Wednesday, April 15, 2020

ధృవోపాఖ్యానము - 37

4-321-తే.
చారు బహువిధ వస్తు విస్తార మొప్ప
నంగనాయుక్త మగుచుఁ బెం పగ్గలించి
యర్థిఁ దనరారు జనకుగృహంబు చొచ్చె
నెలమిఁ ద్రిదివంబు చొచ్చు దేవేంద్రు పగిది.4-322-వ.
ఇట్లు ప్రవేశించిన రాజర్షి యైన యుత్తానపాదుండు సుతుని యాశ్చర్య కరంబైన ప్రభావంబు వినియుం జూచియుం మనంబున విస్మయంబు నొంది ప్రజానురక్తుండును, బ్రజాసమ్మతుండును, నవయౌవ్వన పరిపూర్ణుండును నైన ధ్రువుని రాజ్యాభిషిక్తుం జేసి వృద్ధవయస్కుండైన తన్నుఁదాన యెఱింగి యాత్మగతిఁ బొంద నిశ్చయించి విరక్తుండై వనంబునకుం జనియె; అంత నా ధ్రువుండు శింశుమార ప్రజాపతి కూఁతురైన భ్రమి యను దాని వివాహంబై దానివలనఁ గల్ప వత్సరు లను నిద్దఱు గొడుకులం బడసి; వెండియు వాయుపుత్రియైన యిల యను భార్య యందు నుత్కల నామకుఁడైన కొడుకు నతి మనోహర యైన కన్యకారత్నంబునుం గనియె; అంత దద్భ్రాత యైన యుత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షునిచేత హతుండయ్యె; అతని తల్లియుఁ దద్దుఃఖంబున వనంబున కేఁగి యందు గహనదహనంబున మృతిం బొందె; ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్షశోకవ్యాకులిత చిత్తుండై జైత్రంబగు రథంబెక్కి యుత్తరాభిముఖుండై చని హిమవద్ద్రోణి యందు భూతగణ సేవితంబును గుహ్యక సంకులంబును నైన యలకాపురంబు బొడగని యమ్మహానుభాహుండు.

భావము:
ఎన్నెన్నో సుందర వస్తువులతోను, సుందరీమణులతోను కలకలలాడుతూ కనువిందు చేస్తున్న రాజప్రాసాదంలో స్వర్గంలో దేవేంద్రుడు ప్రవేశించినట్లు ధ్రువుడు ప్రవేశించాడు. ఆ విధంగా ప్రవేశించగా రాజర్షి అయిన ఉత్తానపాదుడు అద్భుతమైన కొడుకు ప్రభావానికి ఆశ్చర్యపడ్డాడు. ధ్రువునకు ప్రజలపై గల అనురాగాన్ని, ప్రజలకు ధ్రువునిపై గల అభిమానాన్ని పరికించి నవయౌవనవంతుడైన ధ్రువుణ్ణి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసాడు. తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని సుగతిని పొందడానికి నిశ్చయించుకొని విరక్తుడై తపోవనానికి వెళ్ళాడు. ఆ తరువాత ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురయిన భ్రమిని వివాహమాడి ఆమెవల్ల కల్పుడు, వత్సరుడు అనె ఇద్దరు కొడుకులను పొందాడు. వాయు పుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఆమెవల్ల ఉత్కలుడు అనే కొడుకును, సౌందర్యవతి అయిన కూతురును పొందాడు. ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు పెండ్లి కాకముందే వేటాడటానికి హిమవత్పర్వత ప్రాంతంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఉత్తముని తల్లియైన సురుచి పుత్రదుఃఖంతో అడవికి వెళ్ళి అక్కడ కారుచిచ్చు మంటలలో చిక్కి మరణించింది. ధ్రువుడు తమ్ముని మరణవార్త విని కోపంతోను, దుఃఖంతోను కలత చెందిన మనస్సు కలవాడై జయశీలమైన రథాన్ని ఎక్కి ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. అక్కడ మంచుకొండ లోయలో భూతగణాలతోను, యక్షులతోను నిండిన అలకాపురాన్ని చూచి మహాపరాక్రమవంతుడైన ఆ ధ్రువుడు…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=322

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: