Monday, April 27, 2020

ధృవోపాఖ్యానము - 45



4-352-ఉ.
వారలఁ జండతీవ్ర శరవర్గము చేత నికృత్తపాద జం
ఘోరు శిరోధరాంబక కరోదర కర్ణులఁ జేసి యోగి పం
కేరుహమిత్ర మండల సకృద్భిద నెట్టి పదంబుఁ జెందు నా
భూరిపదంబునం బెలుచఁ బొందఁగఁ బంపె భుజావిజృంభియై.
4-353-వ.
ఇవ్విధంబున నా చిత్రరథుండగు ధ్రువునిచేత నిహన్యమానులును నిరపరాధులును నయిన గుహ్యకులం జూచి యతని పితామహుండైన స్వాయంభువుండు ఋషిగణ పరివృతుం డై చనుదెంచి ధ్రువునిం జూచి యిట్లనియె “వత్సా నిరపరాధులైన యీ పుణ్యజనుల నెట్టి రోషంబున వధియించితి, వట్టి నిరయహేతువైన రోషంబు చాలు; భ్రాతృవత్సల! భ్రాతృవధాభితప్తుండవై కావించు నీ యత్నం బుడుగుము.
4-354-క.
అనఘా! మనుకులమున కిది
యనుచిత కర్మంబ; యొకనికై పెక్కండ్రి
ట్లని మొనఁ ద్రుంగిరి; యిది నీ
కనయంబును వలవ; దుడుగు మయ్య! కుమారా!

భావము:
అప్పుడు ధ్రువుడు పదునైన భయంకర బాణాలను ప్రయోగించి యక్షుల పాదాలను, పిక్కలను, తొడలను, మెడలను, చేతులను, చెవులను ఖండించాడు; కన్నులను పెకలించాడు; పొట్టలను చీల్చాడు; సూర్యమండలాన్ని భేదించుకొని యోగులు పొందే ఉత్తమ లోకానికి వారిని పంపించాడు. ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుడు సంహరిస్తున్న నిరపరాధులైన యక్షులను చూచి ధ్రువుని తాత అయిన స్వాయంభువ మనువు ఋషులతో కూడి వచ్చి ధువునితో ఇలా అన్నాడు “నాయనా! తప్పు చేయని యక్ష రాక్షసులను కోపంతో వధించావు. నరక కారణమైన క్రోధాన్ని చాలించు. తమ్ముని చావునకు పరితపించి నీవు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించు. పుణ్యాత్ముడవైన ఓ ధ్రువకుమారా! మనుకులానికి ఇది తగని పని. ఒక్కనికోసం పెక్కుమందిని వధించావు. ఇట్టి కార్యం నీవు చేయరాదు. దీనిని విరమించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=354

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: