Wednesday, October 21, 2015

కాళియ మర్దన - వివిధభావాకార


10.1-693-సీ.
వివిధ భావాకార వీర్యబీజాశయ;
  జవయోనియుతముగా జగము లెల్ల
నీవ చేసితి మున్న; నే మా జగంబులో;
  సహజకోపనులము సర్పములము;
దుర్వారమైన నీ తోరంపు మాయ నే;
  మెఱిఁగి దాఁటెడు పని కెంతవార;
మంతకుఁగారణ మఖిలేశ్వరుండవు;
  సర్వజ్ఞుఁడవు నీవు జలజనయన!

10.1-693.1-తే.
మనిచె దేనిని మన్నించి మనుపు నన్ను
నిగ్రహించెద వేనిని నిగ్రహింపు;
మింక సర్వేశ! మాయిమ్ము లెందుఁ గలవు
చిత్తమందున్న క్రమమునఁ జేయఁదగును.

      వివిధ = నానావిధములైన; భావ = జననాది వికారములు; ఆకార = ఆకృతులు; వీర్య = శక్తులు; బీజ = మూలలక్షణములు; ఆశయ = అభిప్రాయములు; జవ = వేగములు; యోని = జన్మస్థానములు; యూతముగా = కూడుకొన్నవి; కాన్ = అయిన; జగములు = భువనములు; ఎల్లన్ = సమస్తమును; నీవ = నీవే; చేసితి = సృష్టించితివి; మున్న = ముందుగనే; నేము = మేము; ఆ = ఆ; జగంబు = విశ్వము; లోన్ = అందు; సహజకోపనులము = కోపముతోడనేపుట్టినవారము {సహజకోపనులము - సహ (కూడా) జ (పుట్టిన) కోపనులము (కోపముకలవారము), పాములము}; సర్పములము = పాములము, ప్రాకులాడువారము; దుర్వారము = దాటరానిది; ఐన = అయిన; నీ = నీ యొక్క; తోరంపు = మిక్కిలి అధికమైన; మాయన్ = మాయను; నేము = మేము; ఎఱిగి = తెలిసికొని; దాటెడు = దాటుటను; పని = చేయుట; కిన్ = కు; ఎంతవారము = అశక్తులము; అంత = సమస్తమున; కున్ = కు; కారణము = కారణభూతుడవు; అఖిలేశ్వరుండవు = సర్వనియామకుడవు; సర్వఙ్ఞుడవు = అన్నితెలిసినవాడవు;        నీవు = నీవు; జలజనయన = పద్మాక్ష, కృష్ణా.
        మనిచెదు = కాపాడెడివాడవు; ఏనినిన్ = అయినచో; మన్నించి = ఆదరించి; మనుపు = కాపాడుము; నన్నున్ = నన్ను; నిగ్రహించెదవు = శిక్షించెడివాడవు; ఏనినిన్ = అయినచో; నిగ్రహింపుము = శిక్షింపుము; ఇంక = ఇక; సర్వేశా = కృష్ణా {సర్వేశుడు - పంచకృత్యములను (సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రములను) నియమించు ప్రభువు, విష్ణువు}; మా = మాకు; ఇమ్ములు = నివాసములు; ఎందు = ఎక్కడ; కలవు = కలిగించెదవు; చిత్తము = నీ మనసు; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; క్రమమునన్ = ప్రకారముగా; చేయదగును = చేయుము.

        పద్మాక్షా! శ్రీకృష్ణా! ఈ సృష్టి అంతటికి నువ్వే కారణభూతుడవు, సర్వేశ్వరుడవు. సమస్తము తెలిసిన వాడవు. పూర్వం నువ్వే ఈ లోకాలన్నిటిని వివిధ స్వభావాలు, రూపాలు, వీర్యములు, వీర్యాతిశయాలు, జననస్థానాలతో కూడినవిగా సృష్టించావు. మేం ఆ సృష్టిలో సహజంగా కోపస్వభావం కలిగిన పాములం. అద్భుతమైన నీ మాయ దాటరానిది. ఆ మాయని తెలుసుకొని దాటాలంటే మా వల్ల కాదు. కనుక పరమేశ్వరా! నన్ను క్షమించదలచుకొంటే క్షమించి పాలించు. శిక్షించదలచు కొంటే శిక్షించు. ఇంకా మా ఇష్టాలు ఎక్కడున్నాయి. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=85
చదువుకుందాం భాగవతం - బాగుపడదాం మనం అందరం

No comments: