Friday, April 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 269

లేమా

10.2-172-క.

లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్.
          ఓ లేత వయసు చినదానా! సత్యభామా! మేము రాక్షసులను గెలవ లేమా ఏమి? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నావు? ఇటురా. యుద్ధప్రయత్నం మానెయ్యి. మానకపోతే పోనీలే ఇదిగో ఈ విల్లు విలాసంగా అందుకో.
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, లేమా అనే పదంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే  ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.
10.2-172-ka.
laemaa! danujula geluva@Mga
laemaa? nee vaela kaDa@Mgi laechiti? viTu raa
lae maanu maana vaenin
lae maa villaMdikonumu leelaM gaelan.
          లేమా = చిన్నదానా {లేమ – లేత వయస్కురాలు, స్త్రీ}; దనుజులన్ = రాక్షసులను; గెలువగ = జయింప; లేమా = సమర్థులము కామా; నీవు = నీవు; ఏల = ఎందుకు; కడగి = యత్నించి; లేచితివి = నిలబడితివి; ఇటు = ఈ వైపునకు; రా = రమ్ము; లే = లెమ్ము; మాను = వదలివేయుము; మానవు = మానని; ఏనిన్ = పక్షమున; లే = లెమ్ము; మా = మా యొక్క; విల్లున్ = ధనుస్సు; అందికొనుము = పుచ్చుకొనుము; లీలన్ = విలాసముగా; కేలన్ = చేతితో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: