Friday, April 10, 2020

ధృవోపాఖ్యానము - 29



4-298-చ.
అనఘ! జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందనాదు లెం
దనయ మనేక జన్మ సముపార్జిత యోగ సమాధిఁ జేసి యె
వ్వని చరణారవిందములు వారని భక్తి నెఱుంగుచుందు; రా
ఘనుఁ బరమేశు నీశు నవికారు నమేయు నజేయు నాద్యునిన్.
4-299-వ.
ఏను షణ్మాసంబులు భజియించి తత్పాదపద్మ చ్ఛాయం బ్రాపించియు భేదదర్శనుండ నైతి; నక్కటా! ఇట్టి భాగ్యహీనుండనైన యేను భవనాశకుండైన యతనిం బొడఁగనియు నశ్వరంబులైన కామ్యంబు లడిగితి; నిట్టి దౌరాత్మ్యం బెందేనిం గలదే? తమ పదంబులకంటె నున్నత పదంబు నొందుదునో యని సహింపంజాలని యీ దేవతలచేత మదీయ మతి గలుషితం బయ్యెం గాక; నాఁడు నారదుం డాడిన మాట తథ్యం బయ్యె; అతని వాక్యంబు లంగీకరింపక యే నసత్తముండనై స్వప్నావస్థలం బొందినవాఁడు దైవికంబైన మాయంజెంది భిన్న దర్శనుండగు చందంబున నే నద్వితీయుండ నైనను, భ్రాత యను శత్రువుచేఁ బ్రాప్తం బైన దుఃఖంబు నొంది జగదాత్మకుండును, సుప్రసాదుండును, భవనాశకుండును నైన యీశ్వరు నారాధించి తత్ప్రసాదంబు బడసియు నాయుర్విహీనుం డైన రోగికిం బ్రయోగించు నౌషధంబుం బోలె నిరర్థకంబులైన, నశ్వరంబులైన, యీ కామితంబులు గోరితి” నని; వెండియు.

భావము:
జితేంద్రియులు, మహాత్ములు అయిన సనందుడు మొదలైన మునీంద్రులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల సమాధి యోగం ద్వారా ఏ మహానుభావుని చరణకమలాలను దర్శించ గలుగుతారో అటువంటి ఘనుడు, పరమేశ్వరుడు, అవికారుడు, అమేయుడు, అజేయుడు, ఆద్యుడు అయిన శ్రీహరిని...
నేను ఆరునెలలు సేవించి ఆయన పాదపద్మాల నీడలో నిలిచి కూడా భేదదృష్టి కలవాణ్ణి అయ్యాను. నేను దురదృష్టవంతుణ్ణి. సంసారబంధాలను హరించే హరిని దర్శించి కూడా అనిత్యాలైన కోరికలను కోరుకున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? తమ స్థానాలకంటె ఉన్నతమైన స్థానాన్ని నేను పొందుతానేమో అని ఓర్వలేక దేవతలు నా బుద్ధిని కలతపరచి ఉంటారు. ఆనాడు నారదుడు చెప్పిన మాట నిజమయింది. ఆయన మాటలను నేను లెక్క చేయలేదు. నేను అధముణ్ణి. నిద్రించేవాడు కలలో దైవమాయకు చిక్కి తా నొక్కడే అయినా తనకంటె వేరుగా అనేకులను తనయందు చూస్తాడు. అలాగే నేను ఒక్కడినే అయినప్పటికీ తమ్ముడనే శత్రువును కల్పించుకొని దుఃఖం పొందాను. జగత్స్వరూపుడు, దయామయుడు, సంసారవినాశకుడు అయిన హరిని ఆరాధించి, ఆయన అనుగ్రహం పొందికూడ ఆయుస్సు చాలని రోగికి ఔషధం వలె కొరగాని కోరికలను కోరుకున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=299

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: