10.2-425-క.
శిరములు మూఁడును ఘన భీ
కరపదములు మూఁడుఁ గలిగి కనలి మహేశ
జ్వర మురు ఘోరాకృతితో
నరుదేరఁగఁ జూచి కృష్ణుఁ డల్లన నగుచున్.
10.2-426-చ.
పరువడి వైష్ణవజ్వరముఁ బంచిన నయ్యుభయజ్వరంబులున్
వెరవును లావుఁ జేవయును వీరము బీరము గల్గి ఘోర సం
గర మొనరింప నందు గరకంఠకృతజ్వర ముగ్రవైష్ణవ
జ్వరమున కోడి పాఱె ననివారణ వైష్ణవివెంట నంటఁగన్.
భావము:
మూడు శిరస్సులతో; మూడు పాదాలతో; తీవ్ర క్రోధంతో; శివజ్వరం భయంకర ఆకారంతో వచ్చింది. దానిని చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, వైష్ణవజ్వరాన్ని ప్రయోగించాడు. ఆ శైవవైష్ణవ జ్వరాలు తమ తమ శక్తిసామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి. ఆ సంగ్రామంలో వైష్ణవజ్వర తాకిడికి శివజ్వరం ఓడి పారిపోయింది. అప్పుడు దానిని వైష్ణవజ్వరం వెంబడించి తరమసాగింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=426
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment