( శివ కృష్ణులకు యుద్ధ మగుట )
10.2-407-మ.
అనలాక్షుండు త్రిలోకపూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యా
వనజాతేక్షణు మీఁదఁ గ్రోధమహిమవ్యాకీర్ణుఁ డై యేసె; నే
సినఁ దద్దివ్యశరంబుచేతనె మఱల్చెం గృష్ణుఁ డత్యుద్ధతిన్
జనితాశ్చర్య రసాబ్ధిమగ్ను లగుచున్ శక్రాదు లగ్గింపఁగన్.
10.2-408-శా.
వాయవ్యాస్త్ర ముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతిన్నేయ దై
తేయధ్వంసియుఁ బార్వతాశుగముచేఁ ద్రెంచెం; గ్రతుధ్వంసి యా
గ్నేయాస్త్రం బడరించె నుగ్రగతి లక్ష్మీనాథుపై; దాని వే
మాయం జేసెను నైంద్రబాణమునఁ బద్మాక్షుండు లీలాగతిన్.
10.2-409-వ.
మఱియును.
భావము:
నుదట అగ్నిని కురిపించే కనులు గల ఆ పరమశివుడు, పరిస్థితిని గమనించి, త్రిలోకపూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు కూడ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని మరలించాడు. ఇది చూసిన దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్తుతించారు. అంతట ఉమాపతి ఉపేంద్రుడిమీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అసురారి ఆ అస్త్రాన్ని పర్వతాస్త్రంతో నివారించాడు. ఉగ్రుడు మహోగ్రుడై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా, కృష్ణుడు ఐంద్రబాణంతో దానిని అణచివేశాడు. ఇంకా...
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=408
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment