4-327-ఉ.
ఆ రథికోత్తముం దొడరి యందఱు నొక్కటఁ జుట్టుముట్టి పెం
పారఁగ బాణషట్కముల నంగములం బగులంగనేసి వి
స్ఫార గదా శరక్షురిక పట్టిసతోమర శూలఖడ్గముల్
సారథియుక్తుడైన రథిసత్తముపైఁ గురిపించి రేపునన్.
4-328-వ.
అట్లు గురియించిన నతండు.
4-329-క.
పెంపఱి యుండెను ధారా
సంపాతచ్ఛన్నమైన శైలము భంగిన్
గుంపులు కొని యాకసమునఁ
గంపించుచు నపుడు సిద్ధగణములు వరుసన్.
4-330-క.
హాహాకారము లెసఁగఁగ
నోహో యీ రీతి ధ్రువపయోరుహహితుఁడు
త్సాహము చెడి యిటు దైత్య స
మూహార్ణవమందు నేఁడు మునిఁగెనె యకటా!
4-331-వ.
అని చింతించు సమయంబున.
4-332-క.
తామాతని గెలిచితి మని
యా మనుజాశనులు పలుక నట నీహార
స్తోమము సమయించు మహో
ద్దా ముండగు సూర్యుఁ బోలి తద్దయుఁ దోఁచెన్.
భావము:
ఆ మహాయోధుడైన ధ్రువుణ్ణి యక్షులందరు ఒక్కసారిగా చుట్టుముట్టి ఆరేసి బాణాలతో అతని అవయవాలను భేదించారు. పెద్ద పద్ద గదలను, బాణాలను, చురకత్తులను, పట్టిసాలను, చిల్లకోలలను, శూలాలను, ఖడ్గాలను ధ్రువునిపైన, అతని సారథిపైన ఎడతెగకుండా కురిపించారు. ఆ విధంగా యక్షులు బాణాలను కురిపించగా ఆ ధ్రువుడు ఎడతెగని వర్షధారలతో కప్పబడిన కొండవలె యక్షుల ఆయుధ వర్షంలో మునిగిపోయాడు. అది చూచి ఆకాశంలోని సిద్ధులు వణికిపోతూ హాహాకారాలు చేస్తూ “అయ్యో! ధ్రువుడు అనే సూర్యుడు రాక్షస సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడు కదా!” అని చింతించే సమయంలో తాము ఆ ధ్రువుణ్ణి జయించామని అనుకుంటూ గంతులు వేస్తూ రాక్షసులు చెప్పుకొంటుండగా దట్టమైన మంచును పటాపంచలు చేస్తూ బయటపడిన సూర్యునివలె ధ్రువుడు కనిపించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=332
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment