4-341-క.
“తలపోయఁగ, భువి మాయా
వుల కృత్యంబెఱుఁగనెవరువోలుదు” రనుచుం
బలుకుచుఁ, దత్పురిఁజొరఁగాఁ
దలఁపఁగ, నదిగానరాక తద్దయు మానెన్
4-342-వ.
అట్లు పురంబున కరుగుట మాని చిత్రరథుండైన యా ధ్రువుండు సప్రయత్నుం డయ్యును బరప్రతియోగశంకితుండై యుండె; నయ్యెడ మహాజలధి ఘోషంబు ననుకరించు శబ్దంబు వినంబడె; నంత సకల దిక్తటంబుల వాయుజనితం బయిన రజః పటలంబు దోఁచె; దత్క్షణంబ యాకాశంబున విస్ఫురత్తటిత్ప్రభా కలిత గర్జారవయుక్త మేఘంబు లమోఘంబులై భయంకరాకారంబులై తోఁచె; అంత.
4-343-మ.
అనయంబున్ ధ్రువుమీఁద దైత్యకృతమాయాజాలమట్లేచి, బో
రన మస్తిష్కపురీష మూత్ర పల దుర్గంధాస్థి మేదశ్శరా
సన నిస్త్రింశ శరాసి తోమర గదా చక్రత్రిశూలాది సా
ధన భూభృద్భుజగావళిం గురిసె నుద్దండక్రియాలోలతన్.
భావము:
“ఆలోచించి చూస్తే ఈ భూమిమీద మాయావుల మాయలను తెలిసికొనడం ఎవరికీ సాధ్యం కాదు.” అంటూ శత్రునగరంలోకి ప్రవేశించాలని ఉత్సాహపడ్డాడు. కాని శత్రువుల పట్టణం ధ్రువుని కంటికి కనిపించలేదు. అందువల్ల ధ్రువుడు మహా ప్రయత్నశాలి అయినా శత్రువుల ప్రతిక్రియలు అంతుపట్టక, పట్టణంలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని మానుకున్నాడు. అప్పుడు మహాసముద్రఘోష వంటి ధ్వని వినిపించినట్లు. దిక్కులన్నీ పెనుగాలి రేపిన ధూళితో కప్పబడ్డట్లు. ఆకాశంలో మెరుపులు తళతళ మెరిసినట్లు. మేఘాలు భయంకరంగా గర్జించినట్లు తోచసాగింది. రాక్షసులు ఎడతెరపి లేకుండా ప్రయోగించిన మాయాజాలాలు ధ్రువుని మీద మెదడు, మలము, మూత్రము, మాంసము, క్రుళ్ళిన ఎముకలు, క్రొవ్వు కురిపించాయి; విండ్లు, కత్తులు, బాణాలు, కటారులు, చిల్లకోలలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలైన ఆయుధాలు, కొండలు, సర్పాలు వర్షింపించాయి.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=343
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment