Saturday, May 2, 2020

ధృవోపాఖ్యానము - 48


4-358-సీ.
అనఘాత్మ! నీవు పంచాబ్ద వయస్కుండ;
వై పినతల్లి నిన్నాడినట్టి
మాటల నిర్భిన్నమర్ముండ వగుచును;
జనయిత్రి దిగనాడి వనము కేగి
తప మాచరించి యచ్చపు భక్తి నీశ్వరుఁ;
బూజించి మహితవిభూతి మెఱసి
రమణఁ ద్రిలోకోత్తరంబైన పదమును;
బొందితి, వది గాన భూరిభేద
4-358.1-తే.
రూప మైన ప్రపంచంబు రూఢి నే మ
హాత్మునందుఁ బ్రతీతమై యలరు నట్టి
యగుణుఁ డద్వితీయుండును నక్షరుండు
నైన యీశ్వరుఁ బరమాత్ము ననుదినంబు.
4-359-సీ.
కైకొని శుద్ధంబు గతమత్సరంబును;
నమలంబు నగు హృదయంబునందు
సొలయ కన్వేషించుచును బ్రత్యగాత్ముండు;
భగవంతుఁడును బరబ్రహ్మమయుఁడు
నానందమాత్రుండు నవ్యయుఁ డుపపన్న;
సకలశక్తియుతుండు సగుణుఁడజుఁడు
నయిన సర్వేశ్వరునం దుత్తమంబైన;
సద్భక్తిఁ జేయుచు సమత నొప్పి
4-359.1-తే.
రూఢి సోహమ్మమేతి ప్రరూఢ మగుచు
ఘనత కెక్కు నవిద్యయన్ గ్రంథి నీవు
ద్రెంచివైచితి; కావున ధీవరేణ్య!
సర్వశుభహాని యైన రోషంబు వలదు.

భావము:
నాయనా! నీవు అయిదేండ్ల వయస్సులో పినతల్లి నిన్నాడిన మర్మాంతకాలైన మాటలచేత లోలోపల ఎంతో నొచ్చుకొని, కన్నతల్లిని విడిచి, అడవికి పోయి తపస్సు చేశావు. అచ్చమైన భక్తితో భగవంతుణ్ణి పూజించి మూడు లోకాలకూ మీదిదైన ధ్రువపదాన్ని పొందావు. భేదరూపమైన ఈ ప్రపంచం ఏ మహాత్మునియందు ప్రతీతమై ఉంటుందో అటువంటి త్రిగుణాతీతుడు, అద్వితీయుడు, శాశ్వతుడు అయిన ఆ భగవంతుని కోసం ప్రతిదినం పవిత్రమైన, పగను వీడిన నిష్కల్మషమైన మనస్సుతో అలుపు లేకుండా అన్వేషించు. ఈ విధంగా ప్రత్యగాత్ముడు, భగవంతుడు, పరబ్రహ్మ, ఆనందస్వరూపుడు, అనంతుడు, సమస్త శక్తిమంతుడు, సగుణుడు, అజుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తే వాడు, నేను, నాది అనే అవిద్యారూపమైన పీటముడిని త్రెంచుకొన్నావు. కావున ధీశాలీ! సర్వశుభాలను హరించే కోపాన్ని విడిచిపెట్టు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=359

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: