Monday, August 11, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 378

బిడ్డలకుబుద్ధిసెప్పని

1-314-క.
బిడ్డలకు బుద్ధి సెప్పని
గ్రుడ్డికిఁ బిండంబు వండికొని పొం; డిదె పైఁ
డ్డాఁ డని భీముం డొఱ
గొడ్డెము లాడంగఁ గూడు గుడిచెద వధిపా!
          ఏనాడు బిడ్డలకు బుద్దిచెప్పనట్టి గ్రుడ్డివాడు, ఈ నాడు సిగ్గు లేకుండా మాయింటి మీద పడ్డాడు; ఈ కళ్లులేని కబోదికి ఇంత పిండం వండి పట్టుకెళ్లి పడెయ్యండి అంటున్న భీముడు పలికే దెప్పుడు మాటలు వింటు, ఆ దిక్కుమాలిన తిండి ఎలా తినగలుగుతున్నావు మహారాజా!
కురుక్షేత్ర యుద్దానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్ర్రునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు. తన కొడుకులు పాండవులను అనేక బాధలు అవమానాలు పెడుతున్నప్పుడు తప్పని వారించ లేదు కదా. అలాంటిది సిగ్గు లేకుండ ఇవాళ ఎలా వాళ్ళ చేతికూడు తింటున్నావు అని అడుగుతున్నాడు. ద్విక్తాక్షరం డ్డ ప్రాసగా వేసి ఆపైన ఏడు డకారాలు వేసి ధ్వని సూచకం సాధించిన తీరు అద్భుతం.
1-314-ka.
biDDalaku buddhi seppani
gruDDiki@M biMDaMbu vaMDikoni poM; Dide pai@M
baDDaa@M Dani bheemuM DoRa
goDDemu laaDaMga@M gooDu guDicheda vadhipaa!
          బిడ్డల = పిల్లల; కున్ = కి; బుద్ధి సెప్పని = మంచి దారిలో పెట్టుటకు శిక్షించని; గ్రుడ్డి = గ్రుడ్డివాని; కిన్ = కి; పిండంబు = పిండము {పిండము - (నిందా పూర్వకముగ) భోజనము / తద్దినము రోజు గుండ్రముగ చేయు ముద్దలు}; వండికొని = వండికొని; పొండు = తీసుకొని వెళ్ళండి; ఇదె = ఇదిగో; పైన్ = మీద; పడ్డాఁడు = పడ్డాడు; అని = అని; భీముండు = భీముడు; ఒఱ గొడ్డెములున్ = మర్మపు ఎత్తి పొడుపు మాటలు; ఆడంగన్ = పలుకు చుండగ; కూడు = తిండి; కుడిచెదవు = తింటున్నావా; అధిపా = రాజా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: