Tuesday, April 7, 2020

ధృవోపాఖ్యానము - 25


4-287-సీ.
సర్వేశ! కల్పాంత సమయంబు నందు నీ;
యఖిల ప్రపంచంబు నాహరించి
యనయంబు శేషసహాయుండవై శేష;
పర్యంక తలమునఁ బవ్వళించి
యోగనిద్రా రతి నుండి నాభీసింధు;
జస్వర్ణలోక కంజాత గర్భ
మందుఁ జతుర్ముఖు నమరఁ బుట్టించుచు;
రుచి నొప్పు బ్రహ్మస్వరూపి వైన
4-287.1-తే.
నీకు మ్రొక్కెద నత్యంత నియమ మొప్ప
భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
యవ్యయానంద! గోవింద! హరి! ముకుంద!
4-288-వ.
అట్లు యోగనిద్రా పరవశుండ వయ్యును జీవులకంటె నత్యంత విలక్షణుండ వై యుండుదువు; అది యెట్లనిన బుద్ధ్యవస్థాభేదంబున నఖండితం బయిన స్వశక్తిం జేసి చూచు లోకపాలన నిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవు గావున నీవు నిత్యముక్తుండవును, బరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, నాత్మవును, గూటస్థుండవును, నాదిపురుషుండవును, భగవంతుండవును, గుణత్రయాధీశ్వరుండవును నై వర్తింతువు; భాగ్యహీనుండైన జీవుని యందు నీ గుణంబులు గలుగవు; ఏ సర్వేశ్వరునం దేమి విరుద్ధగతులై వివిధ శక్తి యుక్తంబు లైన యవిద్యాదు లానుపూర్వ్యంబునం జేసి ప్రలీనంబు లగుచుండు; అట్టి విశ్వకారణంబు నేకంబు ననంతంబు నాద్యంబు నానందమాత్రంబు నవికారంబు నగు బ్రహ్మంబునకు నమస్కరించెద; మఱియు దేవా! నీవ సర్వవిధఫలం బని చింతించు నిష్కాము లయినవారికి రాజ్యాదికామితంబులలోనఁ బరమార్థం బయిన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబ; ఇట్లు నిశ్చితంబ యైనను సకాములయిన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు చేయించుచు, వృకాది భయంబు వలన రక్షించు చందంబునం గామప్రదుండవై సంసార భయంబు వలన బాపుదువు;” అని యిట్లు సత్యసంకల్పుండును, సుజ్ఞానియు నయిన ధ్రువునిచేత వినుతింపంబడి భృత్యానురక్తుం డైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె.

భావము:
సర్వేశ్వరా! భవ్యచరిత్రా! కమలదళనయనా! శాశ్వత శుభాకారా! లక్ష్మీవిహారా! అవ్యయానందా! గోవిందా! హరీ! ముకుందా! నీవు కల్పాంత కాలంలో సర్వప్రపంచాన్ని నీలో విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పంమీద శయనిస్తావు. యోగనిద్ర పొందుతావు. అప్పుడు నీ నాభి అనే సముద్రంలోనుండి పుట్టిన బంగారు తామరపువ్వులోనుండి చతుర్ముఖ బ్రహ్మను సృష్టిస్తావు. అటువంటి తేజోమయమైన నీ పరబ్రహ్మ స్వరూపానికి నిశ్చల నియమంతో నమస్కరిస్తున్నాను. ఆ విధంగా యోగనిద్రలో మైమరచి ఉన్నప్పటికీ నీవు జీవుల కంటె మిక్కిలి విలక్షణంగా ఉంటావు. అవస్థా భేదాన్ని పొందిన బుద్ధితో, చెక్కు చెదరని దృష్టితో జగత్తును రక్షించటానికి విష్ణురూపాన్ని గైకొంటావు. నీవు నిత్యముక్తుడవు; పరిశుద్ధుడవు; సర్వజ్ఞుడవు; ఆత్మవు; కూటస్థుడవు; ఆదిపురుషుడవు; భగవంతుడవు; మూడు గుణాలకు అధిపతివి. జీవుడు భాగ్యహీనుడు. అతనియందు నీ గుణాలు ఉండవు. ఏ సర్వేశ్వరుని యందైతే విరుద్ధగమనం కలిగి వివిధ శక్తులతో కూడిన అవిద్యాదులు ఒకదాని వెంట ఒకటి విలీనం అవుతాయో, అటువంటి జగత్కారణమూ, అద్వితీయమూ, అనంతమూ, ఆద్యమూ, ఆనందమాత్రమూ, అవికారమూ అయిన పరబ్రహ్మవు నీవు. నీకు నమస్కారం. దేవా! నిష్కాములైనవారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలైన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్ర పాదసేవనమే. ఇది నిశ్చయం. అయినప్పటికీ ఆవు తన దూడకు చన్నిస్తూ తోడేళ్ళు మొదలైన క్రూర మృగాల బారినుండి రక్షించే విధంగా సకాములైనవారి కోరికలను తీరుస్తూనే సంసార భయాలను తొలగిస్తావు.” అని ఈ విధంగా సత్సంకల్పుడు, సుజ్ఞాని అయిన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భృత్యులపై అత్యంత ప్రేమగల భగవంతుడు మనస్సులో తృప్తిపడి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=288

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: