Tuesday, April 22, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 267

నీలోనలేని

10.1-1241-క.

నీలోన లేని చోద్యము
లే లోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్
నేలన్ నింగిని దిక్కుల
నీలో చోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!
          సమస్తమైన వింతలు నీలోనే ఉన్నాయి కదా మహానుభావ! నీలో లేని వింతలు నీళ్ళల్లో కాని, నేలమీద కాని, ఎక్కడికి వెళ్ళినా ఏ లోకంలోను ఉన్నట్లు పెద్ద లెవరు చెప్పలేదు స్వామి.
కృష్ణ బలరాములను ద్వారకకు తీసుకెళ్తున్న అక్రూరునికి దివ్యదర్శనాలు అనుగ్రహించిన వాసుదేవుడు ఏం వింతలు చూసావని అడిగాడు. సర్వము నీవుగా నుండగా, ఇంక వేరే నీలో లేని వింతలు ఏముంటాయి మహాత్మా! యని మనవి చేస్తున్నాడు అక్రూరుడు.
10.1-1241-ka.
neelOna laeni chOdyamu
lae lOkamulaMdu@M jeppa reeSvara! neeTan
naelan niMgini dikkula
neelO chOdyaMbu lella negaDu mahaatmaa!
          నీ = నీ; లోనన్ = అందు; లేని = లేనట్టి; చోద్యములు = వింతలు; = ఏ ఒక్క; లోకములు = లోకము {త్రిలోకములు - 1స్వర్గ 2మర్త్య 3పాతాళ లోకములు}; అందున్ = లోను; చెప్పరు = ఉన్నవని వినబడ లేదు; నీటన్ = నీటిలోను; నేలన్ = నేలమీద; నింగినిన్ = ఆకాశము నందు; దిక్కులన్ = నలుదిక్కు లందు {నలుదిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము}; నీ = నీ; లోన్ = అందు; చోద్యంబులు = వింతలు; ఎల్లన్ = అన్నియు; నెగడు = వర్ధిల్లును; మహాత్మా = గొప్పవాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: