గతులు దప్పె.
10.2-401-వ.
అట్టి సమర సన్నాహంబునకుఁ గట్టాయితంబై, మణిఖచితభర్మ వర్మ నిర్మలాంశు జాలంబులును, శిరస్త్రాణ కిరీట కోటిఘటిత వినూత్న రత్నప్రభాపటలంబులును, గనకకుండల గ్రైవేయ హార కంకణ తులాకోటి వివిధభూషణవ్రాత రుచి నిచయంబులును, బ్రచండబాహుదండ సహస్రంబున వెలుంగుచు శర శరాసన శక్తి ప్రాస తోమర గదా కుంత ముసల ముద్గర భిందిపాల కరవాల పట్టిస శూల క్షురికా పరశు పరిఘాది నిశాత హేతివ్రాత దీధితులును, వియచ్చరకోటి నేత్రంబులకు మిఱుమిట్లు గొలుపం గనకాచలశృంగ సముత్తుంగం బగు రథంబెక్కి యరాతివాహినీ సందోహంబునకుం దుల్యంబైన నిజసేనాసమూహంబు లిరుగడల నడవ బాణుం డక్షీణప్రతాపంబు దీపింప ననికివెడలె; నయ్యవసరంబున.

భావము:
ఈ యుద్ధ సన్నాహానికి ధరణీచక్రమంతా కుమ్మరిసారెలాగా తిరిగింది; ఆదివరాహపు గిట్టల తాకిడి తగిలిన నదులవలె సముద్రాలు కలగిపోయాయి; కాలరుద్రుడి శూలపు దెబ్బలకు రాలిన పిడుగుల వలె చుక్కలు విచ్ఛిన్నమై నేలరాలాయి; భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదూది పింజలవలె మేఘాలు చెదిరి పోయాయి; పర్వతాలు వణికిపోయాయి; ఆకాశం పెల్లగిల్లింది; దేవతల గుండెలు అవిసిపోయాయి; పాతాళం క్షోభించింది; దిక్కులు సంచలించాయి; విమానాలు చెల్లాచెదరయ్యాయి; సూర్యచంద్రులు గతి తప్పారు. అంతటి భీకరంగా యుద్ధానికి సిద్ధపడిన బాణాసురుడు మేరుపర్వత శిఖరంవలె ఉన్నతమైన రథాన్ని అధిరోహించాడు; మణులు పొదిగిన బంగారు కవచాన్ని ధరించాడు; రత్నకాంతులతో అతని కిరీటం శోభించింది; కుండలాలు, హారాలు, కంకణాలు మొదలైన బంగారు ఆభరణాల కాంతులు అంతటా వ్యాపించాయి; బాణ, కుంత, తోమర, ముసల, గదా, కరవాలం మున్నగు అనేక ఆయుధాలతో అతని వేయి చేతులు వెలిగిపోతూ దేవతల నేత్రాలకు మిరుమిట్లు గొల్పాయి; ఈవిధంగా ఆ రాక్షసేంద్రుడు శత్రుసైన్యంతో సమానమైన సైన్యం ఇరుదిక్కులా నడవగా అమిత పరాక్రమంతో రణరంగానికి బయలుదేరాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=400

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: