Friday, June 27, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 334

నాకొడుకును

10.1-325-క.
నా కొడుకును నా కోడలు
నేకతమునఁ బెనఁగ బాము నీతఁడు వైవం
గోక లెఱుంగక పాఱినఁ
గూఁక లిడెన్ నీ సుతుండు గుణమె? గుణాఢ్యా!
          నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే, నీ కొడుకు వెళ్ళి పాము నొకదానిని వారిమీద పడేసాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి, వాళ్ళు పరుగులు పెడుతుంటే, చూసి హేళనగా కేకలెట్టాడు. ఓ యశోదమ్మా! నీవేమో సుగుణాల రాశివి కదా. మరి మీ వాడి గుణ మేమైనా బావుందా చెప్పు.
ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను గోపికలు ఓపికలు లేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.
10.1-325-ka.
naa koDukunu naa kODalu
naekatamuna@M bena@Mga baamu neeta@MDu vaivaM
gOka leRuMgaka paaRina@M
goo@Mka liDen nee sutuMDu guName? guNaaDhyaa!
          నా = నా యొక్క; కొడుకును = పుత్రుడు; నా = నా యొక్క; కోడలున్ = కొడుకు భార్య; ఏకతమునన్ = ఏకాంత మందు; పెనగన్ = కలియుచుండగా; పామున్ = సర్పమును; ఈతడున్ = ఇతను; వైవన్ = వేయగా; కోకలు = వంటిమీది బట్టలు; ఎఱుంగక = తెలియకుండ; పాఱినన్ = పరుగెట్టగా; కూకలు = కేకలు; ఇడెన్ = పెట్టెను; నీ = నీ యొక్క; సుతుండు = పుత్రుడు; గుణమె = మంచి బుద్దా ఇది, కాదు; గుణాఢ్య = ఇల్లాలా {గుణాఢ్య - సుగుణములచే ఉత్తమురాలు, స్త్రీ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Thursday, June 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 333

మేరువుదలకిందైనను

8-595-క.
మేరువు దలక్రిందైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్.
          మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు, సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడిపొడి అయితే కావచ్చు, ఆకాశం బద్దలు అయితే కావచ్చు. కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను.
ఈ దానం ప్రమాదకరం అందుచేత అబద్దమాడినా ఏం పరవాలేదు వామనునికి దానం ఇయ్య వద్దని దానవకులాచార్యుడు శుక్రనీతి చెప్తుంటే, మహా దానశీలుడు బలిచక్రవర్తి అంగీకరించకుండా ఈ దానం ఇచ్చి తీరతాను అబద్ధం ఆడను అంటు ఇలా చెప్తున్నాడు.
8-595-ka.
maeruvu dalakriMdainanu
baaraavaaraMbu liMka@M baaRina lOlO
dhaaruNi rajamai pOyina@M
daaraadhvamu baddhamaina@M dappaka yittun.
          మేరువు = మేరుపర్వతము; తలక్రింద = తిరగబడుట; ఐనన్ = జరిగినా సరే; పారావారంబులు = సముద్రములు; ఇంకబాఱినన్ = ఇంకిపోయినసరే; లోలోన్ = లోపల లోపలే; ధారుణి = భూమండలము; రజము = పొడి; ఐపోయినన్ = అయిపోయిన సరే; తారాధ్వము = ఆకాశము {తారాధ్వము - తార (నక్షత్రపు) అధ్వము (దారి), ఆకాశము}; బద్ధమైనన్ = బద్ద లైపోయిన సరే; తప్పక = తప్పకుండ; ఇత్తున్ = ఇచ్చెదను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Wednesday, June 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 332

శ్రవణోదంచిత

10.1-772-మ.
శ్రవ ణోదంచిత కర్ణికారమునతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకిపింఛమునతో నంభోజ దామంబుతో
స్వవశుండై మధు రాధరామృతముచే వంశంబుఁ బూరించుచు
న్నువిదా! మాధవుఁ డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే?
          సఖీ! మన కృష్ణుడు చూసావా చెవిలో కొండగోగి పువ్వు అలంకరించుకొన్నాడు. పసిడి వన్నె పట్టు వస్త్రం కట్టుకున్నాడు. శిరోజా లందు నెమలిపింఛం ధరించాడు. మెడలో పద్మాల దండ వేసుకున్నాడు. పరవశత్వంతో వేణువు నందు తియ్యని అదరామృతం పూరించుతు, అడవిలో ఆలమందలను మేపుతు ఎంత చక్కగా ఉన్నాడో చూడవే చూడు.
శరత్కాలంలో గోపికలకు కనిపించిన చక్కదనాలు శ్రీకృష్ణుడు ఎంత చక్కగా ఉన్నాడో. రసరమ్యతతో పండిత పామరల మనసులు దోచిన అద్భుతమైనది యీ పద్యం.
10.1-772-ma.
Srava NOdaMchita karNikaaramunatO svarNaabha chaelaMbutO
navataMsaayita kaekipiMChamunatO naMbhOja daamaMbutO
svavaSuMDai madhu raadharaamRtamuchae vaMSaMbu@M booriMchuchu
nnuvidaa! maadhavu@M DaalaveMTa vanamaM doppaareDiM joochitae?
          శ్రవణ = చెవి యందు; ఉదంచిత = మిక్కిలి చక్కగా ఉంచబడిన; కర్ణికారమున్ = కొండగోగి పువ్వు; తోన్ = తోటి; స్వర్ణ = బంగారము; అభ = వంటి; చేలంబు = వస్త్రము; తోన్ = తోటి; అవతంసాయిత = శిగ యం దుంచబడిన, ముడి పిన్నుగా ఉంచబడిన; కేకి = నెమలి; పింఛమున్ = పింఛము, కుంచము; తోన్ = తోటి; అంభోజ = పద్మముల; దామంబు = దండ; తోన్ = తోటి; స్వవశుండు = స్వతంత్రుడు; ఐ = అయ్యి; మధుర = తియ్యనైన; అధర = పెదవులస్పర్శ అనెడి; అమృతము = అమృతము; చేన్ = చేత; వంశంబున్ = మురళిని; పూరించుచున్ = ఊదుతు; ఉవిదా = వనితా; మాధవుడు = కృష్ణుడు {మాధవుడు - మాధవి ప్రియుడు, కృష్ణుడు}; ఆల = ఆవుల; వెంటన్ = వెంబడిని; వనము = అడవి; అందున్ = లో; ఒప్పారెడిన్ = చక్కగాఉన్నాడు; చూచితే = చూచితివా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, June 24, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 331

మానినీమన్మథు

10.1-1014-సీ.
మానినీమన్మథు మాధవుఁ గానరే
 సలలితోదార వత్సకములార!

సలలితోదారవత్సక వైరిఁ గానరే
 సుందరోన్నత లతార్జునములార!
సుందరోన్నతలతార్జునభంజుఁ గానరే
 ఘనతర లస దశోకంబులార!
ఘనతర లసదశోకస్పూర్తిఁ గానరే
 నవ్యరుచిర కాంచనంబులార!
ఆ.
నవ్య రుచిర కాంచన కిరీటుఁ గానరే
గహనపదవిఁ గురవకంబులార!
గహనపదవి గురవక నివాసిఁ గానరే
గణికలార! చారు గణికలార!
          మనోహరములు, ఉన్నతములు యైన కొడిసె చెట్లులార! మానవంతులైన మహిళల మనసులను మథించే మన్మథుడైన లక్ష్మీపతిని చూసారా? చిక్కనైన లతలు అల్లుకున్న చక్కటి పొడవైన మద్ధివృక్షములార! మనోజ్ఞమైన రూపువాడు, ఉదారుడు, వత్సాసురుని వధించిన వాడు అయిన అచ్యుతుని కన్నారా? మిక్కిలి యెత్తైన చక్కటి అశోకతరువులార! చిక్కనైన లతలు అల్లుకున్న చక్కటి పొడవైన మద్ధివృక్షములను పడగొట్టిన పద్మాక్షుని పరికించారా? తాజాగా నున్న చక్కదనాల సంపెంగలలారా! దుఃఖరహితుడై వెలయుచున్న తోయజాక్షుని పరికించారా? ఎర్రగోరింటలార! ఈ వనమధ్యలో సరికొత్త బంగారు కిరీటము గల శౌరిని కాని కనుగొన్నారా? ఓ అందమైన అడవిమల్లెలలార! బృందావన మందలి ఎర్రగోరింట పొదలలో సంచరించే హరిని అవలోకించారా?
యమకాలంకారల అందం ఈ పద్యానికి ఎంతో అందాన్నిచ్చింది.
10.1-1014-see.
maanineemanmathu maadhavu@M gaanarae
 salalitOdaara vatsakamulaara!
salalitOdaaravatsaka vairi@M gaanarae
 suMdarOnnata lataarjunamulaara!
suMdarOnnatalataarjunabhaMju@M gaanarae
 ghanatara lasa daSOkaMbulaara!
ghanatara lasadaSOka spoorti@M gaanarae
 navyaruchira kaaMchanaMbulaara!
aa.
navya ruchira kaaMchana kireeTu@M gaanarae
gahanapadavi@M guravakaMbulaara!
gahanapadavi guravaka nivaasi@M gaanarae
gaNikalaara! chaaru gaNikalaara!
          మానినీ = స్త్రీలకు; మన్మథున్ = మోహముపుట్టించువాడు {మన్మథుడు - మనసును కలత పెట్టువాడు, రతీదేవి భర్త}; మాధవున్ = మాధవున్ {మా (లక్ష్మీదేవి) యొక్క భర్త}; సలలిత = మిక్కిలిమనోజ్ఞమైన; ఉదార = ఉన్నతమైన; వత్సకములారా = ఓ కొడిసె చెట్టులు; సలలిత = మిక్కలిమనోజ్ఞమైన; ఉదార = మనసుగల; వత్సక = వత్సకాసురునికి; వైరిన్ = శత్రును; కానరే = చూసితిరా; సుందర = అందమైన; ఉన్నత = ఎత్తైన; లతా = తీగలతోకూడియున్న; అర్జనములారా = ఓ మద్ధిచెట్లు; సుందర = అందమైన; ఉన్నత = ఎత్తైన; లత = లతలతోకూడియున్న; అర్జువ = మద్దిచెట్లను; భంజున్ = పడగొట్టినవానిని; కానరే = చూడలేదా; ఘనతర = మిక్కలి ఉన్నతమైనవి {ఘనము - ఘనతరము - ఘనతమము}; లసత్ = చక్కటి; అశోకంబులారా = ఓ అశోకవృక్షములు; ఘనతర = మిక్కిలి ప్రకాశవంతమైన {ఘనము - ఘనతరము - ఘనతమము}; లసత్ = ప్రకాశించునట్టి; అశోక = అధికానందమును; స్పూర్తిన్ = తోపించువాడైన; నవ్య = ఓ తాజా; రుచిర = కాంతులుగల; కాంచనంబులరా = సంపెంగ పూలు; నవ్య = సరికొత్త; రుచిర = కాంతివంతమైన; కాంచన = బంగారపు; కిరీటున్ = కిరీటము కలవానిని; కానరే = చూసితిరా; గహన = అడవి; పదవిన్ = మార్గమున; కురవకంబులారా = ఓ ఎర్రగోరింట చెట్లు; గహన = అడవి; పదవిన్ = ప్రదేశములందు; కురవక = ఎర్రగోరింట చెట్లకింద; నివాసిన్ = ఉండువానిని; కానరే = చూసితిరా; గణికలారా = ఓ అడవిమెల్లపూలు; చారు = ఓ అందమైన; గణికలారా = అడవిమెల్లలు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~