Wednesday, April 22, 2020

ధృవోపాఖ్యానము - 43


4-344-వ.
మఱియు, మత్తగజ సింహవ్యాఘ్ర సమూహంబులును, నూర్మి భయంకరంబై సర్వతః ప్లవనం బయిన సముద్రంబును గానంబడియె; వెండియుం గల్పాంతంబునందుంబోలె భీషణంబైన మహాహ్రదంబునుం దోఁచె; నవ్విధంబున నానా విధంబులు ననేకంబులు నవిరళ భయంకరంబులు నయిన యసురమాయలు గ్రూర ప్రవర్తునులగు యక్షుల చేత సృజ్యమానంబులై యడరె; నా సమయంబున.
4-345-క.
అనయంబును నయ్యక్షుల
ఘనమాయ నెఱింగి మునినికాయము వరుసన్
మనుమనుమని మను మను మని
మనమునఁ దలఁచుచును దత్సమక్షంబునకున్.
4-346-వ.
చనుదెంచి యా ధ్రువుం గని యిట్లనిరి.
4-347-సీ.
"అనఘాత్మ లోకు లెవ్వని దివ్య నామంబు;
సమత నాకర్ణించి సంస్మరించి
దుస్తరంబైన మృత్యువు నైన సుఖవృత్తిఁ;
దరియింతు; రట్టి యీశ్వరుఁడు పరుఁడు
భగవంతుఁడును శార్ఙ్గపాణియు భక్తజ;
నార్తిహరుండును నైన విభుఁడు
భవదీయ విమతులఁ బరిమార్చుఁగా" కని;
పలికిన మునుల సంభాషణములు
4-347.1-తే.
విని కృతాచమనుఁడయి యావిభుని పాద
కమలముఁ దలంచి రిపుభయంకరమహోగ్ర
కలిత నారాయణాస్త్రంబుఁ గార్ముకమునఁ
బూనఁ దడవఁ దదీయ సంధానమునను.

భావము:
ఇంకా మదపుటేనుగులు, సింహాలు, పెద్దపులులు చుట్టుముట్టినట్లు. కెరటాలతో సముద్రం భయంకరంగా పొంగిపొరలుతున్నట్లు కనిపించింది. ప్రళయకాలంలో వలె భయంకరమైన గొప్ప మడుగు కనిపించింది. ఈ విధంగా క్రూరులైన ఆ యక్షలు అనేక విధాలైన భీకరమైన మాయలను సృజించారు. అప్పుడు విరామం లేని యక్షుల మాయలను గ్రహించిన మునులందరూ మనువు మనుమడైన ధ్రువుణ్ణి “మనుము!... మనుము!” అని దీవిస్తూ అతని ముందుకు వచ్చి ఆ ధువుణ్ణి చూచి ఇలా అన్నారు. “ఓ పుణ్యాత్ముడా! లోకులు ఎవ్వని దివ్యనామాన్ని విన్నా, స్మరించినా దాటరాని మృత్యువును కూడా దాటగలరో అటువంటి ఈశ్వరుడు, పరాత్పరుడు, భగవంతుడు, శార్ఙ్గపాణి, భక్తజనుల బాధలను తొలగించేవాడు అయిన ఆ జగన్నాథుడు నీ శత్రువులను సంహరించుగాక!” అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు ఆచమించి శ్రీహరి పాదపద్మాలను స్మరించి శత్రు భయంకరమైన నారాయణాస్త్రాన్ని వింట సంధించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=347

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: