Thursday, July 9, 2020

ఉషా పరిణయం - 37

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-404-వ.
ఇట్లు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింపం బ్రతిపక్షబలంబులతోడం దలపడిన ద్వంద్వయుద్ధం బయ్యె; నప్పుడ ప్పురాతన యోధుల యా యోధనంబుఁ జూచు వేడ్కం జనుదెంచిన, సరసిజసంభవ శక్ర సుర యక్ష సిద్ధ సాధ్య చారణ గంధర్వ కిన్నర కింపురుష గరుడోర గాదులు నిజ విమానారూఢులై వియత్తలంబున నిలిచి; రట్టియెడం గృష్ణుండును హరుండును, మారుండును గుమారుండును, గూపకర్ణ కుంభాండులును, గామపాలుండును బాణుపుత్త్రుండగు బలుండును, సాంబుండును; సాత్యకియును బాణుండును, రథికులు రథికులును, నాశ్వికులు నాశ్వికులును, గజారోహకులు గజారోహకులును, బదాతులు పదాతులునుం దలపడి యితరేతర హేతిసం ఘట్టనంబుల మిణుఁగుఱులు సెదరం బరస్పరాహ్వాన బిరుదాం కిత సింహనాద హుంకార శింజినీటంకార వారణ ఘీంకార వాజి హేషారవంబులను, బటహ కాహళ భేరీ మృదంగ శంఖ తూర్య ఘోషంబులను బ్రహ్మాండకోటరంబు పరిస్ఫోటితంబయ్యె; నయ్యవసరంబున.

భావము:
పరమశివుడు ఇలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాలవారికీ ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నరాదులు తమ తమ విమానాలు ఎక్కి ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివ కేశవులూ; కుమార ప్రద్యుమ్నులూ; కూపకర్ణ కుంభాండులూ; బలరాముడూ సాంబుడూ; బాణనందనుడు బలుడూ బాణసాత్యకులూ; ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోనూ; అశ్వికులు అశ్వికులతోనూ; గజారోహకులు గజారోహకులతోనూ; పదాతులు పదాతులతోనూ యుద్ధం ప్రారంభించారు. ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి; సింహనాదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగు ఘీంకారాలతో, గుఱ్ఱాల సకిలింపులతో, పటహము భేరి కాహళము మృదంగము శంఖమూ మున్నగు వాయిద్యాల సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లి పోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=404

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: