4-348-తే.
కడఁగి గుహ్యక మాయాంధకార మపుడు
వెరవుచెడి దవ్వుదవ్వుల విరిసిపోయె
విమలమైన వివేకోదయమునఁ జేసి
సమయు రాగాదికంబుల సరణి నంత.
4-349-మ.
వరనారాయణ దేవతాస్త్ర భవ దుర్వారప్రభాహేమపుం
ఖ రుచిస్ఫార మరాళ రాజసిత పక్షక్రూరధారాపత
చ్ఛర సాహస్రము లోలి భీషణ విపక్షశ్రేణిపై వ్రాలె భీ
కరరావంబునఁ గానఁ జొచ్చు శిఖిసంఘాతంబు చందంబునన్.
4-350-వ.
అట్లేసిన.
4-351-చ.
ఖరనిశితప్రదీప్త ఘన కాండపరంపర వృష్టిచేఁ బొరిం
బొరి వికలాంగులై యడరి పుణ్యజనుల్ పృథుహేతిపాణులై
గరుడునిఁ జూచి భూరిభుజగప్రకరంబు లెదిర్చి పేర్చి చె
చ్చెర నడతెంచు చందమునఁ జిత్రరథున్ బలుపూని తాఁకినన్.
భావము:
ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే అచ్చమైన జ్ఞానం ఉదయించగానే అజ్ఞానం సమసిపోయినట్లు యక్షుల మాయలు అనే కారుచీకట్లు క్షణంలో చెదరిపోయాయి. వారింప శక్యం కాని ఆ నారాయణాస్త్రం నుండి బంగారు అంచులు, రాయంచ రెక్కలవంటి రెక్కలు కల వాడి బాణాలు వేలకొలది పుట్టి, అడవిని చుట్టుముట్టిన అగ్నిజ్వాలల వలె భయంకరమైన ధ్వనితో శత్రుసైనికుల పైన ఎడతెగకుండా వచ్చి పడ్డాయి. ఆ విధంగా నారాయణాస్త్రం ప్రయోగించగా నారాయణాస్త్రం నుండి ఉద్భవించిన వాడి బాణాలు తళతళ మెరుస్తూ రాక్షసులను వికలాంగులను చేశాయి. వారు రెచ్చిపోయి పెద్ద పెద్ద కత్తులను చేతుల్లో ధరించి గరుత్మంతుణ్ణి సర్ప సమూహాలు ఎదిరించినట్లు ధ్రువుణ్ణి ఎదుర్కొన్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=351
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment