7-384-వ
అని యిట్లానతిచ్చి బ్రహ్మాదిదేవతాసమూహంబుచేఁ బూజితుఁడై భగవంతుండైన శ్రీనృసింహదేవుండు తిరోహితుండయ్యె; ప్రహ్లాదుండును శూలికిఁ బ్రణమిల్లి తమ్మిచూలికి వందనంబులు జేసి బ్రజాపతులకు మ్రొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించినం జూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్యదానవరాజ్యంబునకుం బ్రహ్లాదుం బట్టంబు గట్టి యతనిచేతం బూజితుండై దీవించె; నంత నీశానాది నిఖిల దేవతలు వివిధంబులగు నాశీర్వాదంబులచేత నా ప్రహ్లాదునిఁ గృతార్థుం జేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజస్థానంబునకుఁ జనిరి; ఇట్లు విష్ణుదేవుండు నిజపార్శ్వచరు లిరువురు బ్రాహ్మణశాపంబునం జేసి బ్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపు లను వరాహ నారసింహ రూపంబుల నవతరించి వధియించె; ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించె; తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్త్రులను పేరులం బ్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించె; నివ్విధంబున మూఁడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంత రసంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తు లై హరిం గదిసి" రని చెప్పి నారదుం డిట్లనియె.
టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; ఆనతిచ్చి = చెప్పి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలైన; దేవ = దేవతల; సమూహంబు = సమూహముల; చేన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; భగవంతుండు = షడ్గుణైశ్వర్యసంపన్నుడు {భగవంతునిగుణషట్కములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు}; ఐన = అయిన; శ్రీ = శ్రీ; నరసింహ = నరసింహరూప; దేవుండు = దేవుడు; తిరోహితుండు = అదృశ్యుడు, అంతర్ధానుడు; అయ్యెన్ = అయ్యెను; ప్రహ్లాదుండును = ప్రహ్లాదుడుకూడ; శూలి = పరమశివుని {శూలి - శూలాయుధము ధరించువాడు, శివుడు}; కిన్ = కి; ప్రణమిల్లి = నమస్కరించి; తమ్మిచూలి = బ్రహ్మదేవున {తమ్మిచూలి - తమ్మి (పద్మమున) చూలి (పుట్టినవాడు), బ్రహ్మ}; కిన్ = కు; వందనంబులు = నమస్కారములు; చేసి = చేసి; ప్రజాపతుల్ = ప్రజాపతుల; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; భగవత్ = భగవంతుని; కళలు = అంశజులు; ఐన = అయిన; దేవతల్ = దేవతల; కున్ = కు; నమస్కరించినన్ = నమస్కరించగా; చూచి = చూసి; బ్రహ్మదేవుండు = బ్రహ్మదేవుడు; శుక్ర = శుక్రుడు; ఆది = మొదలైన; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తములతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; దైత్య = దితివంశజుల; దానవ = దనుజుల; రాజ్యంబున్ = రాజ్యమున; కున్ = కు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; పట్టంబుగట్టి = పట్టాభిషిక్తునిజేసి; అతని = అతని; చేతన్ = చేత; పూజితుండు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; దీవించెన్ = ఆశీర్వదించెను; అంతన్ = అంతట; ఈశాన = ఈశానుడు; ఆది = మొదలైన; నిఖిల = ఎల్ల; దేవతలున్ = దేవతలును; వివిధంబులు = పలువిధములైన; ఆశీర్వాదంబుల = ఆశీర్వచనముల; చేతన్ = చేత; ఆ = ఆ; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; కృతార్థున్ = సార్థకున్; చేసి = చేసి; తమ్మిచూలిని = బ్రహ్మదేవుని; ముందటన్ = ముందుభాగమున; ఇడుకొని = ఉంచుకొని; నిజస్థానంబున్ = స్వస్థానముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; ఇట్లు = ఈ విధముగ; విష్ణుదేవుండు = విష్ణుమూర్తి; నిజ = తన; పార్శ్వచరులు = పక్కనమెలగువారు; ఇరువురు = ఇద్దరు (2); బ్రాహ్మణ = బ్రాహ్మణులైన సనకాదుల; శాపంబునన్ = శాపము; చేసి = వలని; ప్రథమ = మొదటి; జన్మంబునన్ = జన్మలో; దితి = దితియొక్క; పుత్రులు = కుమారులు; ఐన = అయిన; హిరణ్యాక్ష = హిరణ్యాక్షుడు; హిరణ్యకశిపులన్ = హిరణ్యకశిపులను; వరాహ = వరాహ; నారసింహ = నరసింహ; రూపంబులన్ = స్వరూపములలో; అవతరించి = అవతరించి; వధియించెన్ = సంహరించెను; ద్వితీయ = రెండవ (2); భవంబునన్ = జన్మములో; రాక్షస = రాక్షసకులమున; జన్మంబున్ = జన్మము; తాల్చిన = ధరించిన; రావణ = రావణుడు; కుంభకర్ణులను = కుంభకర్ణులను; శ్రీరామ = శ్రీరామ; రూపంబునన్ = స్వరూపముతో; సంహరించెన్ = చంపెను; తృతీయ = మూడవ (3); జన్మంబునన్ = జన్మలో; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్రులు = దంతవక్త్రులు; అను = అనెడి; పేరులన్ = పేరులతో; ప్రసిద్ది = పేరుపొందిన; వారలను = వారిని; శ్రీకృష్ణ = శ్రీకృష్ణ; రూపంబునన్ = స్వరూపముతో; ఖండించెన్ = చంపెను; ఈ = ఈ; విధంబునన్ = లాగున; మూడు = మూడు (3); జన్మంబులన్ = జన్మలలో; గాఢ = తీవ్రమైన; వైర = విరోధ; అనుబంధంబునన్ = సంబంధమువలన; నిరంతర = ఎడతెగకుండెడి; సంభావిత = అలవడిన; ధ్యానులు = ధ్యానముగలవారు; ఐ = అయ్యి; వారలు = వారు; నిఖిల = సమస్తమైన; కల్మష = పాపములనుండి; విముక్తులు = విడివడినవారు; ఐ = అయ్యి; హరిన్ = విష్ణుమూర్తిని; కదిసిరి = చేరిరి; అని = అని; చెప్పి = చెప్పి; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈలాగున; అనియె = పలికెను.
భావము:
నృసింహస్వామి బ్రహ్మదేవునికి ఇలా తెలియజెప్పి, బ్రహ్మాది దేవతల పూజలను స్వీకరించి, అంతర్ధానం అయ్యాడు. ప్రహ్లాదుడు పరమేశ్వరునికి ప్రణామాలు ఆచరించాడు. విధాతకు వందనం చేశాడు. ప్రజాపతులకు ప్రణతులు చేశాడు. భగవదంశతో ప్రకాశించే దేవతలకు నమస్కారాలు చేశాడు. అంతట చతుర్ముఖ బ్రహ్మ, శుక్రుడు మొదలైన మునీంద్రులతో కలిసి ప్రహ్లాదుడిని దైత్య, దానవ రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసి రాజ్యం అప్పజెప్పి, ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడు దేవతలను అందరిని అర్హమైన విధంగా పూజించాడు. ఈశానుడు మొదలగు సమస్త దేవతలు ప్రహ్లాదుడిని నానావిధ ఆశీస్సులతో ధన్యుడిని చేశారు. బ్రహ్మదేవుడితో సహా దేవతలు అందరూ తమతమ స్థానాలకు బయలుదేరి వెళ్ళారు.
ఇలా సనకాది విప్రోత్తముల శాపానికి గురైన ద్వారపాలకులు, జయ విజయులు ప్రథమ జన్మలో దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. విష్ణుమూర్తి వరాహా, నారసింహ అవతారాలు ఎత్తి పరిమార్చాడు. ద్వితీయజన్మలో రావణ, కుంభకర్ణులుగా పుట్టారు. శ్రీరామునిగా అవతరించి అంతం చేశాడు. తృతీయజన్మగా శిశుపాల. దంతవక్త్రులుగా జన్మించారు. శ్రీకృష్ణుడై వారిని పరిమార్చాడు. ఇలా మూడు జన్మలలో గాఢమైన వైరభావంతో నిరంతం హరి స్మరణ చేస్తూ వీళ్ళు శాప విముక్తులు అయ్యారు. చివరకు స్వస్థానం అయిన వైకుంఠ ద్వారపాలకులు చేరారు.” అని నారద మహర్షి, మహారాజైన ధర్మరాజునకు వివరించి ఫలశ్రుతిగా ఇలా పలికాడు.bb
ఇలా సనకాది విప్రోత్తముల శాపానికి గురైన ద్వారపాలకులు, జయ విజయులు ప్రథమ జన్మలో దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా పుట్టారు. విష్ణుమూర్తి వరాహా, నారసింహ అవతారాలు ఎత్తి పరిమార్చాడు. ద్వితీయజన్మలో రావణ, కుంభకర్ణులుగా పుట్టారు. శ్రీరామునిగా అవతరించి అంతం చేశాడు. తృతీయజన్మగా శిశుపాల. దంతవక్త్రులుగా జన్మించారు. శ్రీకృష్ణుడై వారిని పరిమార్చాడు. ఇలా మూడు జన్మలలో గాఢమైన వైరభావంతో నిరంతం హరి స్మరణ చేస్తూ వీళ్ళు శాప విముక్తులు అయ్యారు. చివరకు స్వస్థానం అయిన వైకుంఠ ద్వారపాలకులు చేరారు.” అని నారద మహర్షి, మహారాజైన ధర్మరాజునకు వివరించి ఫలశ్రుతిగా ఇలా పలికాడు.bb
telugubhagavatam.org
No comments:
Post a Comment