Monday, April 20, 2020

ధృవోపాఖ్యానము - 40

4-333-వ.
అట్లు దోఁచిన.
4-334-మ.
అరి దుఃఖావహమైన కార్ముకము శౌర్యస్ఫూర్తితోఁ దాల్చి భీ
కర బాణావళిఁ బింజపింజఁ గఱవంగా నేసి ఝంఝానిలుం
డురు మేఘావళిఁ బాఱఁదోలుగతి నత్యుగ్రాహితక్రూరబం
ధుర శస్త్రావళి రూపుమాపె విలసద్దో ర్లీల సంధిల్లఁగన్.
4-335-చ.
మఱి యపు డమ్మహాత్ముఁ డసమానబలుండు మహోగ్రబాణముల్
గఱిగఱిఁ దాఁక నేసి భుజగర్వ మెలర్ప విరోధి మర్మముల్
పఱియలు చేసి యంగములు భంగమునొందఁగఁజేసె వ్రేల్మిడిన్
గిఱికొని పర్వతంబుల నొగిం దెగఁ గొట్టెడు నింద్రు కైవడిన్.
4-336-వ.
అయ్యవసరంబున.

భావము: 
అలా కనిపించి శత్రువుల మనస్సులకు సంతాపాన్ని కలిగించే ధనుస్సును చేపట్టి, భయంకరంగా బాణపరంపరను కురిపించి, పెనుగాలి మేఘాలను పారద్రోలే విధంగా భుజబలంతో శత్రువీరుల శస్త్రాస్త్రాలను చెల్లాచెదరు చేసాడు. మహాత్ముడు, సాటిలేని మేటి వీరుడు అయిన ధ్రువుడు భయంకరాలైన బాణాలను వరుసపెట్టి ప్రయోగించి శత్రువుల జీవ స్థానములను బద్దలుకొట్టాడు;వారి అవయవాలను తునాతునకలు కావించాడు; పర్వతాలను బ్రద్దలు కొట్టే ఇంద్రునివలె ధ్రువుడు శత్రువులను చుట్టుముట్టి క్షణంలో మట్టుబెట్టాడు. ఆ సమయంలో…

విశేషాంశం:
కఠినసాధ్యమైన "ఱి" ప్రాసను అలవోకగా ప్రయోగించిన సహజకవికి కరములు మోడ్చుచున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=335

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: