Friday, July 17, 2020

ఉషా పరిణయం - 48


( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )

10.2-427-తే.
పాఱి యే దిక్కుఁ గానక ప్రాణభీతి
నెనసి యేడ్చుచు నా హృషీకేశు పాద
కంజములఁ బడి ననుఁ గావు కావు మనుచు
నిటలతట ఘటితాంజలిపుటయు నగుచు.
10.2-428-వ.
ఇట్లు వినుతించె.
10.2-429-సీ.
"అవ్యయు, ననఘు, ననంతశక్తిని, బరు$
  లయినట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర
వరుల కీశ్వరుఁ డైనవాని, సర్వాత్మకు$
  జ్ఞానస్వరూపు, సమానరహితు,
వరదుని, జగదుద్భవస్థితి సంహార$
  హేతుభూతుని, హృషీకేశు, నభవు,
బ్రహ్మచిహ్నంబులై పరఁగు సుజ్ఞాన శ$
  క్త్యాదుల నొప్పు బ్రహ్మంబు, నీశు,
10.2-429.1-ఆ.
నజు, షడూర్మిరహితు, నిజయోగమాయా వి
మోహితాఖిలాత్ము, ముఖ్యచరితు,
మహితతేజు, నాదిమధ్యాంతహీనునిఁ,
జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ!

భావము:
శివజ్వరానికి ఎటూ పారిపోవడానికి దిక్కుతోచక దుఃఖిస్తూ, పంకజాక్షుడైన కృష్ణుడి పాదాలపైపడి, ప్రణామంచేసి, నుదుట చేతులు జోడించి రక్షించమని అంటూ శివజ్వరం ఈ విధముగా స్తుతించసాగింది. శివజ్వరం శ్రీకృష్ణుడిని ఇలా స్తోత్రం చేసింది.
“ఓ శ్రీకృష్ణా! నీవు అవ్యయుడవు; అనంతశక్తి యుక్తుడవు; బ్రహ్మాది దేవతలకు అధీశ్వరుడవు; సర్వాత్మకుడవు; అనుపమానుడవు; వరదుడవు; సృష్టిస్థితిలయ కారకుడవు; హృషీకేశవుడవు; అభవుడవు; పరబ్రహ్మ స్వరూపుడవు; యోగమాయచేత సర్వజగత్తును సమ్మోహపరచువాడవు; మహనీయతేజుడవు; ఆదిమధ్యాంత రహితుడవు; చిన్మయాత్ముడవు. అట్టి నిన్ను ప్రార్ధిస్తున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=429

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: