Tuesday, August 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౩(603)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1255-చ.
హరి దరహాస మొప్పఁ బిశితాశనుఁ గన్గొని పల్కె "దానవే
శ్వర! మును దక్షుశాపమునఁ జాలఁ బిశాచిపతౌట సూనృత
స్ఫురణము మాని సంతతము బొంకుచునుండు పురారిమాట నీ
వరయక వెంట నేఁగఁ దగ దాతని చేఁతలు మాకు వింతలే?
10.2-1256-ఆ.
నిజము పలికె నేని నెఱిఁ దన తలమీఁద
నీ కరంబు మోపనీక తలఁగి
వచ్చునోటు! నితనివలనఁ బ్రత్యయమునఁ
దగుల నేమి గలదు దనుజవర్య!

భావము:
విష్ణుమూర్తి మందహాసంచేస్తూ ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసరాజ! మునుపు దక్షుడి శాపం వలన పిశాచాలకు అధిపతి అయ్యాడు. కనుక, శంకరుడు నిజాలు మానేసి అబద్దాలే చెప్తున్నాడు. ఆయన గారి చేష్టలు మాకేమీ కొత్తకాదులే. శివుని విషయం తెలియక అతని వెంట అనవసరంగా పడుతున్నావు. దానవోత్తమా! పరమేశ్వరుడు సత్యం పలికేవాడే అయితే నీ చేయ్యి తన శిరస్సుకు తగలనీయకుండా భయంతో ఎందుకు పారిపోతాడు? ఇంతకీ శివుడి విషయంలో నమ్మదగినది ఏమైనా ఉన్నదా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1255

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: