Monday, April 20, 2020

ధృవోపాఖ్యానము - 41


4-337-చ.
అలఘు చరిత్రుఁ డమ్మనుకులాగ్రణిచే వికలాంగు లైనవా
రల సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సము
జ్జ్వల మణికంకణాంగద లసద్భుజవర్గముచేత సంగర
స్థల మతిరమ్యమై తనరె సంచిత వీరమనోహరాకృతిన్.
4-338-వ.
అంత హతశేషులు.
4-339-క.
వరబలుఁడగు మను మనుమని
శరసంఛిన్నాంగు లగుచు సమరవిముఖులై
హరిరాజముఁ గని పఱచెడు
కరిబృందముఁ బోలెఁ జనిరి కళవళపడుచున్.
4-340-క.
అప్పుడు రాక్షసమాయలు
గప్పిన ధ్రువుఁ డసురవరుల కార్యం బెఱుఁగం
జొప్పడక, వారిఁ బొడగన
దెప్పర మగుటయును సారథిం గని, యంతన్.

భావము:
మహనీయుడు మనువంశంలో శ్రేష్ఠుడు అయిన ధ్రువునిచేత వికలాంగులైనవారి కిరీటాలతో కుండలాలతో ప్రకాశించే శిరస్సులు, మణికంకణాలతో భుజకీర్తులతో ప్రకాశించే బాహువులు నిండి ఉన్న ఆ యుద్ధభూమి వీర మనోహరంగా విరాజిల్లింది. అప్పుడు చావగా మిగిలినవారు వరబలం కలవాడు, స్వాయంభువ మనువు మనుమడు అయిన ధ్రువుని బాణాలచేత శరీరాలు తూట్లు పడగా యుద్ధం మానుకొని సింహాన్ని చూచిన ఏనుగులవలె భయపడి పారిపోయారు. అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. రాక్షసుల మాయాకృత్యాలను అతడు తెలిసికొనలేకపోయాడు. వాళ్ళు అతని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు తన సారథిని చూచి …

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=339

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: