Sunday, August 31, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 398

పొడిచినదిట్టిన


1-487-క. 
పొడిచినఁ దిట్టినఁ గొట్టినఁ 
డుచుందురు గాని పరమభాగవతులు దా 
రొడఁబడరు మాఱు సేయఁగఁ 
గొడుకా విభుఁ డెగ్గు సేయఁ గోరఁడు నీకున్. 
  కుమార!కొట్టినా తిట్టినా పరమభక్తు లైన వారు పరమ భాగవతులు శాంతం తో భరిస్తారే తప్ప ప్రతీకారం చెయ్యటానికి అంగీకరించరు. నీ శాపానికి మన మహారాజు ప్రతిశాపం ఇవ్వడు. 
శమీకమహర్షి తన మెడలో పరీక్షిత్తు వేసిన చచ్చిన పామును తొలగించి, శపించిన తన పుత్రుడు శృంగికి ఇలా బుద్ధి చెప్పసాగాడు. 
1-487-ka. 
poDichina@M diTTina@M goTTina@M 
baDuchuMduru gaani paramabhaagavatulu daa 
roDa@MbaDaru maaRu saeya@Mga@M 
goDukaa vibhu@M Deggu saeya@M gOra@MDu neekun. 
పొడిచినన్ పొడిచినను; తిట్టినన్ తిట్టినను; కొట్టినన్ కొట్టినను; పడుచున్ పడుతు; ఉందురు ఉంటారు; కాని కాని; పరమ ఉత్కృష్టమైన; భాగవతులు భాగవతానుయాయులు - భాగవతులు; తారు తాము; ఒడఁబడరు సిద్ధపడరు; మాఱు ప్రతీకారము; సేయఁగన్ చేయుటకు; కొడుకా పుత్రా; విభుఁడు ప్రభువు; ఎగ్గు కీడు; సేయన్ చేయుటను; కోరఁడు కోరుకొనడు; నీకున్ నీకు. 
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Saturday, August 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 397

కనింయెందాపసపుంగవుం

3-148-మ.
నియెం దాపస పుంగవుం డఖిల లోఖ్యాత వర్ధిష్ణు శో
భాస్వ త్పరిపూర్ణ యౌవన కళాభ్రాజిష్ణు యోగీంద్ర హృ
ద్వజాతైక చరిష్ణు కౌస్తుభ ముఖోద్య ద్భూషణాలంకరి
ష్ణు నిలింపాహిత జిష్ణు విష్ణుఁ బ్రభవిష్ణుం గృష్ణు రోచిష్ణునిన్.
          అలా వచ్చిన మునిశ్రేష్ఠుడు మైత్రేయుడు విశ్వమంతా విస్తరిల్లిన శాశ్వతకీర్తితో, సౌభాగ్యశోభల వైభవంతో కూడినవాడు, సంపూర్ణ యౌవన స్పూర్తితో విరాజిల్లేవాడు, మహా యోగీంద్రుల హృదయ పద్మాలలో సంచరించేవాడు, కౌస్తుభం మొదలైన తళతళలాడే ఆభరణాలు అలంకరించుకొనువాడు, సర్వవ్యాపకుడు, సర్వ సమర్థుడు, తేజోమయుడు అయిన శ్రీకృష్ణుని దర్శించాడు.
3-148-ma.
kaniyeM daapasa puMgavuM Dakhila lOkakhyaata vardhishNu SO
bhana bhaasva tparipoorNa yauvana kaLaabhraajishNu yOgeeMdra hR
dvanajaataika charishNu kaustubha mukhOdya dbhooshaNaalaMkari
shNu niliMpaahita jishNu vishNu@M brabhavishNuM gRshNu rOchishNunin.
          కనియెన్ = దర్శించెను; తాపస పుంగవుడు = మైత్రేయుడు {తాపస పుంగవుడు - తాపసులలో శ్రేష్టుడు, మైత్రేయుడు}; అఖిల లోక ఖ్యాత వర్థిష్ణున్ = కృష్ణుని {అఖిల లోక ఖ్యాత వర్థిష్ణుడు - సమస్త లోకస్థులచే కీర్తింపబడి అతిశయించు శీలము కలవాడు, విష్ణువు}; శోభన భాస్వత్పరిపూర్ణ యౌవనకళా భ్రాజిష్ణు = కృష్ణుని {శోభన భాస్వత్పరిపూర్ణ యౌవన కళా భ్రాజిష్ణు - శుభకరమై ప్రకాశిస్తున్న నిండుజవ్వనము యొక్క శోభచే ప్రకాశించువాడు, విష్ణువు}; యోగీంద్ర హృద్వనజాతైక చరిష్ణు = కృష్ణుని {యోగీంద్ర హృద్వనజాతైక చరిష్ణు యోగులలో శ్రేష్టులైనవారి హృదయపద్మము లందు ఒకడై చరించువాడు}; కౌస్తుభ ము ఖోద్యద్భూష ణాలంకరిష్ణు = కృష్ణుని {కౌస్తుభ ము ఖోద్య ద్భూష ణాలంకరిష్ణు - కౌస్తుభము మొదలగు ముఖ్యమైన మిక్కిలి ప్రకాశిస్తున్న భూషణములచే అలంకరింపబడిన వాడు}; నిలిం పాహిత జిష్ణు = కృష్ణుని {నిలిం పాహిత జిష్ణు - నిలంప (దేవతల)కు అహిత (శత్రువులు) అగు రాక్షసులను జయించు శీలము కలవాడు, విష్ణువు}; విష్ణున్ = కృష్ణుని {విష్ణువు ప్రకాశించు వాడు, హరి}; ప్రభ విష్ణున్ = కృష్ణుని {ప్రభ విష్ణుడు - సృష్టిగా పుట్టుకు వచ్చే స్వభావము కలవాడు, విష్ణువు}; రోచిష్ణున్ = కృష్ణుని {రోచిష్ణుడు - ప్రకాశించు స్వభావము కలవాడు}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Friday, August 29, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 396

వెడవెడనడకలు

8-541-క.
వెవెడ నడకలు నడచుచు
నెనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.
          వామనుడు మెల్లమెల్లగా అడుగులువేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతు నడిచాడు. మధ్యలో కొద్దికొద్దిగా మాట్లాడుతు, తడబడుతు, కలవరబడుతు బలిచక్రవర్తిని సమీపించాడు.
బలిచక్రవర్తి యాగశాలలోనికి వామనరూపంతో మయావటువుగా అవతరించిన విష్ణువు ప్రవేశించే ఘట్టం. పద్యం నడక వామనుని నడకతో పోటీపడుతోందా అన్నట్టు ఉంది.
8-541-ka.
veDaveDa naDakalu naDachuchu
neDaneDa naDu giDaka naDari yila diga@MbaDagaa
buDibuDi noDuvulu noDuvuchu@M
jiDimuDi taDa@MbaDaga vaDugu chaeren raajun.
          వెడవెడన్ = మెల్లిమెల్లి; నడకలు = అడుగులుతో; నడచుచున్ = తిరుగుతు; ఎడనెడ = మధ్యమధ్యలో; అడుగు = అడుగులు; ఇడక = వేయకుండ; అడరి = బెదరి; ఇల = భూమి; దిగబడగా = కుంగిపోతుండగ; బుడిబుడి = చిన్నచిన్న; నొడువులున్ = మాటలు; నొడువుచున్ = పలుకుచు; చిడిముడిన్ = కలవరపాటుతో; తడబడగ = తడబడుతుండగ; వడుగు = బ్రహ్మచారి; చేరెన్ = సమీపించెను; రాజున్ = చక్రవర్తిని.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~