4-323-మ.
ఘనశౌర్యోన్నతి తోడ సర్వ కకుభాకాశంబు లందుం బ్రతి
ధ్వనులోలిన్ నిగుడంగ శంఖము మహోద్యల్లీలఁ బూరింపఁ ద
న్నినదంబున్ విని యక్షకాంతలు భయాన్వీతాత్మలై రుగ్ర సా
ధనులై యక్షభటుల్ పురిన్ వెడలి రుత్సాహంబు సంధిల్లగన్.
4-324-వ.
ఇట్లు వెడలి యా ధ్రువునిం దాఁకిన.
4-325-చ.
కరము మహారథుండు భుజగర్వ పరాక్రమశాలియున్ ధను
ర్ధరుఁడును శూరుఁడౌ ధ్రువుఁడు దన్ను నెదిర్చిన యక్షకోటిఁ జె
చ్చరఁ బదుమూఁడువేల నొకచీరికిఁ గైకొన కొక్కపెట్ట భీ
కరముగ మూఁడు మూఁడు శితకాండములం దగ గ్రువ్వనేసినన్
4-326-ఉ.
వారు లలాటముల్ పగిలి వారక సోలియుఁ దేఱి యమ్మహో
దారు పరాక్రమప్రకట ధైర్యముఁ దత్కర లాఘవంబుఁ బ
ల్మాఱు నుతించుచుం గుపితమానసులై పదతాడితప్రదు
ష్టోరగకోటిఁ బోలెఁ జటులోగ్ర భయంకర రోషమూర్తులై.
భావము:
ధ్రువుడు ప్రతాపాతిశయంతో సర్వదిక్కులు, ఆకాశం మారుమ్రోగే విధంగా శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వనిని విని యక్షకాంతలు భయపడ్డారు. యక్షవీరులు భయంకరాలైన ఆయుధాలను ధరించి ఉత్సాహంతో పురంనుండి బయటికి వచ్చారు. యక్షులు అలా వచ్చి ధ్రువుణ్ణి ఎదుర్కొనగ మహారథుడు, వీరాధివీరుడు, ధనుర్ధారి, శూరుడు అయిన ధ్రువుడు తనను ఎదిరించిన పదమూడు వేల యక్షవీరులనూ లెక్కచేయకుండా భయకరంగా మూడు వాడి బాణాలతో గాయపరిచాడు. ఆ యక్షులు నొసళ్ళు పగిలి, మూర్ఛపోయి, తిరిగి తేరుకొని ఆ మహావీరుని పరాక్రమాన్ని ధైర్యాన్ని హస్తలాఘవాన్ని పలుమార్లు మెచ్చుకొంటూ కాళ్ళచేత త్రొక్కబడ్డ కాలసర్పాలవలె పట్టరాని రోషంతో భయంకరాకారాలు కలవారై…
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=13&padyam=326
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment