Sunday, July 26, 2020

ఉషా పరిణయం - 56


( శివుడు కృష్ణుని స్తుతించుట )

10.2-442-తే.
అవ్యయుండ; వనంతుండ; వచ్యుతుండ;
వాదిమధ్యాంతశూన్యుండ; వఖిలధృతివి
నిఖిలమం దెల్ల వర్తింతు నీవు దగిలి
నిఖిల మెల్లను నీ యంద నెగడుఁ గృష్ణ!"
10.2-443-సీ.
అని సన్నుతించిన హరి యాత్మ మోదించి$
  మొగమునఁ జిఱునవ్వు మొలకలెత్త
లలితబాలేందుకళామౌళి కిట్లను$
  "శంకర! నీ మాట సత్య మరయ
నేది నీ కిష్టమై యెసఁగెడు దానిన;
వేఁడుము; నీకిత్తు వీఁ డవధ్యుఁ$
  డిది యెట్టి దనినఁ బ్రహ్లాదుండు మద్భక్తుఁ$
  డతనికి వరము నీ యన్వయమున
10.2-443.1-తే.
జనన మందిన వారలఁ జంప ననుచుఁ
గడఁక మన్నించితిని యది కారణమున
విశ్వవిశ్వంభరాభార విపులభూరి
బలభుజాగర్వ మడఁపంగ వలయుఁగాన.

భావము:
వాసుదేవా! నీవు అవ్యయుడవు; అనంతుడవు; అచ్యుతుడవు; ఆదిమధ్యాంత శూన్యుడవు; విశ్వంభరుడవు; నీవు జగత్తు సమస్తము నందు సంచరిస్తూ ఉంటావు; జగత్తు సమస్తమూ నీలో లీనమై ఉంటుంది.” ఇలా అని స్తుతించగా శ్రీకృష్ణుడు సంతోషించి చిరు నగవుల మోముతో ఇందురేఖాధరుడైన శివుడితో ఇలా అన్నాడు “ఓ శంకరా! నీవు సత్యము పలికావు. నీకు ఇష్టమైన కోరిక కోరుకో తీరుస్తాను. ఈ బాణాసురుడు అవధ్యుడు. ఎందుకంటే, నా భక్తుడైన ప్రహ్లాదుని వంశంవాడు. నీ వంశస్థులను సంహరించను అని ప్రహ్లాదుడికి నేను వరం ఇచ్చాను. అందువలన ఇతడు చంపదగినవాడు కాదు. అందువలన ఇతనిని క్షమించాను. కానీ సమస్త భూభారాన్ని మోస్తున్నాను అని అహంకరించే వీడి భుజగర్వాన్ని అణచివేయక తప్పదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=443

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: