Thursday, July 16, 2020

ఉషా పరిణయం - 46


( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-424-సీ.
అత్తఱిఁ గోటర యను బాణ జనయిత్రి;
సుతుఁ గాచు మతము సన్మతిఁ దలంచి
వీడి శిరోజముల్‌ వ్రేలంగ నిర్ముక్త;
పరిధానయై మురాసురవిభేది
యెదుర నిల్చినఁ జూడ మదిఁ జాల రోసి ప;
రాఙ్ముఖుఁడై యున్న ననువు వేచి
తల్లడించుచు బాణుఁడుల్లంబు గలగంగఁ;
దలచీర వీడ యాదవులు నవ్వ
10.2-424.1-తే.
నవ్యకాంచనమణిభూషణములు రాలఁ
బాదహతి నేలఁ గంపింపఁ బాఱి యాత్మ
పురము వడిఁజొచ్చె నప్పుడు భూతగణము
లాకులతతోడ నెక్కడే నరుగుటయును.

భావము:
బాణుడు అలా కృష్ణవిజృంభణకు ప్రతికృతి చేయలేకపోతున్న ఆ సమయంలో, బాణాసురుడి తల్లి అయిన కోటర, తన కుమారుడిని రక్షించుకో దలచి వీడినజుట్టుతో వివస్త్రయై శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. ఆమెను చూడడానికి అసహ్యించుకుని మాధవుడు ముఖము త్రిప్పుకున్నాడు. ఆ సమయంలో బాణాసురుడు తలపాగ వీడిపోగా; భూషణాలు రాలిపోగా; యాదవులు పరిహసిస్తుండగా; తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=424

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: