Tuesday, April 26, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – దేవా మునీంద్రులు


7-366-వ.
దేవా! మునీంద్రులు నిజవిముక్త కాములయి విజనస్థలంబులం దపంబు లాచరింతురు; కాముకత్వంబు నొల్లక యుండువారికి నీ కంటె నొండు శరణంబు లేదు గావున నిన్ను సేవించెదరు; కొందఱు కాముకులు కరద్వయ కండూతిచేతం దనియని చందంబునఁ దుచ్ఛంబయి పశు పక్షి క్రిమి కీట సామాన్యం బయిన మైథునాది గృహ మేది సుఖంబులం దనియక కడపట నతి దుఃఖవంతు లగుదురు; నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముం డయియుండు. మౌనవ్రత జప తప శ్శ్రుతాధ్యయనంబులును నిజధర్మవ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులును మోక్షహేతువులగు; నయిన నివి పదియు నింద్రియజయంబు లేనివారికి భోగార్థంబులయి విక్రయించువారికి జీవనోపాయంబులయి యుండు; డాంభికులకు వార్తాకరంబులై యుండు, సఫలంబులుగావు; భక్తి లేక భవదీయజ్ఞానంబు లేదు; రూపరహితుండ వైన నీకు బీజాంకురంబులకైవడిఁ గారణకార్యంబు లయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబు లగు; నా రెంటి యందును భక్తియోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున నిన్ను బొడఁగందురు; పంచభూత తన్మాత్రంబులును ప్రాణేంద్రియంబులును మనోబుద్ధ్యహంకార చిత్తంబులును నీవ; సగుణంబును నిర్గుణంబును నీవ; గుణాభిమాను లయిన జననమరణంబుల నొందు విబుధు లాద్యంతంబులు గానక నిరుపాధికుండవైన నిన్నెఱుంగరు; తత్త్వజ్ఞులయిన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంతప్రతిపాద్యుండ వగు నిన్ను సమాధివిశేషంబుల నెఱింగి సేవింతు; రదిగావున.
టీకా:
      దేవా = భగవంతుడా; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; నిజ = సత్యమైన; విముక్త = విడువబడిన; కాములు = కోరికలుగలవారు; అయి = అయ్యి; విజన = నిర్జన; స్థలంబులన్ = ప్రదేశములందు; తపంబున్ = తపస్సును; ఆచరింతురు = చేయుదురు; కాముకత్వంబున్ = కోరికలకులొంగెడిగుణమును; ఒల్లక = అంగీకరింపక; ఉండు = ఉండెడి; వారి = వారి; కిన్ = కి; నీ = నీ; కంటెన్ = కంటెను; ఒండు = ఇతరమైన; శరణంబు = శరణము; లేదు = లేదు; కావునన్ = కనుక; నిన్నున్ = నిన్ను; సేవించెదరు = కొలిచెదరు; కొందఱు = కొంతమంది; కాముకులు = కోరికలుగలవారు; కర = చేతులు; ద్వయ = రెంటిచేతను; కండూతి = దురద; చేతన్ = వలన; తనియని = తృప్తిచెందని; చందంబునన్ = విధముగ; తుచ్ఛంబు = నీచమైనది; అయి = అయ్యి; పశు = పశువులు; పక్షి = పక్షులు; క్రిమి = పురుగులు; కీట = కీటకములకు; సామాన్యంబు = సామాన్యధర్మము; అయిన = ఐన; మైథున = సురతము; ఆదిన్ = మొదలగానిచే; గృహమేధి = గృహస్థులు; సుఖంబులన్ = సుఖములందు; తనియక = తృప్తిచెందక; కడపడటన్ = చివరకు; అతి = మిక్కిలి; దుఃఖవంతులు = దుఃఖముగలవారు; అగుదురు = అగుదురు; నీ = నీ; ప్రసాదంబున్ = అనుగ్రహము; కల = కలిగిన; సుగుణుండు = సజ్జనుడు; నిష్కాముండు = కోరికలులేనివాడు; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; మౌన = మౌనముగానుండెడి; వ్రత = దీక్ష; జప = జపము; తపస్ = తపస్సు; శ్రుత = వేదశాస్త్రలను చదువుకొనుట; అధ్యయనంబులును = మననముచేసికొనుట; నిజ = తన; ధర్మ = ధర్మములను; వ్యాఖ్యాన = వివరించుకొనుచు; విజన = నిర్జన; స్థల = ప్రదేశములందు; నివాస = నివసించుట; సమాధులను = యోగసమాధులు; మోక్ష = ముక్తిపద; హేతువులు = సాధనములు; అగున్ = అయినట్టివి; అయిన = అయిన; ఇవి = ఇవి; పదియున్ = పది (10); ఇంద్రియ = ఇంద్రియ; జయంబు = నిగ్రహము; లేని = లేని; వారి = వారి; కిన్ = కి; భోగ = అనుభవైక; అర్థంబులు = ప్రయోజనములు; అయి = అయ్యి; విక్రయించు = అమ్మకొను; వారి = వారి; కిన్ = కి; జీవనోపాయంబులు = జీవనోపాధులు; అయి = అయ్యి; డాంభికుల్ = దంభముబూనువారల; కున్ = కు; వార్తా = వృత్తాంత; కరంబులు = జనకములు; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; సఫలంబులు = సార్థకములు {సఫలంబులు - తగిన ప్రయోజనములు గలవి, సార్థకములు}; కావు = కావు; భక్తి = భక్తి; లేక = లేకుండగ; భవదీయ = నీకుసంబంధించిన; జ్ఞానంబు = ఎరుక; లేదు = లేదు; రూప = ఆకారము; రహితుండవు = లేనివాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; బీజ = విత్తు; అంకురంబుల = మెలకల; కైవడిన్ = వలె; కారణ = కారణము; కార్యంబులు = కార్యములు; అయిన = ఐన; సత్ = శాశ్వతము; అసత్ = భంగురములునైన; రూపంబులు = రూపంబులు; రెండును = రెండును (2); ప్రకాశమానంబులు = తెలియబడుచున్నవి; అగున్ = అగును; ఆ = ఆ; రెంటి = రెంటి; అందునున్ = లోను; భక్తియోగంబునన్ = భక్తియోగముచేత; బుద్ధిమంతులు = జ్ఞానులు; మథనంబునన్ = తరచిచూచుటద్వారా; దారువులు = కట్టెల; అందున్ = లో; వహ్నిన్ = అగ్ని; కనియెడి = తెలిసికొను; తెఱంగునన్ = విధముగ; నిన్నున్ = నిన్ను; పొడగందురు = చూచెదరు; పంచభూత = పృథివ్యాదుల; తన్మాత్రంబులును = లేశములు, పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; ప్రాణ = పంచప్రాణములు; ఇంద్రియంబులును = దశేంద్రియములు; మనస్ = మనస్సు; బుద్ధి = బుద్ధి; అహంకార = అహంకారము, మమత్వము; చిత్తంబులును = చిత్తములు; నీవ = నీవే; సగుణంబును = గుణసహితమైనవి; నిర్గుణంబును = గుణరహితమైనవి; నీవ = నీవే; గుణ = గుణములందు; అభిమానులు = తగులముగలవారు; అయిన = ఐనచో; జనన = పుట్టుక; మరణంబులన్ = చావులను; ఒందున్ = పొందును; విబుధులు = విద్వాంసులు; ఆది = పుట్టుక; అంతంబులున్ = చావులను; కానక = తెలియక; నిరుపాధింకుడవు = ఉపాధిరహితుండవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; తత్త్వజ్ఞులు = తత్త్వజ్ఞానముగలవారు; అయిన = ఐన; విద్వాంసులు = పండితులు; వేద = వేదములను; అధ్యయన = అధ్యయనముచేయుట; ఆది = మొదలైన; వ్యాపారంబులు = పనులను; మాని = విడిచి; వేదాంత = వేదాంతములచే; ప్రతిపాద్యుండవు = వర్ణింపబడినవాడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; సమాధి = యోగసమాధి యొక్క; విశేషంబులన్ = భేదములచేత; ఎఱింగి = తెలిసికొని; సేవింతురు = కొలచెదరు; అదిగావునన్ = అందుచేత.
భావము:
        భగవంతుడా! మునీశ్వరులు కోరికలు వదలి ఏకాంత ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. కామవికారాలు లేనివాళ్లకునీ కంటె కాంక్షించ దగ్గది మరేదీ ఉండదు; అందుకే నేను నిన్ను సేవిస్తాను. దురద వేసిందని రెండు చేతులతోటి గోక్కున్నా దురద తీరదు, తృప్తి పొందలేరు. అలాగే కాముకులు తుచ్ఛమైన పశుపక్ష్యాదులకూ క్రిమికీటకాలకూ సామాన్యమైన మైథునాది గృహస్థ సుఖాలలో మునిగితేలుతూ, ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. చివరకు దుఃఖాల పాలవుతారు. నీ దయ పొందిన బుద్ధిమంతుడు నిష్కాముడై దివ్య సుఖం పొందుతాడు. 1) మౌనం, 2) వ్రతం, 3) జపం, 4) తపం, 5) స్మరణం, 6) అధ్యయనం, 7) స్వధర్మం, 8) వ్యాఖ్యానం, 9) ఏకాంతవాసం, 10) ఏకాగ్రత అనే ఈ పది ముముక్షువులకు మోక్షహేతువులు, ఈ పదీ (అ) ఇంద్రియ నిగ్రహం లేనివారికి భోగకారణాలు. (ఇ) విక్రయించే వారికి జీవనోపాయాలు, (ఉ) ఆడంబరులకు కాలక్షేపవిషయాలు. ఇలాంటి వారికి ఈ మోక్షహేతువులు సఫలం కావు. భక్తి భావం మనసులో లేనివారికి నీ తత్వజ్ఞానం అంతుపట్టదు, రూపంలేని నీ యందు, విత్తనాల నుండి మొలకలు బయలుదేరినట్లు, కార్య కారణాలైన, అసత్తు సత్తు రూపాలు రెండూ తేజరిల్లుతూ ఉంటాయి. బుద్ధిమంతులు భక్తియోగంతో, ఆరణిలో అగ్నిని కనుగొన్నట్లు, ఆ రెంటిలోనూ నిన్ను దర్శిస్తారు. 1) భూమి, 2) జలము, 3) అగ్ని, 4) వాయువు, 5) ఆకాశం అనే పంచభూతాలూ; 1) శబ్దము, 2) స్పర్శము, 3) రూపము, 4) రసము, 5) గంధము అనే పంచతన్మాత్రలూ; 1. ప్రాణము, 2. అపానము, 3. వ్యానము, 4. ఉదానము, 5. సమానము అనే పంచప్రాణాలూ; 1 చెవి, 2 చర్మము, 3 కన్ను, 4 నాలుక, 5 ముక్కు, 6 నోరు, 7 చేయి, 8 కాలు, 9 గుదము,10 రహస్యేంద్రియము అనే దశేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నీ నీవే. సగుణం, నిర్గుణం నీవే. సత్త్వ, రజ, స్తమో గూణాభిమానులూ, జననమరణాలు పొందే వారూ అయిన పండితులు, నీ ఆద్యంతాలు తెలుసుకోలేరు. ఉపాధిరహితుడవు అయిన నిన్ని గుర్తించలేరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యాయాది కర్మలు మాని,వేదాంత ప్రతిపాదకుడవైన నిన్ను ఏకాగ్రచిత్తంతో దర్శించి సేవిస్తుంటారు.
 ७-३६६-व.
देवा! मुनींद्रुलु निजविमुक्त कामुलयि विजनस्थलंबुलं दपंबु लाचरिंतुरु; कामुकत्वंबु नोल्लक युंडुवारिकि नी कंटे नोंडु शरणंबु लेदु गावुन निन्नु सेविंचेदरु; कोंदर्रु कामुकुलु करद्वय कंडूतिचतं दनियनि चंदंबुनँ दुच्छंबयि पशु पक्षि क्रिमि कीट सामान्यं बयिन मैथुनादि गृह मेदि सुखंबुलं दनियक कडपट नति दुःखवंतु लगुदुरु; नी प्रसादंबु गल सुगुणुंडु निष्कामुं डयियुंडु. मौनव्रत जप तप श्श्रुताध्ययनंबुलुनु निजधर्मव्याख्यान विजनस्थल निवास समाधुलुनु मोक्षहतुवुलगु; नयिन निवि पदियु निंद्रियजयंबु लेनिवारिकि भोगार्थंबुलयि विक्रयिंचुवारिकि जीवनोपायंबुलयि युंडु; डांभिकुलकु वार्ताकरंबुलै युंडु, सफलंबुलुगावु; भक्ति लेक भवदीयज्ञानंबु लेदु; रूपरहितुंड वैन नीकु बीजांकुरंबुलकैवडिँ गारणकार्यंबु लयिन सदसद्रूपंबुलु रेंडुनु ब्रकाशमानंबु लगु; ना रेंटि यंदुनु भक्तियगंबुन बुद्धिमंतुलु मथनंबुन दारुवुलंदु वह्निं गनियेडु तेर्रंगुन निन्नु बोडँगंदुरु; पंचभूत तन्मात्रंबुलुनु प्राणंद्रियंबुलुनु मनोबुद्ध्यहंकार चित्तंबुलुनु नीव; सगुणंबुनु निर्गुणंबुनु नीव; गुणाभिमानु लयिन जननमरणंबुल नोंदु विबुधु लाद्यंतंबुलु गानक निरुपाधिकुंडवैन निन्नेर्रुंगरु; तत्त्वज्ञुलयिन विद्वांसुलु वदाध्ययनादि व्यापारंबुलु मानि वेदांतप्रतिपाद्युंड वगु निन्नु समाधिविशषंबुल नेर्रिंगि सेविंतु; रदिगावुन.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, April 25, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – భగవద్దివ్య





7-365-మ.
భగవద్దివ్య గుణానువర్తన సుధాప్రాప్తైక చిత్తుండ నై
బెగడన్ సంసరణోగ్రవై తరణికిన్; భిన్నాత్ములై తావకీ
య గుణస్తోత్ర పరాఙ్ముఖత్వమున మాయాసౌఖ్యభావంబులన్
సుగతిం గానని మూఢులం గని మదిన్ శోకింతు సర్వేశ్వరా!
టీకా:
          భగవత్ = భగవంతుని {భగవంతునిగుణషట్కములు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు}; దివ్య = దివ్యమైన; గుణ = గుణషట్కము (6); అనువర్తన = అనుసరించుటవలని; సుధా = అమృతము; ప్రాప్త = లభించుటయందలి; ఏక = ఏకాగ్రమైన; చిత్తుండను = చిత్తముగలవాడను; ఐ = అయ్యి; బెగడన్ = బెదరను; సంసరణ = సంసారము యనెడి; ఉగ్ర = భయంకరమైన; వైతరణి = వైతరణీనది; కిన్ = కి; భిన్నాత్మలు = భేదబుద్ధిగలవారు; ఐ = అయ్యి; తావకీయ = నీ యొక్క; గుణ = గుణముల; స్తోత్ర = స్తుతించుటయందు; పరాఙ్ముఖత్వమునన్ = వ్యతిరిక్తతచే; మాయా = మిథ్యా; సౌఖ్య = సుఖములను; భావంబులన్ = భావములలో; సుగతిన్ = ఉత్తమగతిని; కానని = చూడని; మూఢులన్ = అజ్ఞానులను; కని = చూసి; మదిన్ = మనసునందు; శోకింతున్ = దుఃఖించెదను; సర్వేశ్వరా = నరసింహా {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}.
భావము:
            ఓ లోకేశ్వరా! భగవంతుడవైన నీ దివ్యభవ్య సుగుణాలను కీర్తించటం అనే అమృత పానం చేశాను. నీ చింతనంతోనే నా చిత్తం నిండిపోయింది. కనుక సంసారమనే దారుణ వైతరణిని చూసి నేను ఏమాత్రం భయపడటం లేదు. కానీ భేదభావంతో, నీ గుణకీర్తనకు విముఖులు అయి, మాయా సౌఖ్యాలలో పడి, దుర్గతి పొందే మూర్ఖులను చూసి బాధపడుతున్నాను.
७-३६५-म.
भगवद्दिव्य गुणानुवर्तन सुधाप्राप्तैक चित्तुंड नै
बेगडन् संसरणोग्रवै तरणिकिन्; भिन्नात्मुलै तावकी
य गुणस्तोत्र पराङ्मुखत्वमुन मायासौख्यभावंबुलन्
सुगतिं गाननि मूढुलं गनि मदिन् शोकिंतु सर्वेश्वरा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, April 24, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – కామహర్షాది

7-363-సీ.
కామహర్షాది సంఘటితమై చిత్తంబు; భవదీయ చింతనపదవి చొరదు; 
మధురాదిరసముల మరగి చొక్కుచు జిహ్వ; నీ వర్ణనమునకు నిగుడనీదు; 
సుందరీముఖములఁ జూడఁగోరెడి జూడ్కి; తావకాకృతులపైఁ దగులుపడదు; 
వివిధ దుర్భాషలు వినఁ గోరు వీనులు; వినవు యుష్మత్కథావిరచనములు;
7-363.1-తే.
ఘ్రాణ మురవడిఁ దిరుగు దుర్గంధములకు; దవులు గొలుపదు వైష్ణవధర్మములకు; 
నడఁగి యుండవు కర్మేంద్రియములు పురుషుఁ; గలఁచు, సవతులు గృహమేధిఁ గలఁచు నట్లు.
టీకా:
          కామ = కోరిక; హర్ష = సంతోషము; ఆది = మొదలైనవాని; సంఘటితము = కూడినది; ఐ = అయ్యి; చిత్తంబు = మనసు; భవదీయ = నీ యొక్క; చింతన = స్మరించెడి; పదవిన్ = ఉన్నతస్థితి, త్రోవ; చొరదు = ప్రవేశించదు; మధుర = తీపి; ఆది = మొదలగు; రసములన్ = రుచులను; మరగి = అలవాటుకుబానిసయై; చొక్కుచున్ = మిథ్యానందమునొందుచు; జిహ్వ = నాలుక; నీ = నీ యొక్క; వర్ణనమున్ = కీర్తించుటకు; నిగుడనీదు = సాగనీయదు; సుందరీ = అందమైన ఆడవారు; ముఖులన్ = మొదలగగునవి; చూడన్ = చూచుటను; కోరుచున్ = ఆశించుచు; చూడ్కి = చూపులు; తావకీన = నీ యొక్క; ఆకృతుల = రూపముల; పైన్ = మీద; తగులుపడదు = లగ్నముకాదు; వివిధ = అనేకరకములైన; దుర్భాషలున్ = చెడుమాటలను; వినన్ = వినుటను; కోరు = కోరెడి; వీనులు = చెవులు; వినవు = వినవు; యుష్మత్ = నీ యొక్క; కథా = గాథల; విరచనములున్ = చక్కటి రచనలను. ఘ్రాణము = ముక్కు; ఉరవడిన్ = వేగముగా; తిరుగున్ = స్పందించును; దుర్గంధముల్ = చెడు వాసనలవైపున; కున్ = కు; తవులుగొలుపదు = లగ్నముకానీయదు; వైష్ణవ = విష్ణునకు ప్రీతికరములైన; ధర్మముల = ధర్మముల; కున్ = కు; అణగి = వశములై; ఉండవు = ఉండవు; కర్మేంద్రియములు = పనులుచేసెడి సాధనములు {పంచకర్మేంద్రియములు - 1వాక్ 2పాణి 3పాద 4పాయు 5ఉపస్థులు}; పురుషున్ = మానవుని; కలచున్ = కలతనొందిచును; సవతులు = సవతులు; గృహమేధిన్ = గృహస్థుని; కలచునట్లు = కలతపెట్టువిధముగ.
భావము:
            ఈ చిత్తం ఉందే కామం, హర్షం మున్నగు గుణాలతో నిండి ఉండి, నీ చింతన మార్గంలో ప్రవేశించదు; నాలుక మాధుర్యం మొదలైన రుచులకు అలవాటు పడి, నీ నామ స్మరణామృతం రుచి చూడదు; కన్నులు కామినీ ముఖం చూడాలని కోరుతాయి, కానీ నీ దివ్యమంగళమూర్తిని దర్శించటానికి లగ్నం కావు; రకరకాల దుర్భాషలు వినగోరే ఈ చెవులు, నీ కథలను వినవు; నాసిక దుర్వాసనలకేసి పోవటానికి అలవాటు పడి, వైష్ణవ ధర్మ సుగంధాలు ఆఘ్రాణించదు; గృహస్థును సవతులు అందరూ చుట్టుముట్టి వేపుకు తిన్నట్లు, కర్మేంద్రియాలు నిత్యం పురుషుడిని బాధిస్తాయి.
७-३६३-सी.
कामहर्षादि संघटितमै चित्तंबु; भवदीय चिंतनपदवि चोरदु;
मधुरादिरसमुल मरगि चोक्कुचु जिह्व; नी वर्णनमुनकु निगुडनीदु;
सुंदरीमुखमुलँ जूडँगोरेडि जूड्कि; तावकाकृतुलपैँ दगुलुपडदु;
विविध दुर्भाषलु विनँ गोरु वीनुलु; विनवु युष्मत्कथाविरचनमुलु;
७-३६३.१-ते.
घ्राण मुरवडिँ दिरुगु दुर्गंधमुलकु; दवुलु गोलुपदु वैष्णवधर्ममुलकु;
नडँगि युंडवु कर्मेंद्रियमुलु पुरुषुँ; गलँचु, सवतुलु गृहमेधिँ गलँचु नट्लु.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Saturday, April 23, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – ఘోటకవదనుఁడ వై

7-361-క.
ఘోటకవదనుఁడ వై మధు
కైటభులం ద్రుంచి నిగమగణముల నెల్లం
బాటించి యజున కిచ్చిన
కూటస్థుఁడ వీశ్వరుఁడవు కోవిదవంద్యా!
7-362-వ.
ఇవ్విధంబున గృత త్రేతా ద్వాపరంబులను మూఁడు యుగంబు లందును దిర్యఙ్మానవ ముని జలచరాకారంబుల నవతరించి లోకంబుల నుద్ధరించుచు, ధరించుచు, హరించుచు యుగానుకూల ధర్మంబులం బ్రతిష్ఠించుచు నుండుదువు; దేవా! యవధరింపుము.
టీకా:
          ఘోటకవదనుడవు = హయగ్రీవావతారుడవు {ఘోటకవదనుడు - గుర్రపుముఖముగలవాడు, హయగ్రీవుడు, విష్ణువు}; ఐ = అయ్యి; మధు = మధుడు; కైటభుల్ = కైటభులను; త్రుంచి = చంపి; నిగమ = వేదములు; గణములన్ = సమూహములను; ఎల్లన్ = అన్నిటిని; పాటించి = ఉద్ధరించి; యజున్ = బ్రహ్మదేవుని; కిన్ = కి; ఇచ్చిన = ఇచ్చినట్టి; కూటస్థుడవు = అక్షరుడవు {కూటస్థుడు - సర్వకాలసర్వాస్థలయందు వికారమునొందక ఒక్కతీరున శాశ్వతుడుగానుండువాడు, విష్ణువు}; ఈశ్వరుడవు = ప్రభువవు; కోవిదవంద్యా = నరసింహా {కోవిదవంద్యుడు - కోవిదుల (పండితుల)చే వంద్య (నమస్కరింపబడువాడు), విష్ణువు}.
          ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కృత = కృతయుగము; త్రేత = త్రేతాయుగము; ద్వాపరంబులన్ = ద్వాపరయుగములను; మూడు = మూడు(3); యుగంబులు = యుగములు; అందును = లోను; తిర్యక్ = జంతువుల, వరాహాది; మానవ = మనుష్యల, రామ కృష్ణాది; ముని = మునుల, నారద వ్యాసాది; జలచర = మత్య కూర్మ; ఆకారంబులన్ = రూపములలో; అవతరించి = అవతరించి; లోకంబులన్ = లోకములను; ఉద్ధరించుచు = కాపాడుచు; ధరించుచు = పాలించుచు; హరించుచు = నశింపజేయుచు; యుగ = ఆయా యుగములకు; అనుకూల = అనుకూలమైన; ధర్మంబులన్ = ధర్మములను; ప్రతిష్టించుచున్ = పాదుకొలుపుచు; ఉందువు = ఉందువు; దేవా = నరసింహా; అవధరింపుము = వినుము.
భావము:
            ఓ పరమేశ్వరా! నరసింహా! నీవు పండితులచే వంద్యమానుడవు. ఆ సమయంలో హయగ్రీవావతారుడవై వచ్చి మధుకైటభ రాక్షసులను సంహరించావు. వేదాలను ఉద్ధరించి బ్రహ్మదేవునికి ఇచ్చావు. అటువంటి కూటస్థుడవైన భగవానుడవు నీవు,
            ఇలా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అను మూడు యుగాలలోనూ జంతు, మానవ, ఋషి, జలచరాల ఆకారాలతో అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ, హరిస్తూ ఉంటావు; ఆయా యుగాలకు అనుకూలమైన ధర్మాలను ప్రతిష్టించి పరిపాలిస్తుంటావు. ఓ నరకేసరి దేవా! ఇంకా విను
७-३६१-क.
घोटकवदनुँड वै मधु
कैटभुलं द्रुंचि निगमगणमुल नेल्लं
बाटिंचि यजुन किच्चिन
कूटस्थुँड वीश्वरुँडवु कोविदवंद्या!
७-३६२-व.
इव्विधंबुन गृत त्रेता द्वापरंबुलनु मूँडु युगंबु लंदुनु दिर्यङ्मानव मुनि जलचराकारंबुल नवतरिंचि लोकंबुल नुद्धरिंचुचु, धरिंचुचु, हरिंचुचु युगानुकूल धर्मंबुलं ब्रतिष्ठिंचुचु नुंडुदुवु; देवा! यवधरिंपुमु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, April 22, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – మహాత్మా

7-360-వ.
మహాత్మా! సుజనులయిన బ్రహ్మాదు లందును దుర్జనులైన మా యందును సేవానురూపంబుగం బక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు జేయుదువు; కందర్ప సమేతం బగు సంసారకూపంబునం గూలుచున్న మూఢజనులం గూడి కూలెడు నేను భవదీయభృత్యుం డగు నారదుని యనుగ్రహంబునం జేసి నీ కృపకుం బాత్రుండ నైతి; నన్ను రక్షించి మజ్జనకుని వధియించుట నా యందులఁ బక్షపాతంబు గాదు; దుష్టదనుజ సంహారంబును శిష్ట భృత్య మునిజన రక్షాప్రకారంబును నీకు నైజగుణంబులు; విశ్వంబు నీవ; గుణాత్మకం బయిన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతుభూతగుణయుక్తుండవై రక్షకసంహారకారాది నానారూపంబుల నుండుదువు; సదసత్కారణకార్యాత్మకం బయిన విశ్వంబునకు పరమకారణంబు నీవ; నీ మాయచేత వీఁడు దా ననియెడి బుద్ధి వికల్పంబు దోఁచుగాని నీకంటె నొండెద్దియు లేదు; బీజంబు నందు వస్తుమాత్రభూత సౌక్ష్మ్యంబును వృక్షంబు నందు నీలత్వాది వర్ణంబునుం గలుగు తెఱంగున; విశ్వంబునకు నీ యంద జన్మ స్థితి ప్రకాశ నాశంబులుం గలుగు; నీ చేత నయిన విశ్వంబు నీ యంద నిలుపు కొని తొల్లి ప్రళయకాలపారావారంబునఁ బన్నగేంద్రపర్యంకంబునఁ గ్రియారహితుండవై నిజసుఖానుభవంబు జేయుచు నిద్రితుని భంగి యోగనిమీలితలోచనుండవై మెలంగుచుఁ గొంత కాలంబునకు నిజ కాలశక్తిచేతం బ్రేరితంబులై ప్రకృతిధర్మంబు లయిన సత్త్వాదిగుణంబుల నంగీకరించి సమాధిచాలించి విలసించుచున్న నీనాభి యందు వటబీజంబువలన నుద్భవించు వటంబు తెఱంగున నొక్క కమలంబు సంభవించె; నట్టి కమలంబువలన నాల్గుమోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నొండయిన రూపంబు లేకుండుటఁ జింతించి జలాంతరాళంబుఁ బ్రవేశించి జలంబు లందు నూఱు దివ్యవత్సరంబులు వెదకి తన జన్మంబునకు నుపాదానకారణం బైన నిన్ను దర్శింప సమర్థుండు గాక, మగిడి కమలంబుకడకుం జని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భరతపంబు జేసి పృథివి యందు గంధంబు గను చందంబునఁ దన యందు నానాసహస్రవదన శిరో నయన నాసా కర్ణ వక్త్ర భుజ కర చరణుండును బహువిధాభరణుండును మాయాకలితుండును మహాలక్షణలక్షితుండును నిజప్రకాశదూరీకృత తముండును బురుషోత్తముండును నయిన నిన్ను దర్శించె; న య్యవసరంబున.
టీకా:
          మహాత్మా = గొప్పవాడా; సుజనుల్ = దేవతలు; అయిన = ఐన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలైనవారి; అందును = ఎడలను; దుర్జనులు = రాక్షసులు; ఐన = అయిన; మా = మా; అందును = ఎడలను; సేవా = కొలచినందులకు; అనురూపంబులు = తగినవి; కన్ = అగునట్లు; పక్ష = స్వపక్షమువారు; అపక్షంబులు = పరపక్షమువారను తలపు; లేక = లేకుండగ; కల్పవృక్షంబు = కల్పవృక్షము; చందంబునన్ = విధముగ; ఫల = ఫలితములను; ప్రదానంబు = ఇచ్చుటను; చేయుదువు = చేసెదవు; కందర్ప = మన్మథునితో, కామముతో; సమేతంబు = కూడినది; అగు = అయిన; సంసార = సంసారము యనెడి; కూపంబునన్ = నూతిలో; కూలుచున్న = పడిపోతున్నట్టి; మూఢ = తెలివిహీనులైన; జనులన్ = వారిని; కూడి = కలిసి; కూలెడు = కూలిపోవుచున్న; నేను = నేను; భవదీయ = నీ యొక్క; భృత్యుండు = దాసుండు; అగు = అయిన; నారదుని = నారదుని; అనుగ్రహంబునన్ = దయ; చేసి = వలన; నీ = నీ యొక్క; కృప = కరుణ; కున్ = కు; పాత్రుండను = తగినవాడను; ఐతి = అయితిని; నన్నున్ = నన్ను; రక్షించి = కాపాడి; మత్ = నా యొక్క; జనకుని = తండ్రిని; వధియించుట = చంపుట; నా = నా; అందున్ = ఎడల; పక్షపాతంబు = మొగ్గుచూపుట; కాదు = కాదు; దుష్ట = చెడ్డ; దనుజ = రాక్షసులను; సంహారంబును = చంపుట; శిష్ట = మంచివారు; భృత్య = దాసులు; ముని = మునుల యైన; జన = వారిని; రక్షా = కాపాడెడి; ప్రకారంబును = విధానము; నీ = నీ; కున్ = కు; నైజ = సహజ; గుణంబులు = లక్షణములు; విశ్వంబు = జగత్తు; నీవ = నీవే; గుణా = త్రిగుణముల {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబు = రూపమైనది; అయిన = ఐన; విశ్వంబున్ = జగత్తును; సృజియించి = సృష్టించి; అందున్ = దానిలో; ప్రవేశించి = చేరి; హేతుభూత = కారణభూతమైన; గుణ = లక్షణములతో; యుక్తుండవు = కూడినవాడవు; ఐ = అయ్యి; రక్షక = కాపాడుట; సంహార = చంపుటలను; కార = కలిగించుట; ఆది = మొదలగు; నానా = వివిధరకముల; రూపంబులన్ = రూపములలో; ఉండుదువు = ఉండెదవు; సత్ = సత్తు, సత్యమైనది; అసత్ = అసత్తు, సత్యదూరమైనది; కారణ = కారణము; కార్యా = కార్యముల; ఆత్మకంబు = రూపమైనది; అయిన = ఐన; విశ్వంబున్ = జగత్తును; కున్ = కు; పరమ = ముఖ్య; కారణంబు = హేతువు; నీవ = నీవే; నీ = నీ యొక్క; మాయ = మహిమ; చేతన్ = వలన; వీడు = ఇతడు; తాన్ = తను; అనియెడి = అనెడి; బుద్ధి = బుద్ధి; వికల్పంబున్ = భ్రాంతిచే; తోచున్ = అనిపించును; కాని = తప్పించి; నీ = నీ; కంటెన్ = కంటెను; ఒండు = ఇతరము; ఎద్దియున్ = ఏదియు; లేదు = లేదు; బీజంబున్ = విత్తు; అందున్ = లో; వస్తుమాత్ర = అణువంతది; భూత = అయినట్టి; సౌక్ష్మ్యంబును = చిన్నది యగుటను; వృక్షంబు = చెట్టును; అందున్ = వానిలో; నీలత్వ = నీలపురంగు; ఆది = మొదలగు; వర్ణంబునున్ = రంగులు; కలుగు = కలిగెడి; తెఱంగునన్ = విధముగనే; విశ్వంబున్ = జగత్తున; కున్ = కు; నీ = నీ; అంద = అందే; జన్మ = పుట్టుట; స్థితి = ఉండుట; ప్రకాశ = వృద్ధినొందుట; నాశంబులున్ = నాశనములు; కలుగున్ = కలుగును; నీ = నీ; చేతన్ = వలన; అయిన = గలిగినట్టి; విశ్వంబున్ = జగత్తు; నీ = నీ; అంద = అందే; నిలుపుకొని = ఉంచుకొని; తొల్లి = పూర్వము; ప్రళయకాల = ప్రళయకాలమునందలి; పారావారంబునన్ = (పాల) సముద్రమునందు; పన్నగేంద్ర = ఆదిశేషుడను; పర్యంకంబునన్ = పాన్పుపైన; క్రియా = పనులు; రహితుండవు = మానినవాడవు; ఐ = అయ్యి; నిజ = సత్యమైన; సుఖ = సుఖమును; అనుభవంబున్ = అనుభవించుటను; చేయుచున్ = చేయుచు; నిద్రితుని = నిద్రించువాని; భంగిన్ = వలె; యోగ = యోగధ్యానమున; నిమీలిత = సగముమూయబడిన; లోచనుండవు = కన్నులుగలవాడవు; ఐ = అయ్యి; మెలంగుచున్ = వర్తించుచు; కొంత = కొంత; కాలంబున్ = సమయమున; కున్ = కు; నిజ = నీకుసంబంధించిన; కాల = కాలముయొక్క; శక్తి = ప్రభావము; చేతన్ = వలన; ప్రేరితంబులు = ప్రేరేపింబడినవి; ఐ = అయ్యి; ప్రకృతి = అవిద్యా; ధర్మబులు = గుణములు; అయిన = ఐన; సత్వాదిగుణంబులన్ = త్రిగుమములను; అంగీకరించి = స్వీకరించి; సమాధిన్ = ధ్యానసమాధిని; చాలించి = ఆపి; విలసించుచున్న = విలసిల్లిన; నీ = నీ యొక్క; నాభి = బొడ్డు; అందున్ = అందు; వట = మర్రి; బీజంబు = విత్తనము; వలనన్ = వలన; ఉద్భవించు = పుట్టెడి; వటంబు = మర్రిచెట్టు; తెఱంగునన్ = విధముగ; ఒక్క = ఒక; కమలంబు = పద్మము; సంభవించెన్ = పుట్టినది; అట్టి = అటువంటి; కమలంబు = పద్మము; వలనన్ = నుండి; నాల్గు = నాలుగు (4); మోముల = ముఖములుగల; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; జన్మించి = పుట్టి; దిశలు = అన్నిపక్కలకు; వీక్షించి = చూసి; కమలంబున్ = పద్మమున; కున్ = కు; ఒండు = ఇతరమైనది; అయిన = ఐన; రూపంబున్ = ఆకారములు; లేకుండుటన్ = లేకపోవుటను; చింతించి = యోచించి; జల = నీటి; అంతరాళంబున్ = లోనికి; ప్రవేశించి = చేరి; జలంబుల్ = నీటి; అందున్ = లో; నూఱు = వంద (100); దివ్యవత్సరంబులు = దివ్యసంవత్సరములు {దివ్యసంవత్సరము - 360 మానవ సంవత్సరములు (దేవతల దినము - మానవ సంవత్సరము)}; వెదకి = వెతికి, అన్వేషించి; తన = తన యొక్క; జన్మంబున్ = పుట్టుక; కునున్ = కు; ఉపాదాన = ప్రధాన {ఉపాదానకారణము - కుండకు మట్టి బట్టకు దారము ఉపాదానకారణములు}; కారణంబు = హేతువు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; దర్శింపన్ = చూచుటకు; సమర్థుండు = శక్తిగలవాడు; కాక = కాలేక; మగిడి = మరల; కమలంబు = పద్మము; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; విస్మయంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; చిర = ఎంతో; కాలంబున్ = కాలము; నిర్భర = భరింపరాని; తపంబున్ = తపస్సును; చేసి = చేసి; పృథివి = భూమి; అందున్ = లో; గంధంబు = వాసన; కను = చూచెడి; చందంబునన్ = విధముగనే; తన = తన; అందున్ = లోననే; నానా = పలు; సహస్ర = వేలకోలది; వదన = మోములు; శిరస్ = తలలు; నయన = కన్నులు; నాసా = ముక్కులు; కర్ణ = చెవులు; వక్త్ర = నోర్లు; భుజ = భుజములు; కర = చేతులు; చరణుండును = పాదములుగలవాడు; బహు = అనేకమైన; విధ = రకముల; ఆభరణుండును = అలంకారములుగలవాడు; మాయా = మాయతో; కలితుండును = కూడినవాడు; మహా = గొప్ప; లక్షణ = గుణములు; లక్షితుండును = ప్రకాశించెడివాడును; నిజ = తన; ప్రకాశ = ప్రకాశముచేత; దూరీకృత = పోగొట్టబడిన; తముండును = అజ్ఞానముగలవాడు; పురుషోత్తముడును = పురుషులలో శ్రేష్ఠుడు; అయిన = ఐన; నిన్నున్ = నిన్ను; దర్శించెన్ = చూచెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:
            మహాత్మా! నరకేసరి రూపదారీ! శ్రీహరీ! బ్రహ్మాది దేవతలకూ, దుష్టాత్ములము అయిన మాకూ ఏమాత్రం పక్షపాతం లేకుండా కొలచిన భక్తి చూసి ఫలితాన్ని ప్రసాదిస్తావు. అలా స్వ పర భేదం లేకుండా అనుగ్రహించటంలో కల్పవృక్షానివి. మన్మథుడు విహరించే సంసారకూపంలో మదాంధులుతో పాటూ నేనూ పడవలసిన వాడను. నీ దాసుడు అయిన నారద మహర్షుల వారి ఉపదేశం వలన నీ కృప పొందగలిగాను. నన్ను రక్షించి నా తండ్రిని శిక్షించటం నా మీది పక్షపాతంతో కాదు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ నీ సహజగుణాలు కదా. విశ్వమూర్తివీ, విరాట్ శ్వరూపానివీ నీవే. నీవే త్రిగుణాత్మకమైన విశ్వాన్ని సృష్టిస్తావు. ఆ సృష్టిలో ప్రవేశిస్తావు. కారణభూత రూపా లైన గుణములతో నీవే రక్షకుడవుగా, శిక్షకుడవుగా నానా రూపాలూ ధరిస్తావు, నిత్యా అనిత్య, కార్య కారణ సంబంధం కలిగిన ఈ ప్రపంచానికి మూలకారణం నువ్వే. నీ మాయ చేతనే వీడూ, వాడూ, నేను, నువ్వూ అనే భ్రాంతి కలుగుతుంది. అంతేకాని ఈ విశ్వంలో నువ్వు తప్ప ఇతరమైనదేదీ లేదు. 
            విత్తనంలో అతి సూక్ష్మరూపంలో వస్తుతత్వం నిక్షిప్తం అయినట్లు, వృక్షంలో నీలం మొదలైన రంగులు దాగి ఉన్నట్లు, విశ్వం నీలోనే జన్మ, స్థితి, ప్రకాశ, నాశనములను పొందుతుంది. నీ చేత సృష్మింపబడిన ఈ విశ్వాన్ని నువ్వు నీలోనే దాచుకుని ప్రళయకాలంలో క్షీరమహాసముద్రం మధ్యలో శేషతల్పం మీద క్రియారహితంగా శయనించి, ఆత్మానందం అనుభవిస్తూ యోగనిద్రలో ఉంటావు. యోగి నిద్రపోతున్నట్లు నిమీలిత నేత్రాలతో శయనించి ఉంటావు. కొంత కాలానికి స్వకీయమైన కాలమహిమ వలన నీవు ప్రకృతి ధర్మాలైన సత్త్వాది గుణాలను స్వీకరించి, సమాధి చాలించి, తేజరిల్లుతుంటావు. అటువంటి సమయంలోనే వటబీజం నుండి మహా వృక్షం వెలువడే విధంగా, నీ నాభి కమలం నుండి ముందుగా ఒక కమలం పుట్టింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మదేవుడు పుట్టాడు. నాలుగు ముఖాలతో నాలుగువైపులా పరిశీలించాడు, కమలం తప్ప మరొకటేదీ కనబడలేదు. ఆలోచించి జలాలలోకి వెళ్ళి నూరు (100) దివ్య సంవత్సరాలు వెతికి కూడా తన జన్మకు ప్రధానకారణమైన నిన్ను దర్శించలేక పోయాడు. మళ్ళీ కమలం చేరి, ఆశ్చర్యపడి, చాలాకాలం గొప్ప తపస్సు చేశాడు. చివరకు పృథివి యందు గంథాన్ని కనుగొన్నట్లు, తనలో నిన్ను చూడగలిగాడు. అపుడు నువ్వు సహస్ర శీర్షుడవై,సహస్రాక్షుడవై, సహస్ర వదనుండవై, పెక్కువేల నాసికలతో, పెక్కువేల వీనులతో, పెక్కువేల భుజాలతో, అనేకానేక కర, చరణలతో ఒప్పుతూ దర్శనమిచ్చావు. నానాలంకార భూషితుడవు, మాయా మయుడవు, మహాలక్షణ లక్షితుడవు, స్వయం ప్రకాశుడవూ, తమస్సును తొలగించువాడవూ, పురుషోత్తముడవూ అయిన విశ్వవిరాట్ స్వరూపాన్ని బ్రహ్మ దేవుడుదర్శించాడు.
७-३६०-व.
महात्मा! सुजनुलयिन ब्रह्मादु लंदुनु दुर्जनुलैन मा यंदुनु सेवानुरूपंबुगं बक्षापक्षंबुलु लेक कल्पवृक्षंबु चंदंबुन फलप्रदानंबु जेयुदुवु; कंदर्प समेतं बगु संसारकूपंबुनं गूलुचुन्न मूढजनुलं गूडि कूलेडु नेनु भवदीयभृत्युं डगु नारदुनि यनुग्रहंबुनं जेसि नी कृपकुं बात्रुंड नैति; नन्नु रक्षिंचि मज्जनकुनि वधियिंचुट ना यंदुलँ बक्षपातंबु गादु; दुष्टदनुज संहारंबुनु शिष्ट भृत्य मुनिजन रक्षाप्रकारंबुनु नीकु नैजगुणंबुलु; विश्वंबु नीव; गुणात्मकं बयिन विश्वंबु सृजियिंचि यंदुं ब्रवशिंचि हेतुभूतगुणयुक्तुंडवै रक्षकसंहारकारादि नानारूपंबुल नुंडुदुवु; सदसत्कारणकार्यात्मकं बयिन विश्वंबुनकु परमकारणंबु नीव; नी मायचेत वीँडु दा ननियेडि बुद्धि विकल्पंबु दोँचुगानि नीकंटे नोंडेद्दियु लेदु; बीजंबु नंदु वस्तुमात्रभूत सौक्ष्म्यंबुनु वृक्षंबु नंदु नीलत्वादि वर्णंबुनुं गलुगु तेर्रंगुन; विश्वंबुनकु नी यंद जन्म स्थिति प्रकाश नाशंबुलुं गलुगु; नी चेत नयिन विश्वंबु नी यंद निलुपु कोनि तोल्लि प्रळयकालपारावारंबुनँ बन्नगेंद्रपर्यंकंबुनँ ग्रियारहेतुंडवै निजसुखानुभवंबु जेयुचु निद्रितुनि भंगि योगनिमीलितलोचनुंडवै मेलंगुचुँ गोंत कालंबुनकु निज कालशक्तिचतं ब्रेरितंबुलै प्रकृतिधर्मंबु लयिन सत्त्वादिगुणंबुल नंगीकरिंचि समाधिचालिंचि विलसिंचुचुन्न नीनाभि यंदु वटबीजंबुवलन नुद्भविंचु वटंबु तेर्रंगुन नोक्क कमलंबु संभविंचे; नट्टि कमलंबुवलन नाल्गुममुल ब्रह्म जन्मिंचि दिशलु वीक्षिंचि कमलंबुनकु नोंडयिन रूपंबु लेकुंडुटँ जिंतिंचि जलांतराळंबुँ ब्रवेशिंचि जलंबु लंदु नूर्रु दिव्यवत्सरंबुलु वेदकि तन जन्मंबुनकु नुपादानकारणं बैन निन्नु दर्शिंप समर्थुंडु गाक, मगिडि कमलंबुकडकुं जनि विस्मयंबु नोंदि चिरकालंबु निर्भरतपंबु जेसि पृथिवि यंदु गंधंबु गनु चंदंबुनँ दन यंदु नानासहस्रवदन शिरो नयन नासा कर्ण वक्त्र भुज कर चरणुंडुनु बहुविधाभरणुंडुनु मायाकलितुंडुनु महालक्षणलक्षितुंडुनु निजप्रकाशदूरीकृत तमुंडुनु बुरुषोत्तमुंडुनु नयिन निन्नु दर्शिंचे; न य्यवसरंबुन.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :