Sunday, August 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౨(602)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1254-వ.
కైతవంబున నతనికి నమస్కరించి, మృదుమధుర భాషణంబుల ననునయించుచు, నయ్యసురవరున కిట్లను; “నివ్విధంబున మార్గపరిశ్రాంతుండవై యింత దూరంబేల చనుదెంచితి? సకల సౌఖ్య కారణంబైన యీ శరీరంబు నిరర్థకంబు సేసి వృథాయాసంబున దుఃఖపఱుపం దగునే? యియ్యెడం గొంతతడవు విశ్రమింపు; మీ ప్రయాసంబునకుఁ గతంబెయ్యది? కపటహృదయుండవు గాక నీ యధ్యవసాయం బెఱింగింపందగునేని నెఱింగింపు” మని మృదు మధురంబుగాఁ బలికిన నమ్మహాత్ముని సుధారసతుల్యంబు లయిన వాక్యంబులు విని సంతసిల్లి, యప్పిశితాశనుండు దన పూనినకార్యం బతని కెఱింగించిన.

భావము:
బ్రహ్మచారి వేషంలో వెళ్ళిన విష్ణువు, దానవుడు వృకాసురుడికి కపట నమస్కారం చేసాడు. తియ్యని మృదు భాషణాలతో రాక్షసునితో ఇలా స్వాంతన వచనాలు పలికాడు. “అన్నా! ఇంత అలసిపోతు ఎందుకింత దూరం వచ్చావు? ఏ సుఖాలకైనా మూలమైనది ఈ శరీరమే కదా. ఊరక దానిని ఇలా ఎందుకు దుఃఖపెడుతున్నావు? ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంతటి నీ ప్రయాసకు కారణము ఏమిటి?” అని వాడిని ప్రశ్నించాడు. ఆ వటురూపి తీయనిమాటలకు సంతోషించి, ఆ రాక్షసుడు తాను తలపెట్టిన కార్యాన్ని వివరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1254

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: