( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )
10.2-431-సీ.
శాంతమై మహితతీక్ష్ణ సుదుస్సహంబై యు$
దారమై వెలుగొందు తావకీన
భూరిభాస్వత్తేజమునఁ దాప మొందితిఁ$
గడుఁ గృశించితి, నన్ను గరుణఁజూడు
మితరదేవోపాస్తిరతి మాని మీ పాద$
కమలముల్ సేవించు విమలబుద్ధి
యెందాక మది దోఁప దందాఁకనే కదా$
ప్రాణులు నిఖిలతాపములఁ బడుట?
10.2-431.1-తే.
యవిరళానన్యగతికుల నరసి ప్రోచు
బిరుదుగల నీకు ననుఁ గాచు టరుదె? దేవ!
ప్రవిమలాకార! సంసారభయవిదూర!
భక్తజనపోషపరితోష! పరమపురుష!"
10.2-432-చ.
అనినఁ బ్రసన్నుఁడై హరి యనంతుఁడు దైత్యవిభేది దాని కి
ట్లనియె "మదీయ సాధన మనన్యనివారణమౌట నీ మదిం
గని నను నార్తిఁ జొచ్చితివి గావున మజ్జ్వర తీవ్ర దాహ వే
దన నినుఁ బొంద దింకఁ బరితాపము దక్కుము నీ మనంబునన్."
భావము:
ఓ పరమపురుషా! భక్తజన ఆనందదాయకా! సంసార భయనివారకా! దివ్యాకారా! శాంతమూ, తీక్షణమూ, దుస్సహమూ, ఉదారమూ అయి వెలుగొందుతున్న నీ మహత్తర తేజస్సు వలన తాపం పొందాను, కృశించిపోయాను నన్ను రక్షించు. ఇతర దైవాలను సేవించడం మాని నీ పాదపద్మాలను సేవించాలనే బుద్ధి ఉదయించేటంతవరకే అన్ని తాపాలు. అనాథ రక్షకుడనే బిరుదుగల నీకు నన్ను రక్షించడం ఏమంత గొప్పవిషయం.” అని స్తుతించగా దానవాంతకు డైన కృష్ణుడు శివజ్వరంతో ఇలా అన్నాడు “నా పరాక్రమం అనన్య నివారణమని గమనించి నీవు ఆర్తితో నా శరణం కోరావు. కనుక, నా జ్వరం నిన్నుబాధింపదు నీ మనస్సులో పరితాపం మాను”
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=431
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment