10.1-355-సీస పద్యము
కరకమలారుణ కాంతిఁ గవ్వుపు త్రాడు; పవడంపు నునుఁదీఁగె పగిది మెఱయఁ;
గ్రమముతో రజ్జు వాకర్షింపఁ బాలిండ్లు; వీడ్వడ నొండొంటి వీఁక నొత్తఁ;
గుచకుంభములమీఁది కొంగుజాఱఁగ జిక్కు; పడుచు హారావళుల్ బయలుపడగఁ;
బొడమిన చెమటతోఁ బొల్పారు నెమ్మోము; మంచుపైఁ బడిన పద్మంబుఁ దెగడఁ;
10.1-355.1-తేటగీతి
గౌను నులియంగఁ; గంకణ క్వణన మెసఁగఁ;
దుఱుము బిగివీడఁ; గర్ణికాద్యుతులు మెఱయ;
బాలు నంకించి పాడెడి పాట వలనఁ
దరువు లిగురొత్త పెరు గింతి దరువఁ జొచ్చె.
అలా యశోదాదేవి పెరుగు
చిలుకుతుండగా, ఆమె చేతుల అరుణకాంతులు కవ్వం తాటిపై పడి అది పగడపుతీగలాగ మెరుస్తోంది.
తాడును క్రమపద్దతిలో ఒకదాని తరువాత ఒకటి లాగుతుంటే, ఆమె పాలిండ్లు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి.
వక్షోజాలపై ఉన్న కొంగు జారుతోంది. మెడలోని హారాలు చిక్కు పడుతూ కనబడుతూ ఉన్నాయి.
పట్టిన చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచుబిందువులు చెందిన తామరపూవు కన్నా
మనోహరంగా ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. చేతుల గాజులు గలగలలాడుతూ ఉన్నాయి.
కొప్పముడి బిగింపు సడలుతూ ఉంది. చెవుల కమ్మల కాంతులు తళుక్కుమంటూ ఉన్నాయి. ముద్దు
కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడేపాటకు చెట్లు చిగురుస్తూ ఉన్నాయి. ఇలా యశోదాదేవి
పెరుగు చిలుకుతూ ఉంది.
10.1-355-seesa padyamu
karakamalaaruNa kaaMtiM~ gavvupu traaDu; pavaDaMpu
nunuM~deeM~ge pagidi meRrayaM~;
gramamutO rajju vaakarShiMpaM~ baaliMDlu; veeDvaDa
noMDoMTi veeM~ka nottaM~;
guchakuMbhamulameeM~di koMgujaaRraM~ga jikku;
paDuchu haaraavaLul bayalupaDagaM~;
boDamina chemaTatOM~ bolpaaru nemmOmu; maMchupaiM~
baDina padmaMbuM~ degaDaM~;
10.1-355.1-tETageeti
gaunu nuliyaMgaM~; gaMkaNa kvaNana mesaM~gaM~;
duRrumu bigiveeDaM~; garNikaadyutulu meRraya;
baalu naMkiMchi paaDeDi paaTa valanaM~
daruvu ligurotta peru giMti daruvaM~ jochche.
కర = చేతులు అనెడి; కమల = పద్మముల; అరుణ = ఎర్రని; కాంతిన్ = మెరుపువలన; కవ్వపుత్రాడు = నాకతాడు,
తరితాడు; పవడంపు = పగడాల; నును = నున్నటి; తీగె = దండ; పగిదిన్ = వలె; మెఱయన్ = ప్రకాశించుచుండగా; క్రమము = ఒకపద్దతి; తోన్ = ప్రకారము; రజ్జువున్ = తాడును; ఆకర్షింపన్ = పట్టుకొని లాగుతుండగా; పాలిండ్లు = స్తనములు; వీడ్వడన్ = విడివిడిగా; ఒండొంటిన్ = ఒకదానినొకటి; వీకన్ = గట్టిగా; ఒత్తన్ = ఒరసికొనగా; కుచ = స్తనములు అనెడి; కుంభముల = కుండల; మీది = మీద ఉన్న; కొంగు = చీరకొంగు; జాఱగన్ = జారుచుండగా; చిక్కుపడుచున్ = మెలికలుపడుతు; హార = మెడలోనిదండల; ఆవళుల్ = వరుసలు; బయలుపడగన్ = బయటికిరాగా; పొడమిన = పుట్టిన; చెమట = చెమటబిందువుల; తోన్ = తోటి; పొల్పారు = అందంగా కనబడుతుండగా; నెఱ = నిండైన; మోము = ముఖము; మంచు = మంచు బిందువులు; పైన్ = మీద; పడిన = పడినట్టి; పద్మంబున్ = పద్మములను; తెగడన్ = పరిహసించగా; కౌను = నడుము.
నులియంగన్ = ఊగిసలాడగా; కంకణ = చేతికంకణముల, గాజుల; క్వణన = శబ్దము; ఎసగన్ = అతిశయించగా; తుఱుము = జుట్టుముడి; బిగి = బిగింపు; వీడన్ = వదులుకాగా; కర్ణికా = చెవి ఆభరణముల; ద్యుతులు = కాంతులు; మెఱయన్ = మెరుస్తుండగా; బాలున్ = బాలకృష్ణుని; అంకించి = ఉద్దేశించి; పాడెడి = పాడుతున్న; పాట = పాట; వలన = వలన; తరువులు = చెట్లు; ఇగురొత్తన్ = చిగురించునట్లుగా; పెరుగున్ = పెరుగును; ఇంతి = యశోద; తరువజొచ్చె = చిలకసాగింది.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment