Monday, April 6, 2020

ధ్రువోపాఖ్యానము - 24


4-284-చ.
హరి! భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై
వఱలిన భక్తియుక్తు లగువారల సంగతిఁ గల్గఁజేయు స
త్పురుష సుసంగతిన్ వ్యసనదుస్తర సాగర మప్రయత్నతన్
సరస భవత్కథామృత రసంబున మత్తుఁడనై తరించెదన్.
4-285-చ.
నిరతముఁ దావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి నె
వ్వరి మది వొందఁగాఁ గలుగు, వారలు తత్ప్రియ మర్త్యదేహముం
గరము తదీయ దార సుత కామ సుహృద్గృహ బంధు వర్గమున్
మఱతురు విశ్వతోముఖ! రమాహృదయేశ! ముకుంద! మాధవా!
4-286-సీ.
పరమాత్మ! మర్త్య సుపర్వ తిర్యఙ్మృగ;
దితిజ సరీసృప ద్విజగణాది
సంవ్యాప్తమును సదసద్విశేషంబును;
గైకొని మహదాది కారణంబు
నైన విరాడ్విగ్రహంబు నే నెఱుఁగుఁదుఁ;
గాని తక్కిన సుమంగళమునైన
సంతత సుమహితైశ్వర్య రూపంబును;
భూరిశబ్దాది వ్యాపార శూన్య
4-286.1-తే.
మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెఱుఁగఁ
బ్రవిమలాకార! సంసారభయవిదూర!
పరమమునిగేయ! సంతతభాగధేయ!
నళిననేత్ర! రమాలలనాకళత్ర!

భావము:
శ్రీహరీ! నిర్మలాత్ములై నీ సేవయందు ఆసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కథాసుధారసాన్ని మనసారా గ్రోలి, దుఃఖాలతో నిండిన దాటరాని సంసార సాగరాన్ని సులభంగా తరిస్తాను. విశ్వతోముఖా! రమామనోహరా! ముకుందా! మాధవా! నీ పాదపద్మాల సుగంధాన్ని అనుభవించిన వారు మరణ శీలమైన శరీరాన్ని లెక్కచేయరు. భార్యా పుత్రులను, మిత్రులను, భవనాలను, బంధువులను మరచిపోతారు. పరమాత్మా! మానవులు, దేవతలు, మృగాలు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలైన పలువిధాల ప్రాణులతో నిండి ప్రకృతి పురుషులతో కూడి మహదాదులకు కారణమైన నీ స్థూల రూపాన్ని నేను ఎరుగుదును. కాని నిత్యకల్యాణమూ, నిరంతర మహైశ్వర్య సంపన్నమూ అయి, శబ్ద వ్యాపారానికి గోచరం కాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రం నేను ఎరుగను. రాజీవనేత్రా! రమాకళత్రా! నీవు నిర్మలాకారుడవు. భవభయదూరుడవు. మునిజన సంస్తవనీయుడవు. పరమ భాగ్యధౌరేయుడవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=285

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: