Tuesday, April 28, 2020

ధృవోపాఖ్యానము - 46


4-355-వ.
అదియునుం గాక, దేహాభిమానంబునం బశుప్రాయులై భూతహింస గావించుట హృషీకేశానువర్తను లైన సాధువులకుం దగదు; నీవ సర్వభూతంబుల నాత్మభావంబునఁ దలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండును నైన విష్ణుని పదంబులఁ బూజించి తత్పరమపదంబును బొందితివి; అట్టి భగవంతుని హృదయంబున ననుధ్యాతుండవు, భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు మఱియు సాధువర్తనుండ వన నొప్పు నీ వీ పాపకర్మం బెట్లు చేయ సమకట్టితివి? ఏ పురుషుండైననేమి మహాత్ముల యందుఁ దితిక్షయు, సముల యందు మైత్రియు, హీనుల యందుఁ గృపయు, నితరంబులగు సమస్త జంతువుల యందు సమత్వంబును గలిగి వర్తించు వానియందు సర్వాత్మకుం డైన భగవంతుడు ప్రసన్నుం డగు; అతండు ప్రసన్నుం డయిన వాఁడు ప్రకృతి గుణంబులం బాసి లింగశరీరభంగంబు గావించి బ్రహ్మానందంబునుం బొందు; అదియునుం గాక, కార్య కారణ సంఘాత రూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్కాంత సన్నిధానంబు గలిగిన లోహంబు చందంబున వర్తించు; అందు సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగాఁ బరిభ్రమించు; అట్టి యీశ్వరుని మాయా గుణ వ్యతికరంబున నారబ్ధంబు లైన పంచభూతంబుల చేత యోషిత్పురుషవ్యవాయంబు వలన యోషిత్పురుషాదిరూప సంభూతి యగు; ఇవ్విధంబునఁ దత్సర్గంబుఁ దత్సంస్థానంబుఁ దల్లయంబు నగుచు నుండు; ఇట్లు దుర్విభావ్యం బైన కాలశక్తిం జేసి గుణక్షోభంబున విభజ్యమాన వీర్యుండు ననంతుండు ననాదియు నై జనంబులచేత జనంబులం బుట్టించుచుండుటం జేసి యాదికరుండును, మృత్యుహేతువున జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును,ననాది యగుటంజేసి యవ్యయుండును నైన భగవంతుండు జగత్కారణుం డగుం; గావున నీ సృష్టి పాలన విలయంబులకుం గర్తగానివాని వడుపున దానిఁ జేయుచుండు; ఇట్లు మృత్యరూపుండును బరుండును సమవర్తియు నైన యీశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు; కర్మాధీనంబులైన భూతసంఘంబులు రజంబు మహావాయువు ననుసరించు చాడ్పున నస్వతంత్రంబు లగుచు నతని ననువర్తించు; నీశ్వరుండును జంతుచయాయు రుపచయాపచయ కరణంబులం దస్పృష్టుండును నగు జీవుండు గర్మబద్ధుం డగుటంజేసి కర్మంబ వానికి నాయురుపచయాపచయంబులం జేయుచుండు; మఱియు సర్వజగత్కర్మసాక్షి యగు సర్వేశ్వరుని.

భావము:
అంతేకాక దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణి హింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణి స్వరూపుడైన శ్రీహరిని కొలిచి ఆయన స్థానాన్ని సాధించావు. ఆయన మనస్సుకు ఎక్కావు. హరిభక్తులను మెప్పించావు. నీవు మంచి నడవడి కలవాడవు. తనకంటే గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటే తక్కువ వారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించే వానిని సర్వాంతర్యామి అయిన భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు కరుణిస్తే మానవుడు ప్రాకృత గుణాలనుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అయస్కాంతం సన్నిధిలో లోహం భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంది. సర్వేశ్వరుడు నిమిత్తమాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయిక చేత స్త్రీపురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి ద్వారా జనములనుండి జనములను పుట్టించడం వల్ల ఆద్యుడు, నశింపజేయటం వల్ల అంతకుడు, అనాది కావటం వల్ల అవ్యయుడు అయి భగవంతుడు జగత్తుకు కారణం అవుతాడు. అందువల్ల సృష్టి స్థితి లయాలను చేయనట్లే ఉండి చేస్తుంటాడు. ఈ విధంగా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతునకు తనవారనీ, పరులనీ భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేనివారై ధూళికణాలు గాలిని అనుసరించిన విధంగా భగవంతుని అనుసరిస్తారు. ఉపచయం, అపచయం కలిగిస్తాడు. సర్వేశ్వరుడు కర్మసాక్షి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=355

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: