Friday, July 24, 2020

ఉషా పరిణయం - 52


( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )

10.2-435-క.
చని రణభూమిని మధ్యం
దిన మార్తాండప్రచండ దీప్తాకృతితోఁ
దనరుచుఁ బరిపంథిబలేం
ధనదవశిఖియైన కృష్ణుఁ దాఁకెం బెలుచన్.
10.2-436-ఉ.
తాఁకి భుజావిజృంభణము దర్పము నేర్పును నేర్పడంగ నొ
క్కూఁకున వేయిచేతుల మహోగ్రశరావళి పింజ పింజతోఁ
దాఁకఁగ నేసినన్ మురవిదారుఁడు తోడన తచ్ఛరావళి
న్నాఁక గొనాకఁ ద్రుంచె నిశితార్ధశశాంక శిలీముఖంబులన్.

భావము:
బాణాసురుడు అలా కదలి వచ్చి కదనరంగంలో మధ్యాహ్న మార్తాండుని వలె ప్రకాశిస్తూ శత్రు సేనలు అనే కట్టెలకు అగ్నిజ్వాలల వలె విరాజిల్లే శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బలిపుత్రుడు బాణుడు తన భుజబలం ద్యోతకము అవుతుండగా ముట్టడించి, ఒకే సారి వేయిచేతులతో శ్రీకృష్ణుడిపై వాడి పరమ భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. మురాంతకుడు కృష్ణుడు ఆ బాణవర్షాన్ని లెక్కచేయకుండా తన వాడియైన అర్ధచంద్ర బాణాలతో వాటిని అన్నింటిని త్రుంచి వేశాడ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=436

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: