10.1-683-వ.
మఱియుఁ గలండు లేఁడు; సర్వంబు నెఱుంగు; నించుకనెఱుంగు బద్ధుండు; విముక్తుం డొకం; డనేకుఁడు నను నివి మొదలుగాఁగల వాదంబులు మాయవలన ననురోధింపుదురు గావున నానావాదానురోధకుండ
వయ్యు, నభిధానాభిధేయ శక్తిభేదంబులవలన బహుప్రభావప్రతీతుండ వయ్యుఁ,
జక్షురాది రూపంబులవలనఁ బ్రమాణ రూపకుండవయ్యు, నిరపేక్షజ్ఞానంబు
గలిమిం గవివయ్యు, వేదమయనిశ్వాసత్వంబువలన శాస్త్రయోనివయ్యు,
సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ రూపంబులవలనఁ జతుర్మూర్తివయ్యు,
భక్తజనపాలకుండవయ్యు, నంతఃకరణ ప్రకాశత్వంబుగలిగి
సేవకజన ఫలప్రదానంబుకొఱకు గుణాచ్ఛాదకుండవయ్యుఁ, జిత్తాదివర్తనంబులఁ
గానందగిన గుణంబులకు సాక్షివై యొరుల కెఱుంగరామి నగోచరుండవయ్యుఁ, దర్కింపరాని పెంపు వలన నవ్యాహతవిహారుండవయ్యు, సకలకార్య
హేతువయ్యు, నంతఃకరణప్రవర్తకత్వంబువలన హృషీకేశుండవయ్యును,
సాధనవశంబుగాని యాత్మారామత్వంబువలన మునివయ్యు, స్థూల
సూక్ష్మగతుల నెఱుంగుచు నెందుం జెందక నీవు విశ్వంబుగాకయు విశ్వంబు నీ వయ్యును,
విశ్వభావాభావ సందర్శనంబు చేయుచు విద్యావిద్యలకు హేతువైన నీకుం
బ్రణామంబు లాచరించెదము; అవధరింపుము.
మఱియున్ = అంతేకాక; కలండు
= దేవుడున్నాడు {కలండు - దేవుడు త్రికాలములు భూత భవిష్యత్
వర్తమానములందు ఉన్నాడు}; లేడు = దేవుడులేడు {లేడు - దేవుడు త్రికాలములు భూత భవిష్యత్ వర్తమానములందు లేడు}; సర్వంబునెఱుంగున్ = దేముడు సర్వఙ్ఞుడు {సర్వంబునెఱుగు
- సృష్టి స్థితి లయ తిరోధాననానుగ్రములనెడి పంచకృత్యములు మొదలైనవానిని అన్నిటిని
దేముడు ఎరుగును}; ఇంచుకనెఱుంగును = దేముడు కించిద్ఙ్ఞుడు;
బద్దుండు = మాయకు లోబడువాడు {బద్దుండు - ప్రకృతి
పాశములచేత కట్టుబడువాడు, మాయకు లోబడువాడు}; విముక్తుండు = ముక్తిపొందినవాడు {విముక్తుడు -
ప్రకృతి పాశములనుండి విముక్తి పొందినవాడు}; ఒకండు =
అన్యరహితుడు; అనేకుండును = సర్వదేవతారూపకుడు {అనేకుడు - శ్రు. ఏకోదేవా బహుధానివిష్టః, ఒక్కడుగాను
అనేకులుగాను ఉన్నవాడు దేవుడు}; అను = అనెడి; ఇవి = ఇవి; మొదలురగాగల = మొదలైన; వాదంబులు = మతములు, ప్రసంగములు; మాయ = భ్రమ; వలనన్ = వలన; అనురోధింపుదురు
= జరిపెదరు; కావున = అందుచేత; నానా =
అనేకవిధములైన; వాదా = ప్రసంగములకు; అనురోధకుండవు
= అనుకూలుడవు; అయ్యున్ = అయినప్పటికి; అభిదాన
= పేర్ల యొక్క; అభిధేయ = పేర్లుగల వస్తువులయొక్క; శక్తి = వస్తుగుణముల; భేదంబుల = ఎక్కువతక్కుల;
వలన = చేత; బహు = అనేకవిధములైన {బహుప్రభావప్రతీతుడు - క. నానా దేహోపాధుల, నానాత్వ
భ్రాంతినొంది నానీదనుచున్, నానాభిమానములచే, నానావిభవంబులాయె నారాయణుఁడే (రామస్తవరాజము)}; ప్రభావ
= సర్వజ్ఞత్వాదిమహిమలచేత; ప్రతీతుండవు = ప్రసిద్ధుడవు;
అయ్యున్ = అయినప్పటికి; చక్షుస్ = కన్ను;
ఆది = మొదలైన; రూపంబుల = అవయవములచేత; ప్రమాణ = నిశ్చయింపబడిన; రూపకుండవు = రూపముకలవాడవు;
అయ్యున్ = అయినప్పటికి; నిరపేక్ష =
సాధానానంతరాపేక్షలేని; ఙ్ఞానంబున్ = విఙ్ఞానమును; కలిమిన్ = కలిగుండుటచేత; కవివి = స్వయంప్రకాశుడవు;
అయ్యున్ = అయినప్పటికి; వేదమయ = వేదస్వరూపమైన; నిశ్వాసత్వంబు = నిశ్వాసకలిగియుండుట;
వలనన్ = చేత; శాస్త్ర = శాస్త్రములకు; యోనివి = జన్మస్థానమైనవాడవు; అయ్యున్ = అయినప్పటికి;
సంకర్షణ = అహంకారమునకధిదేవత; వాసుదేవ =
బుద్ధికధిదేవత; ప్రద్యుమ్న = మనస్సునకధిదేవత; అనిరుద్ధ = చిత్తమునకధిదేవత; రూపంబుల =
వ్యూహరూపములుకలవాడవు; వలన = అగుట వలన; చతుర్
= నాలుగువిధములైన; మూర్తివి = వ్యూహములు కలవాడవు; అయ్యున్ = అయినప్పటికి; భక్త = అనన్యభక్తిగల;
జన = వారిని; పాలకుండవు = ఏలువాడవు; అయ్యున్ = అయినప్పటికి; అంతఃకరణ = మనసులోపల {అంతఃకరణము - మనోబుద్ధి చిత్తాహంకారములకు మూలమైన ప్రధానము}; ప్రకాశత్వంబున్ = తెలియబడుట {ప్రకాశత్వము - శబ్ద
స్పర్శాది వ్యాపారములందు ప్రవర్తించునట్లు చేయుట}; కలిగి =
కలవాడవై; సేవకజన = భక్తులకు; ఫల
= ధర్మార్ధకామమోక్షఫలములు; ప్రదానంబు = ఇచ్చుట;
కొఱకున్ = కోసము; గుణ = త్రిగుణములచేత;
ఆచ్ఛాదకుండవు = ఆవరింపబడినవాడవు; అయ్యున్ =
అయినప్పటికి; చిత్తాది = చిత్తముమున్నగువాని {చిత్తాది వర్తనములు- 1చిత్తము 2అహంకారము 3మనస్సు 4బుద్ధి
రూపములైన చతురంతఃకరణముల చలన కర్తవ్య సంకల్ప నిశ్చయ వ్యాపారములు నిర్వహించునవి};
వర్తనంబులు = వ్యాపారములచేత; కానందగిన =
తెలిసికొనదగిన; గుణంబులన్ = ఆ త్రిగుణముల; కున్ = కు; సాక్షివి = ఎడమగానుండి చూచువాడవు;
ఐ = అయ్యి; ఒరులకు = బ్రహ్మఙ్ఞానులకంటెనితరుల;
కున్ = కు; ఎఱుంగరామిన్ = తెలిసికొనశక్యముగానిచేత;
అగోచరుండవు = కంటికికనబడనివాడవు; అయ్యున్ = అయినప్పటికి;
తర్కింపరాని = ఇట్టిదట్టిదనిచెప్పవీలుకాని; పెంపు
= మహిమ; వలనన్ = వలన; అవ్యాహత =
ఊహింపరాని; విహారుండవు = మహిమలుగలవాడవు; అయ్యున్ = అయినప్పటికి; సకలకార్య = సకలకార్యములకు {సకలకార్యములు - అవ్యక్తము మహత్తత్వము అహంకారము పంచతన్మాత్రలు పంచభూతము
అనెడి చతుర్దశ కార్యములు}; హేతువు = మూలకారణభూతుడవు, ఉత్పత్తి స్థానమైనవాడవు; అయ్యున్ = అయినప్పటికి;
అంతఃకరణ = చతురంతఃకరణములను {చతురంతఃకరణములు - 1చిత్తము 2అహంకారము 3బుద్ధి 4మనస్సులు}; ప్రవర్తకత్వంబు = నడపువాడవు; వలన = అగుట వలన; హృషీకేశుండవు = హృషీకేశుడవు {హృషీకేశుడు - చతుర్దశేంద్రియములకు (దశేంద్రియములు చతురంతఃకరణములుకు)
నియామకుడు}; అయ్యును = అయినప్పటికి; సాధన
= యోగాదిసాధనలచేనైనను; వశంబుగాని = స్వాధీనముకాని, అందని; ఆత్మారామత్వంబు = ఆత్మారాముడవు {ఆత్మారామత్వము - తన యందు తానే క్రీడించుట కలిగి యుండుట}; వలన = అగుట వలన; మునివి = మౌనశీలివి; అయ్యున్ = అయినప్పటికి; స్థూల = ఆదిభౌతికము; సూక్ష్మ = ఆధ్యాత్మికము; గతులన్ = మార్గములందును;
ఎఱుంగుచున్ = తెలిసికొనుచు; ఎందున్ =
దేనియందును; చెందక = అంటక, వస్త్వంతర
సంబంధము లేక; నీవు = నీవు; విశ్వంబున్ = ప్రపంచస్వరూపుడవు; కాకయున్ =
కాకపోయినను; విశ్వంబు = ప్రపంచస్వరూపము; నీవ = నీవే; అయ్యును = అయినప్పటికి; విశ్వ = ప్రపంచము {విశ్వభావాభావసందర్శనము - భగవంతుడు
ప్రపంచోత్పత్తికి ముందు లయముతరువాత నుండువాడు కనుక ఉండుట లేకపోవుటలు రెండు చూచును};
భావ = కలిమి, సృష్టితరువాత; అభావ = లేమి, లయముతరువాత; సందర్శనము
= చూచుట; చేయుచున్ = చేస్తు; విద్య =
ఆత్మఙ్ఞానము; అవిద్యల = ఆత్మఙ్ఞానమురాహిత్యము; కున్ = కు; హేతువు = కారణభూతము; ఐన = అయినట్టి; నీ = నీ; కున్
= కు; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరించెదము
= చేసెదము; అవధరింపుము = చిత్తగింపుము.
దేవుడు
ఉన్నాడనీ, లేడనీ వాదిస్తు ఉంటారు. దేవుడికి అన్నీ తెలుసుననీ,
జీవుడికి కొంచమే తెలుసుననీ అంటారు. జీవుడు ఒకప్పుడు సంసారబంధంలో
ఇరుక్కున్నాడనీ పిమ్మట మోక్షం పొందాడనీ అంటారు. దేవుడు ఒకడే అనీ, అనేక రూపాలలో ఉన్నాడనీ అంటారు. ఇలాంటి వాదాలన్నీ మాయ వలన కలుగుతూ ఉంటాయి.
అనేక వాదాల చిక్కులుగా తెలియ బడువాడవు నీవే. నీవు అనేక పేర్లు రూపాలు శక్తుల
తారతమ్యములతో నానావిధ మహిమల చేత తెలియబడుతూ ఉంటావు. కన్నులు మొదలైన ఇంద్రియాలచే
గ్రహించ వీలగు రూపంగాను గమనింపబడతు, ఆ గమనింపులుగా కూడ ఉంటావు.
నీ యందలి ఙ్ఞానానికి ఆధారాలు కాని సంకేతాలు కాని అవసరం లేదు. సమస్తాన్ని కల్పిస్తూ
కవివై ప్రవర్తిల్లుతావు. నీ నిశ్వాసమే వేదం కనుక, శాస్త్రం
అనే సమస్తము నీనుండే తెలుసుకోబడుతూ ఉంటాయి. ఆ శాస్త్రాలకి ఉత్పత్తి స్థానంగా
ఉంటావు కనుక, "సంకర్షణుడు", "వాసుదేవుడు", "ప్రద్యుమ్నుడు",
"అనిరుద్ధుడు" అనే "చతుర్వ్యూహమూర్తి"గా తెలియబడతావు. భక్తి కలిగిన
వాళ్ళని నీవే సాకుతూ ఉంటావు. అందరి హృదయాలలో సర్వం తెలిసి ఉండి, వారి భక్తికి తగిన ఫలాలను అందేటట్లు చేస్తావు. అందుచేత గుణాలచేత
ఆవరింపబడిన వాడివిగా కనబడతావు. చిత్తం మొదలైన వాని వర్తనలచేత తెలియదగిన గుణాలకి
గోచరిస్తున్నట్లే ఉంటావు. కాని ఇతరులకు గోచరించకుండా సాక్షిగా వాళ్ళలోనే ఉంటావు.
తర్కానికి అతీతమైన వాడవై, ఇట్టిదట్టిదని నిరూపించడానికి రాని
విహారం కల వాడవు. సృష్టిలోని సమస్తమైన కార్యాలకి మూలకారణం నీవే. అంతఃకరణానికి విషయ
గ్రహణ శక్తి కలుగ చేస్తావు కనుక, సర్వ ఇంద్రియాలకు ఆధిపతివి
(హృషీకము లకు ఈశుడు). తన యందు తానే క్రీడించు శక్తి కలవాడవు కనుక సాధనకు లొంగే
వాడివి కాదు. మునివై మౌనంగా అందరిలోను ఉంటావు. స్థూలమైన వానిలో స్థూలుడుగా,
సూక్ష్మమైన వానిలో సూక్ష్ముడుగా తెలియబడుతూ ఉంటావు. కాని రెంటికి
నీవు అంటనివాడవు కనుక ప్రపంచానికి అతీతమైనవాడవు, నీవు ప్రపంచ
స్వరూపుడవై ఉంటావు. లోకము యొక్క కలిమి లేములను సాక్షివై చూస్తూ ఉంటావు. విద్యకు అవిద్యకు
సర్వానికి కారణభూతుడవు, కర్తవు నీవే. అటువంటి నీకు
నమస్కరిస్తున్నాము. అవధరింపుము.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment