Wednesday, April 6, 2016

దేవతల నరసింహ స్తుతి - పలికెద నని

7-343-క.
లికెద నని గమకముఁ గొను
లికినఁ గడు నలుగు విభుఁడు ప్రతివచనములం
లుకఁ డని నిలుచు; శశిముఖి
లువిడి హృదయమునఁ జనవు యమును గదురన్.
7-344-వ.
ఇట్లు నరహరిరూపంబు వారిజనివాసిని వీక్షించి శంకించి శాంతుడైన వెనుక డగ్గఱెదనని చింతించుచున్న వారిజసంభవుం డ ద్దేవుని రోషంబు నివారింప నితరుల కలవిగాదని ప్రహ్లాదుం జీరి యిట్లనియె.
టీకా:
          పలికెదన్ = పలకరించెదను; అని = అని; గమకముగొను = యత్నించును; పలికినన్ = పలకరించినను; కడు = మిక్కిలి; అలుగు = కోపించును; విభుడు = ప్రభువు; ప్రతి = మారు; వచనములన్ = మాటలు; పలుకడు = పలుకడు; అని = అని; నిలుచున్ = ఆగిపోవును; శశిముఖి = లక్ష్మీదేవి; పలువిడిన్ = ఈ విధముగ; హృదయమునన్ = హృదయమునందు; చనవు = మచ్చిక; భయమునున్ = భయమును; కదురన్ = అతిశయించును.
          ఇట్లు = ఈ విధముగ; నరహరి = నరసింహుని; రూపంబు = రూపము; వారిజనివాసినిన్ = లక్ష్మీదేవిని {వారిజనివాసిని - వారిజ (పద్మమునందు) నివాసిని (నివసించెడియామె), లక్ష్మి}; వీక్షించి = చూసి; శంకించి = అనుమానపడి; శాంతుడు = శాంతించినవాడు; ఐన = అయిన; వెనుక = తరువాత; డగ్గఱిదన్ = దగ్గరకు వెళ్ళెదను; అని = అని; చింతించుచున్న = ఆలోచించుతున్న; వారిజసంభవుండు = బ్రహ్మదేవుడు {వారిజసంభవుడు - వారిజ (పద్మమునందు) సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; ఆ = ఆ; దేవుని = నరసింహదేవుని; రోషంబున్ = కోపమును; నివారింపన్ = తగ్గించుటకు; ఇతరులు = ఇతరుల; కిన్ = కి; అలవి = వీలు; కాదు = కాదు; అని = అని; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చీరి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
            ఆ చల్లనితల్లి చంద్రవదన శ్రీలక్ష్మీ చిరునవ్వుతో శ్రీహరిని పలుకరిద్దాం అనుకుంది. కానీ ఆ ఉగ్ర రూపం చూస్తుంటే, మాట్లాడితే మండిపడతాడేమో బదులు పలుకడేమో అని ఆగిపోయింది. మనస్సులో ఒక వైపు చనువు, ఒక వైపు భయమూ కలుగుతుండగా సంకోచంతో అలా నిలబడిపోయింది.
            పద్మాలయ లక్ష్మీదేవి ఇలా నరకేసరి రూపం చూసి సందేహించి, ఆయన శాంతించిన పిమ్మట దగ్గరకు వెళ్తాను అనుకుంది. ఆమె మనోభావం గ్రహించిన బ్రహ్మదేవుడు ఈ ఉగ్ర నరసింహుని కోపం తగ్గించటం ప్రహ్లాదుడు తప్పించి ఇంక ఎవరివల్లా కాదని తలచి అతనిని పిలిచి ఇలా అన్నాడు.
७-३४३-क.
पलिकेद ननि गमकमुँ गोनु;
बलिकिनँ गडु नलुगु विभुँडु प्रतिवचनमुलं
बलुकँ डनि निलुचु; शशिमुखि
बलुविडि हृदयमुनँ जनवु भयमुनु गदुरन्.
७-३४४-व.
इट्लु नरहरिरूपंबु वारिजनिवासिनि वीक्षिंचि शंकिंचि शांतुडैन वेनुक डग्गर्रेदननि चिंतिंचुचुन्न वारिजसंभवुं ड द्देवुनि रोषंबु निवारिंप नितरुल कलविगादनि प्रह्लादुं जीरि यिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

1 comment:

Unknown said...

Kuwait Nri's, is a kuwait based multilingual web portal which emphasizes on covering news from kuwait, India, Middle East, USA and all over the world. The site also keeps in view of all types of reader groups with different mindsets, age groups and also gender tastes and keep needs in mind and covers.. PLEASE VISIT www.kuwaitnris.com