Monday, July 13, 2020

ఉషా పరిణయం - 40


( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-410-ఉ.
పాయని కిన్కతో హరుఁడు పాశుపతాస్త్రము నారిఁ బోసినన్;
దోయరుహాయతాక్షుఁడునుఁ దోడన లోకభయంకరోగ్ర నా
రాయణబాణరాజము రయంబున నేసి మరల్చె దానిఁ జ
క్రాయుధుఁ డిత్తెఱంగునఁ బురారి శరావలి రూపుమాపినన్.
10.2-411-క.
ఊహ కలంగియు విగతో
త్సాహుండగు హరునిమీఁద జలజాక్షుడు స
మ్మోహన శిలీముఖం బ
వ్యాహత జయశాలి యగుచు నడరించె నృపా!
10.2-412-వ.
అట్లేసిన.

భావము:
అనంతరం మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వింట సంధించాడు. చక్రాయుధుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాన్ని మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలు అన్నింటినీ రూపుమాపాడు. రాజా! అంతట పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశీలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అలా ప్రయోగించడంతో.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=411

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: