Tuesday, April 28, 2020

ధృవోపాఖ్యానము - 47

4-356-క.
కొందఱు స్వభావ మందురు,
కొందఱు కర్మం బటండ్రు, కొందఱు కాలం
బందురు, కొందఱు దైవం
బందురు, కొంద ఱొగిఁ గామ మండ్రు మహాత్మా!
4-357-వ.
ఇట్టు లవ్యక్తరూపుండును, నప్రమేయుండును, నానాశక్త్యుదయ హేతుభూతుండును నైన భగవంతుండు చేయు కార్యంబులు బ్రహ్మరుద్రాదు లెఱుంగ రఁన నతని తత్త్వంబు నెవ్వ రెఱుంగ నోపుదురది గావునఁ బుత్రా! యిట్లుత్పత్తి స్థితి లయంబులకు దైవంబు కారణం బై యుండ నీ ధనదానుచరులు భవదీయ భాతృహంత లగుదురే? భూతాత్మకుండు, భూతేశుండు, భూతభావనుండు, సర్వేశ్వరుండుఁ, బరాపరుండు నగు నీశుండ మాయాయుక్తుండై స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులం జేయు; నైన ననహంకారంబునం జేసి గుణకర్మంబులచే నస్పృశ్యుం డగుచు వర్తించు; నదియునుం గాక, యీ ప్రజాపతులు విశ్వసృణ్ణామంబుల నియంత్రితు లై ముకుద్రాళ్ళు పెట్టిన పశువులుం బోలె నెవ్వని యాజ్ఞాధీనకృత్యులై వర్తింతు రట్టి దుష్టజన మృత్యువును, సుజనామృత స్వరూపుండును, సర్వాత్మకుండును, జగత్పరాయణుండును నైన యీశ్వరుని సర్వప్రకారంబుల శరణంబుఁ బొందు; మదియునుం గాక.

భావము:
కొందరు ఆయనను స్వభావం అంటారు. మరికొందరు కర్మం అంటారు. ఇంకా కొందరు కాలం అంటారు. కొందరు దైవం అంటారు. మరికొందరు కామం అనికూడ అంటారు. ఈ విధంగా నిర్గుణుడు, అప్రమేయుడు, అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మ రుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక అతని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి నాయనా! పుట్టుకకు, మరణానికి దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముణ్ణి చంపారని భావించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవంతుడు తన మాయచేత సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాదు. ముక్కుత్రాళ్ళతో కట్టబడిన పశువుల వలె ఈ ప్రజాపతులు భగవంతుని ఆజ్ఞలను పాటించి ప్రవర్తిస్తారు. కాబట్టి దుష్టులకు మృత్యుస్వరూపుడు, శిష్టులకు అమృతస్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాల శరణు పొందు. అంతేకాక…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=357

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: