Saturday, August 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౭(607)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1264-క.
“మానవనాయక! యీ యా
ఖ్యానముఁ జదివినను వినిన ఘనపుణ్యులు ని
త్యానంద సౌఖ్యములఁ బెం
పూనుదు రటమీఁద ముక్తి నొందుదు రెలమిన్!”
10.2-1265-వ.
అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.
10.2-1266-క.
"జననాయక! యింకఁ బురా
తనవృత్తం బొకటి నీకుఁ దగ నెఱిఁగింతున్.
వినుము తపోమహిమలఁ జెం
దిన మునిజనములు సరస్వతీనది పొంతన్.

భావము:
ఈ వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు. ఇలా ఈ ఉపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఇంకా ఇలా అన్నాడు. “మహారాజా! నీకు ఇంకొక పురాతనగాథ చెబుతాను విను. పూర్వం తపోధనులైన మునులు ఎందరో సరస్వతీనదీ తీరంలో ఉండేవారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1266

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౬౦౬(606)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1262-క.
మురహరుఁ డెల నవ్వొలయఁగఁ
బురుహరుఁ దగఁ జూచి పలికె "భూతేశ్వర! యీ
నరభోజనుండు నీ కి
త్తఱి నెగ్గొనరింపఁ దలఁచి తానే పొలిసెన్.
10.2-1263-వ.
అది యట్టిద కాదె! యిజ్జగంబున నధికుండయిన వానికి నపకారంబు గావించిన మానవునకు శుభంబు గలుగునే? యదియునుంగాక జగద్గురుండవగు నీ కవజ్ఞ దలంచు కష్టాత్ముండు వొలియుటం జెప్పనేల? యిట్టి దుష్టచిత్తుల కిట్టి వరంబులిచ్చుట కర్జంబు గా"దని యప్పురాంతకు వీడ్కొలిపిన, నతండు మురాంతకు ననేక విధంబుల నభినందించి నిజ మందిరంబునకుం జనియె" నని చెప్పి యిట్లనియె.

భావము:
మురాసురసంహారి శ్రీహరి చిరునవ్వుతో పరమ శివుడితో ఇలా అన్నాడు “భూతేశ్వరా! ఈ దానవుడు నీకు అపకారం తలపెట్టి తనకు తానే మరణించాడు. అలాగే అవుతుంది కదా. లోకంలో మహాత్ములకు కీడు చేసిన వాడికి శుభాలు దక్కవు కదా. అలాంటిది లోకేశ్వరుడవు అయిన నీకు అపకారం తలపెట్టిన దుష్టుడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వడం తగదు.” అని ఈ రీతిగా పలికిన విష్ణువు శంకరుడికి వీడ్కోలు చెప్పాడు. హరుడు హరిని అనేక విధాలుగా స్తుతిస్తూ తన నివాసానికి వెళ్ళిపోయాడు.” అని చెప్పి మరల ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1263

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, August 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౫(605)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1260-క.
సుర లసురాంతకు మీఁదన్
వరమందారప్రసూన వర్షము లోలిం
గురిసిరి తుములంబై దివి
మొరసెన్ సురదుందుభిప్రముఖతూర్యంబుల్‌.
10.2-1261-క.
పాడిరి గంధర్వోత్తము
లాడిరి దివి నప్సరసలు నన్యోన్యములై
కూడిరి గ్రహములు భయముల
వీడిరి మునికోటు లంత విమలచరిత్రా!

భావము:
దానవవైరి హరి మీద దేవతలు మందార పూల వాన కురిపించారు. ఆకాశంలో దేవ దుందుభులు మున్నగు దివ్య వాయిద్యాలు మ్రోగాయి. గంధర్వులు పాటలు పాడారు. అప్సరసలు సంతోషంతో నాట్యాలు చేశారు, ఆకాశంలో గ్రహాలన్నీ కూటములు కట్టాయి. మునుల భీతిని విడిచారు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1261

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, August 15, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౪(604)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1257-ఆ.
అశుచి యగుచు నతని నంటఁగఁ బని గాదు
కాలుఁ జేయిఁ గడిగి కడఁక వార్చి
యతనివెంట వేడ్క నరుగుదువే నీవు
నవల నంటఁ దగును నసురనాథ!
10.2-1258-మ.
అతి దుశ్శంకలు మాని పొ"మ్మనిన దైత్యారాతి మాయా విమో
హితుఁడై విస్మృతి నొంది తామసముచే నేపారి వాఁ డాత్మ పా
ణితలంబుం దన నెత్తి మోపికొని తా నేలన్ వెసం గూలె వి
శ్రుతదంభోళిహతిన్ వడింబడు మహా క్షోణీధరంబో యనన్.

భావము:
అదీగాక దైత్యేంద్రా! నీవు అశుచిగా ఉండి మహేశుడిని తాకడం తగదు. అందుచేత, వెళ్ళి కాళ్ళుచేతులూ కడుగుకుని, ఆచమనం చెయ్యి. అప్పుడు శివుడిని వెంబడించి అతడిని తాకావచ్చు, నీ సందేహం తీర్చుకోనూవచ్చు. అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు. వెంటనే బయలుదేరు.” అంటూ దానవాంతకుడు అయిన విష్ణువు హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమాయ వలన తనను తాను మరచి, తామసంతో తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని మరణించాడు. వృకాసురుడు ప్రసిద్ధమైన వజ్రాయుధం దెబ్బకు కూలిన మహా పర్వతంలా నేలకూలాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1258

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, August 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౩(603)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1255-చ.
హరి దరహాస మొప్పఁ బిశితాశనుఁ గన్గొని పల్కె "దానవే
శ్వర! మును దక్షుశాపమునఁ జాలఁ బిశాచిపతౌట సూనృత
స్ఫురణము మాని సంతతము బొంకుచునుండు పురారిమాట నీ
వరయక వెంట నేఁగఁ దగ దాతని చేఁతలు మాకు వింతలే?
10.2-1256-ఆ.
నిజము పలికె నేని నెఱిఁ దన తలమీఁద
నీ కరంబు మోపనీక తలఁగి
వచ్చునోటు! నితనివలనఁ బ్రత్యయమునఁ
దగుల నేమి గలదు దనుజవర్య!

భావము:
విష్ణుమూర్తి మందహాసంచేస్తూ ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసరాజ! మునుపు దక్షుడి శాపం వలన పిశాచాలకు అధిపతి అయ్యాడు. కనుక, శంకరుడు నిజాలు మానేసి అబద్దాలే చెప్తున్నాడు. ఆయన గారి చేష్టలు మాకేమీ కొత్తకాదులే. శివుని విషయం తెలియక అతని వెంట అనవసరంగా పడుతున్నావు. దానవోత్తమా! పరమేశ్వరుడు సత్యం పలికేవాడే అయితే నీ చేయ్యి తన శిరస్సుకు తగలనీయకుండా భయంతో ఎందుకు పారిపోతాడు? ఇంతకీ శివుడి విషయంలో నమ్మదగినది ఏమైనా ఉన్నదా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1255

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, August 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౨(602)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1254-వ.
కైతవంబున నతనికి నమస్కరించి, మృదుమధుర భాషణంబుల ననునయించుచు, నయ్యసురవరున కిట్లను; “నివ్విధంబున మార్గపరిశ్రాంతుండవై యింత దూరంబేల చనుదెంచితి? సకల సౌఖ్య కారణంబైన యీ శరీరంబు నిరర్థకంబు సేసి వృథాయాసంబున దుఃఖపఱుపం దగునే? యియ్యెడం గొంతతడవు విశ్రమింపు; మీ ప్రయాసంబునకుఁ గతంబెయ్యది? కపటహృదయుండవు గాక నీ యధ్యవసాయం బెఱింగింపందగునేని నెఱింగింపు” మని మృదు మధురంబుగాఁ బలికిన నమ్మహాత్ముని సుధారసతుల్యంబు లయిన వాక్యంబులు విని సంతసిల్లి, యప్పిశితాశనుండు దన పూనినకార్యం బతని కెఱింగించిన.

భావము:
బ్రహ్మచారి వేషంలో వెళ్ళిన విష్ణువు, దానవుడు వృకాసురుడికి కపట నమస్కారం చేసాడు. తియ్యని మృదు భాషణాలతో రాక్షసునితో ఇలా స్వాంతన వచనాలు పలికాడు. “అన్నా! ఇంత అలసిపోతు ఎందుకింత దూరం వచ్చావు? ఏ సుఖాలకైనా మూలమైనది ఈ శరీరమే కదా. ఊరక దానిని ఇలా ఎందుకు దుఃఖపెడుతున్నావు? ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంతటి నీ ప్రయాసకు కారణము ఏమిటి?” అని వాడిని ప్రశ్నించాడు. ఆ వటురూపి తీయనిమాటలకు సంతోషించి, ఆ రాక్షసుడు తాను తలపెట్టిన కార్యాన్ని వివరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1254

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, August 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౧(601)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1250-వ.
అట్లు చనిచని.
10.2-1251-సీ.
నిరుపమానందమై నిఖిల లోకములకు-
  నవలయై యమృతపదాఖ్యఁ దనరి
దినకర చంద్ర దీధితులకుఁ జొరరాక-
  సలలిత సహజ తేజమున వెలుఁగు
సమధికంబగు శుద్ధసత్త్వ గరిష్ఠమై-
  కరమొప్ప యోగీంద్రగమ్య మగుచు
హరిపదధ్యాన పరాయణులైన త-
  ద్దాసుల కలరు నివాస మగుచుఁ
10.2-1251.1-తే.
బ్రవిమలానంత తేజోవిరాజమాన
దివ్యమణి హేమకలిత సందీప్త భవ్య
సౌధమండపతోరణ స్తంభ విపుల
గోపురాది భాసురము వైకుంఠపురము.

భావము: 
శివుడు అలా పరగెత్తుకు వెళ్ళి వైకుంఠపురం చూసాడు. ఆ వైకుంఠాన్ని నిరుపమాన ఆనందనిలయము అమృతపదం, పరమపదం అని ప్రసిద్ధమై నిఖిలలోకాలకూ అవతల సూర్యచంద్ర కిరణాలుసైతం ప్రవేశించటానికి వీలులేని విధంగా ఉండి, మనోఙ్ఞమైన సహజసిద్ధ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది. యోగులకూ భాగవతశ్రేష్టులకూ నివాసస్థలంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. మిక్కలి నిర్మలమైన అనంత తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. దివ్యమైన రత్నాలు, బంగారుమయమై ప్రకాశించే భవనాలు, మండపాలు, తోరణాలు, స్తంభాలు, విస్తారమైన గోపురాలుతో భాసిస్తూ ఉంటుంది ఆ వైకుంఠపురము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1251

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :