( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )
10.2-433-వ.
అని మఱియు నప్పుండరీకాక్షుండిట్లను “నెవ్వరేనియు నీ యుభయజ్వర వివాదంబును, నీవు మత్ప్రపత్తిం జొచ్చుటయునుఁ జిత్తంబులం దలంతు రట్టి పుణ్యాత్ములు శీతోష్ణజ్వరాది తాపంబులఁ బొర య” రని యానతిచ్చిన నమ్మహేశ్వరజ్వరంబు పరమానందభరిత హృదయంబై యారథాంగపాణికి సాష్టాంగదండప్రణామం బాచరించి నిజేచ్ఛం జనియె; నంత బాణాసురుండు నక్కడ.
10.2-434-సీ.
కమనీయ కింకిణీఘంటికా సాహస్ర$
ఘణఘణధ్వనిచేత గగన మగల
నన్యజనాలోకనాభీలతరళోగ్ర$
కాంచనధ్వజపతాకలు వెలుంగఁ
బృథునేమి ఘట్టనఁ బృథివి కంపింపంగ$
వలనొప్పు పటుజవాశ్వములఁ బూన్చి
నట్టి యున్నతరథం బత్యుగ్రగతి నెక్కి$
కరసహస్రమున భీకరతరాసి
10.2-434.1-తే.
శర శరాసనముఖ దివ్యసాధనములు
దనరఁ జలమును బలము నుత్కటము గాఁగ
హర్ష మిగురొత్తఁ గయ్యంపుటాయితమునఁ
బురము వెలువడె బలిపుత్త్రుఁ డురుజవమున.
భావము:
అని ఇంకా ఇలా అన్నాడు “ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్నీ; నీవు నన్ను శరణుకోరిన విధానాన్ని; మనస్సులో స్మరిస్తారో, అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగవు” అని అనగా మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి చక్రాయుధుడైన శ్రీకృష్ణునకు సాష్టాంగనమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇంతలో, అక్కడ బలికుమారుడైన బాణాసురుడు మళ్ళీ యుద్ధసన్నద్ధుడై బయలుదేరాడు.అసంఖ్యాకమైన చిరుగంటల ధ్వనితో ఆకాశం బ్రద్దలు అవుతుండగా, మిక్కిలి వేగవంతము లైన అశ్వాలను కూర్చిన ఒక ఉన్నత రథాన్ని అధిరోహించి అమితోత్సాహంతో బాణాసురుడు యుద్ధరంగానికి వచ్చాడు. ఆ రథం శత్రు భీకరంగా బంగారు జండాలతో ప్రకాశిస్తోంది. పెద్ద పెద్ద రథచక్రాల వేగానికి భూమి కంపించిపోతోంది. రథం అధిరోహించి ఉన్న అతని వేయి చేతులలో ధనుర్భాణాలూ భయంకరమైన ఖడ్గాది ఆయుధాలూ ప్రకాశిస్తున్నాయి. కసి, బలము, ఉత్సాహము అతిశయిస్తుండగా యుద్ధసన్నధుడై పట్టణములోనుండి రణరంగానికి మిక్కిలి వేగంగా వచ్చాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=434
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment