Friday, April 22, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – మహాత్మా

7-360-వ.
మహాత్మా! సుజనులయిన బ్రహ్మాదు లందును దుర్జనులైన మా యందును సేవానురూపంబుగం బక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు జేయుదువు; కందర్ప సమేతం బగు సంసారకూపంబునం గూలుచున్న మూఢజనులం గూడి కూలెడు నేను భవదీయభృత్యుం డగు నారదుని యనుగ్రహంబునం జేసి నీ కృపకుం బాత్రుండ నైతి; నన్ను రక్షించి మజ్జనకుని వధియించుట నా యందులఁ బక్షపాతంబు గాదు; దుష్టదనుజ సంహారంబును శిష్ట భృత్య మునిజన రక్షాప్రకారంబును నీకు నైజగుణంబులు; విశ్వంబు నీవ; గుణాత్మకం బయిన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతుభూతగుణయుక్తుండవై రక్షకసంహారకారాది నానారూపంబుల నుండుదువు; సదసత్కారణకార్యాత్మకం బయిన విశ్వంబునకు పరమకారణంబు నీవ; నీ మాయచేత వీఁడు దా ననియెడి బుద్ధి వికల్పంబు దోఁచుగాని నీకంటె నొండెద్దియు లేదు; బీజంబు నందు వస్తుమాత్రభూత సౌక్ష్మ్యంబును వృక్షంబు నందు నీలత్వాది వర్ణంబునుం గలుగు తెఱంగున; విశ్వంబునకు నీ యంద జన్మ స్థితి ప్రకాశ నాశంబులుం గలుగు; నీ చేత నయిన విశ్వంబు నీ యంద నిలుపు కొని తొల్లి ప్రళయకాలపారావారంబునఁ బన్నగేంద్రపర్యంకంబునఁ గ్రియారహితుండవై నిజసుఖానుభవంబు జేయుచు నిద్రితుని భంగి యోగనిమీలితలోచనుండవై మెలంగుచుఁ గొంత కాలంబునకు నిజ కాలశక్తిచేతం బ్రేరితంబులై ప్రకృతిధర్మంబు లయిన సత్త్వాదిగుణంబుల నంగీకరించి సమాధిచాలించి విలసించుచున్న నీనాభి యందు వటబీజంబువలన నుద్భవించు వటంబు తెఱంగున నొక్క కమలంబు సంభవించె; నట్టి కమలంబువలన నాల్గుమోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నొండయిన రూపంబు లేకుండుటఁ జింతించి జలాంతరాళంబుఁ బ్రవేశించి జలంబు లందు నూఱు దివ్యవత్సరంబులు వెదకి తన జన్మంబునకు నుపాదానకారణం బైన నిన్ను దర్శింప సమర్థుండు గాక, మగిడి కమలంబుకడకుం జని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భరతపంబు జేసి పృథివి యందు గంధంబు గను చందంబునఁ దన యందు నానాసహస్రవదన శిరో నయన నాసా కర్ణ వక్త్ర భుజ కర చరణుండును బహువిధాభరణుండును మాయాకలితుండును మహాలక్షణలక్షితుండును నిజప్రకాశదూరీకృత తముండును బురుషోత్తముండును నయిన నిన్ను దర్శించె; న య్యవసరంబున.
టీకా:
          మహాత్మా = గొప్పవాడా; సుజనుల్ = దేవతలు; అయిన = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలైనవారి; అందును = ఎడలను; దుర్జనులు = రాక్షసులు; ఐన = అయిన; మా = మా; అందును = ఎడలను; సేవా = కొలచినందులకు; అనురూపంబులు = తగినవి; కన్ = అగునట్లు; పక్ష = స్వపక్షమువారు; అపక్షంబులు = పరపక్షమువారను తలపు; లేక = లేకుండగ; కల్పవృక్షంబు = కల్పవృక్షము; చందంబునన్ = విధముగ; ఫల = ఫలితములను; ప్రదానంబు = ఇచ్చుటను; చేయుదువు = చేసెదవు; కందర్ప = మన్మథునితో, కామముతో; సమేతంబు = కూడినది; అగు = అయిన; సంసార = సంసారము యనెడి; కూపంబునన్ = నూతిలో; కూలుచున్న = పడిపోతున్నట్టి; మూఢ = తెలివిహీనులైన; జనులన్ = వారిని; కూడి = కలిసి; కూలెడు = కూలిపోవుచున్న; నేను = నేను; భవదీయ = నీ యొక్క; భృత్యుండు = దాసుండు; అగు = అయిన; నారదుని = నారదుని; అనుగ్రహంబునన్ = దయ; చేసి = వలన; నీ = నీ యొక్క; కృప = కరుణ; కున్ = కు; పాత్రుండను = తగినవాడను; ఐతి = అయితిని; నన్నున్ = నన్ను; రక్షించి = కాపాడి; మత్ = నా యొక్క; జనకుని = తండ్రిని; వధియించుట = చంపుట; నా = నా; అందున్ = ఎడల; పక్షపాతంబు = మొగ్గుచూపుట; కాదు = కాదు; దుష్ట = చెడ్డ; దనుజ = రాక్షసులను; సంహారంబును = చంపుట; శిష్ట = మంచివారు; భృత్య = దాసులు; ముని = మునుల యైన; జన = వారిని; రక్షా = కాపాడెడి; ప్రకారంబును = విధానము; నీ = నీ; కున్ = కు; నైజ = సహజ; గుణంబులు = లక్షణములు; విశ్వంబు = జగత్తు; నీవ = నీవే; గుణా = త్రిగుణముల {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబు = రూపమైనది; అయిన = ఐన; విశ్వంబున్ = జగత్తును; సృజియించి = సృష్టించి; అందున్ = దానిలో; ప్రవేశించి = చేరి; హేతుభూత = కారణభూతమైన; గుణ = లక్షణములతో; యుక్తుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; రక్షక = కాపాడుట; సంహార = చంపుటలను; కార = కలిగించుట; ఆది = మొదలగు; నానా = వివిధరకముల; రూపంబులన్ = రూపములలో; ఉండుదువు = ఉండెదవు; సత్ = సత్తు, సత్యమైనది; అసత్ = అసత్తు, సత్యదూరమైనది; కారణ = కారణము; కార్యా = కార్యముల; ఆత్మకంబు = రూపమైనది; అయిన = ఐన; విశ్వంబున్ = జగత్తును; కున్ = కు; పరమ = ముఖ్య; కారణంబు = హేతువు; నీవ = నీవే; నీ = నీ యొక్క; మాయ = మహిమ; చేతన్ = వలన; వీడు = ఇతడు; తాన్ = తను; అనియెడి = అనెడి; బుద్ధి = బుద్ధి; వికల్పంబున్ = భ్రాంతిచే; తోచున్ = అనిపించును; కాని = తప్పించి; నీ = నీ; కంటెన్ = కంటెను; ఒండు = ఇతరము; ఎద్దియున్ = ఏదియు; లేదు = లేదు; బీజంబున్ = విత్తు; అందున్ = లో; వస్తుమాత్ర = అణువంతది; భూత = అయినట్టి; సౌక్ష్మ్యంబును = చిన్నది యగుటను; వృక్షంబు = చెట్టును; అందున్ = వానిలో; నీలత్వ = నీలపురంగు; ఆది = మొదలగు; వర్ణంబునున్ = రంగులు; కలుగు = కలిగెడి; తెఱంగునన్ = విధముగనే; విశ్వంబున్ = జగత్తున; కున్ = కు; నీ = నీ; అంద = అందే; జన్మ = పుట్టుట; స్థితి = ఉండుట; ప్రకాశ = వృద్ధినొందుట; నాశంబులున్ = నాశనములు; కలుగున్ = కలుగును; నీ = నీ; చేతన్ = వలన; అయిన = గలిగినట్టి; విశ్వంబున్ = జగత్తు; నీ = నీ; అంద = అందే; నిలుపుకొని = ఉంచుకొని; తొల్లి = పూర్వము; ప్రళయకాల = ప్రళయకాలమునందలి; పారావారంబునన్ = (పాల) సముద్రమునందు; పన్నగేంద్ర = ఆదిశేషుడను; పర్యంకంబునన్ = పాన్పుపైన; క్రియా = పనులు; రహితుండవు = మానినవాడవు; ఐ = అయ్యి; నిజ = సత్యమైన; సుఖ = సుఖమును; అనుభవంబున్ = అనుభవించుటను; చేయుచున్ = చేయుచు; నిద్రితుని = నిద్రించువాని; భంగిన్ = వలె; యోగ = యోగధ్యానమున; నిమీలిత = సగముమూయబడిన; లోచనుండవు = కన్నులుగలవాడవు; ఐ = అయ్యి; మెలంగుచున్ = వర్తించుచు; కొంత = కొంత; కాలంబున్ = సమయమున; కున్ = కు; నిజ = నీకుసంబంధించిన; కాల = కాలముయొక్క; శక్తి = ప్రభావము; చేతన్ = వలన; ప్రేరితంబులు = ప్రేరేపింబడినవి; ఐ = అయ్యి; ప్రకృతి = అవిద్యా; ధర్మబులు = గుణములు; అయిన = ఐన; సత్వాదిగుణంబులన్ = త్రిగుమములను; అంగీకరించి = స్వీకరించి; సమాధిన్ = ధ్యానసమాధిని; చాలించి = ఆపి; విలసించుచున్న = విలసిల్లిన; నీ = నీ యొక్క; నాభి = బొడ్డు; అందున్ = అందు; వట = మర్రి; బీజంబు = విత్తనము; వలనన్ = వలన; ఉద్భవించు = పుట్టెడి; వటంబు = మర్రిచెట్టు; తెఱంగునన్ = విధముగ; ఒక్క = ఒక; కమలంబు = పద్మము; సంభవించెన్ = పుట్టినది; అట్టి = అటువంటి; కమలంబు = పద్మము; వలనన్ = నుండి; నాల్గు = నాలుగు (4); మోముల = ముఖములుగల; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; జన్మించి = పుట్టి; దిశలు = అన్నిపక్కలకు; వీక్షించి = చూసి; కమలంబున్ = పద్మమున; కున్ = కు; ఒండు = ఇతరమైనది; అయిన = ఐన; రూపంబున్ = ఆకారములు; లేకుండుటన్ = లేకపోవుటను; చింతించి = యోచించి; జల = నీటి; అంతరాళంబున్ = లోనికి; ప్రవేశించి = చేరి; జలంబుల్ = నీటి; అందున్ = లో; నూఱు = వంద (100); దివ్యవత్సరంబులు = దివ్యసంవత్సరములు {దివ్యసంవత్సరము - 360 మానవ సంవత్సరములు (దేవతల దినము - మానవ సంవత్సరము)}; వెదకి = వెతికి, అన్వేషించి; తన = తన యొక్క; జన్మంబున్ = పుట్టుక; కునున్ = కు; ఉపాదాన = ప్రధాన {ఉపాదానకారణము - కుండకు మట్టి బట్టకు దారము ఉపాదానకారణములు}; కారణంబు = హేతువు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; దర్శింపన్ = చూచుటకు; సమర్థుండు = శక్తిగలవాడు; కాక = కాలేక; మగిడి = మరల; కమలంబు = పద్మము; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; విస్మయంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; చిర = ఎంతో; కాలంబున్ = కాలము; నిర్భర = భరింపరాని; తపంబున్ = తపస్సును; చేసి = చేసి; పృథివి = భూమి; అందున్ = లో; గంధంబు = వాసన; కను = చూచెడి; చందంబునన్ = విధముగనే; తన = తన; అందున్ = లోననే; నానా = పలు; సహస్ర = వేలకోలది; వదన = మోములు; శిరస్ = తలలు; నయన = కన్నులు; నాసా = ముక్కులు; కర్ణ = చెవులు; వక్త్ర = నోర్లు; భుజ = భుజములు; కర = చేతులు; చరణుండును = పాదములుగలవాడు; బహు = అనేకమైన; విధ = రకముల; ఆభరణుండును = అలంకారములుగలవాడు; మాయా = మాయతో; కలితుండును = కూడినవాడు; మహా = గొప్ప; లక్షణ = గుణములు; లక్షితుండును = ప్రకాశించెడివాడును; నిజ = తన; ప్రకాశ = ప్రకాశముచేత; దూరీకృత = పోగొట్టబడిన; తముండును = అజ్ఞానముగలవాడు; పురుషోత్తముడును = పురుషులలో శ్రేష్ఠుడు; అయిన = ఐన; నిన్నున్ = నిన్ను; దర్శించెన్ = చూచెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:
            మహాత్మా! నరకేసరి రూపదారీ! శ్రీహరీ! బ్రహ్మాది దేవతలకూ, దుష్టాత్ములము అయిన మాకూ ఏమాత్రం పక్షపాతం లేకుండా కొలచిన భక్తి చూసి ఫలితాన్ని ప్రసాదిస్తావు. అలా స్వ పర భేదం లేకుండా అనుగ్రహించటంలో కల్పవృక్షానివి. మన్మథుడు విహరించే సంసారకూపంలో మదాంధులుతో పాటూ నేనూ పడవలసిన వాడను. నీ దాసుడు అయిన నారద మహర్షుల వారి ఉపదేశం వలన నీ కృప పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించటం నా మీది పక్షపాతంతో కాదు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ నీ సహజగుణాలు కదా. విశ్వమూర్తివీ, విరాట్ శ్వరూపానివీ నీవే. నీవే త్రిగుణాత్మకమైన విశ్వాన్ని సృష్టిస్తావు. ఆ సృష్టిలో ప్రవేశిస్తావు. కారణభూత రూపా లైన గుణములతో నీవే రక్షకుడవుగా, శిక్షకుడవుగా నానా రూపాలూ ధరిస్తావు, నిత్యా అనిత్య, కార్య కారణ సంబంధం కలిగిన ఈ ప్రపంచానికి మూలకారణం నువ్వే. నీ మాయ చేతనే వీడూ, వాడూ, నేను, నువ్వూ అనే భ్రాంతి కలుగుతుంది. అంతేకాని ఈ విశ్వంలో నువ్వు తప్ప ఇతరమైనదేదీ లేదు. 
            విత్తనంలో అతి సూక్ష్మరూపంలో వస్తుతత్వం నిక్షిప్తం అయినట్లు, వృక్షంలో నీలం మొదలైన రంగులు దాగి ఉన్నట్లు, విశ్వం నీలోనే జన్మ, స్థితి, ప్రకాశ, నాశనములను పొందుతుంది. నీ చేత సృష్మింపబడిన ఈ విశ్వాన్ని నువ్వు నీలోనే దాచుకుని ప్రళయకాలంలో క్షీరమహాసముద్రం మధ్యలో శేషతల్పం మీద క్రియారహితంగా శయనించి, ఆత్మానందం అనుభవిస్తూ యోగనిద్రలో ఉంటావు. యోగి నిద్రపోతున్నట్లు నిమీలిత నేత్రాలతో శయనించి ఉంటావు. కొంత కాలానికి స్వకీయమైన కాలమహిమ వలన నీవు ప్రకృతి ధర్మాలైన సత్త్వాది గుణాలను స్వీకరించి, సమాధి చాలించి, తేజరిల్లుతుంటావు. అటువంటి సమయంలోనే వటబీజం నుండి మహా వృక్షం వెలువడే విధంగా, నీ నాభి కమలం నుండి ముందుగా ఒక కమలం పుట్టింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మదేవుడు పుట్టాడు. నాలుగు ముఖాలతో నాలుగువైపులా పరిశీలించాడు, కమలం తప్ప మరొకటేదీ కనబడలేదు. ఆలోచించి జలాలలోకి వెళ్ళి నూరు (100) దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధానకారణమైన నిన్ను దర్శించలేక పోయాడు. మళ్ళీ కమలం చేరి, ఆశ్చర్యపడి, చాలాకాలం గొప్ప తపస్సు చేశాడు. చివరకు పృథివి యందు గంథాన్ని కనుగొన్నట్లు, తనలో నిన్ను చూడగలిగాడు. అపుడు నువ్వు సహస్ర శీర్షుడవై,సహస్రాక్షుడవై, సహస్ర వదనుండవై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీనులతో, పెక్కువేల భుజాలతో, అనేకానేక కర, చరణలతో ఒప్పుతూ దర్శనమిచ్చావు. నానాలంకార భూషితుడవు, మాయా మయుడవు, మహాలక్షణ లక్షితుడవు, స్వయం ప్రకాశుడవూ, తమస్సును తొలగించువాడవూ, పురుషోత్తముడవూ అయిన విశ్వవిరాట్ స్వరూపాన్ని బ్రహ్మ దేవుడుదర్శించాడు.
७-३६०-व.
महात्मा! सुजनुलयिन ब्रह्मादु लंदुनु दुर्जनुलैन मा यंदुनु सेवानुरूपंबुगं बक्षापक्षंबुलु लेक कल्पवृक्षंबु चंदंबुन फलप्रदानंबु जेयुदुवु; कंदर्प समेतं बगु संसारकूपंबुनं गूलुचुन्न मूढजनुलं गूडि कूलेडु नेनु भवदीयभृत्युं डगु नारदुनि यनुग्रहंबुनं जेसि नी कृपकुं बात्रुंड नैति; नन्नु रक्षिंचि मज्जनकुनि वधियिंचुट ना यंदुलँ बक्षपातंबु गादु; दुष्टदनुज संहारंबुनु शिष्ट भृत्य मुनिजन रक्षाप्रकारंबुनु नीकु नैजगुणंबुलु; विश्वंबु नीव; गुणात्मकं बयिन विश्वंबु सृजियिंचि यंदुं ब्रवशिंचि हेतुभूतगुणयुक्तुंडवै रक्षकसंहारकारादि नानारूपंबुल नुंडुदुवु; सदसत्कारणकार्यात्मकं बयिन विश्वंबुनकु परमकारणंबु नीव; नी मायचेत वीँडु दा ननियेडि बुद्धि विकल्पंबु दोँचुगानि नीकंटे नोंडेद्दियु लेदु; बीजंबु नंदु वस्तुमात्रभूत सौक्ष्म्यंबुनु वृक्षंबु नंदु नीलत्वादि वर्णंबुनुं गलुगु तेर्रंगुन; विश्वंबुनकु नी यंद जन्म स्थिति प्रकाश नाशंबुलुं गलुगु; नी चेत नयिन विश्वंबु नी यंद निलुपु कोनि तोल्लि प्रळयकालपारावारंबुनँ बन्नगेंद्रपर्यंकंबुनँ ग्रियारहेतुंडवै निजसुखानुभवंबु जेयुचु निद्रितुनि भंगि योगनिमीलितलोचनुंडवै मेलंगुचुँ गोंत कालंबुनकु निज कालशक्तिचतं ब्रेरितंबुलै प्रकृतिधर्मंबु लयिन सत्त्वादिगुणंबुल नंगीकरिंचि समाधिचालिंचि विलसिंचुचुन्न नीनाभि यंदु वटबीजंबुवलन नुद्भविंचु वटंबु तेर्रंगुन नोक्क कमलंबु संभविंचे; नट्टि कमलंबुवलन नाल्गुममुल ब्रह्म जन्मिंचि दिशलु वीक्षिंचि कमलंबुनकु नोंडयिन रूपंबु लेकुंडुटँ जिंतिंचि जलांतराळंबुँ ब्रवेशिंचि जलंबु लंदु नूर्रु दिव्यवत्सरंबुलु वेदकि तन जन्मंबुनकु नुपादानकारणं बैन निन्नु दर्शिंप समर्थुंडु गाक, मगिडि कमलंबुकडकुं जनि विस्मयंबु नोंदि चिरकालंबु निर्भरतपंबु जेसि पृथिवि यंदु गंधंबु गनु चंदंबुनँ दन यंदु नानासहस्रवदन शिरो नयन नासा कर्ण वक्त्र भुज कर चरणुंडुनु बहुविधाभरणुंडुनु मायाकलितुंडुनु महालक्षणलक्षितुंडुनु निजप्रकाशदूरीकृत तमुंडुनु बुरुषोत्तमुंडुनु नयिन निन्नु दर्शिंचे; न य्यवसरंबुन.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: