Wednesday, April 9, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 254

లగ్నంబెల్లి

10.1-1726-శా.
గ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
గ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా త్నంబు సిద్ధించునో?
గ్నంబై చనునో? విరించికృత మెబ్బంగిం బ్రవర్తించునో?
          సుముహర్తమేమో రేపే. పెళ్ళిముహుర్తం దగ్గరకి వచ్చేసింది. శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు ఎంచేతో ఏమిటో? నా మనస్సు ఆందోళన చెందుతోంది. ఆయన విషయం విన్నాడో లేదో మరి? ఇంతకి అగ్ని వలె తేజస్సు గలవా డైన అంతటి విప్రుడు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో? అసలు నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మ దేవుడు ఏం రాసిపెట్టి ఉన్నాడో ఏమిటో?
రుక్మిణీ కల్యాణ ఘట్టంలో విప్రుడు అగ్నిద్యోతనుడు వచ్చి ఆలోకలోచనుడు, గోవులకు ఒడయడు కృష్ణుడు వస్తున్న శుభసమాచారం చెప్పడానికి ముందు ఏకాంతంలో రుక్మిణి చెందుతున్న ఆందోళన ఇది.
10.1-1726-Saa.
lagnaM belli vivaahamuM gadise naelaa raa@MDu gOviMdu@M? Du
dvignaM bayyeDi maanasaMbu vinenO vRttaaMtamun? braahmaNuM
DagnidyOtanu@M DaeTikiM daDase? naa yatnaMbu siddhiMchunO?
bhagnaMbai chanunO? viriMchikRta mebbaMgiM bravartiMchunO?
          లగ్నంబున్ = ముహూర్తము; ఎల్లి = రేపు; వివాహమున్ = పెండ్లి సమయము; కదిసెన్ = దగ్గరైనది; ఏలా = ఎందుకు; రాడు = రాలేదు; గోవిందుడు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; ఉద్విగ్నంబు = కలవరపడినది; అయ్యెడిన్ = అగుచున్నది; మానసంబున్ = మనస్సు; వినెనో = విన్నాడో లేదో; వృత్తాంతమున్ = సమాచారమును; బ్రాహ్మణుండు = విప్రుడు; అగ్నిద్యోతనుడు = అగ్నిద్యోతనుడు; ఏటికి = ఎందుచేత; తడసెన్ = ఆలస్యముచేసెను; నా = నా యొక్క; యత్నంబున్ = ప్రయత్నము; సిద్ధించునో = ఫలించునో లేదో; భగ్నంబై = చెడిపోయినది; ఐచనునో = అయిపోవునేమో; విరించి = బ్రహ్మదేవుని {విరించి - వివరముగా రచించువాడు, బ్రహ్మ}; కృతము = రాసిపెట్టినది; ఎబ్బంగి = ఏ విధముగ; ప్రవర్తించునో = నడచునో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: