Saturday, August 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౧(601)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1250-వ.
అట్లు చనిచని.
10.2-1251-సీ.
నిరుపమానందమై నిఖిల లోకములకు-
  నవలయై యమృతపదాఖ్యఁ దనరి
దినకర చంద్ర దీధితులకుఁ జొరరాక-
  సలలిత సహజ తేజమున వెలుఁగు
సమధికంబగు శుద్ధసత్త్వ గరిష్ఠమై-
  కరమొప్ప యోగీంద్రగమ్య మగుచు
హరిపదధ్యాన పరాయణులైన త-
  ద్దాసుల కలరు నివాస మగుచుఁ
10.2-1251.1-తే.
బ్రవిమలానంత తేజోవిరాజమాన
దివ్యమణి హేమకలిత సందీప్త భవ్య
సౌధమండపతోరణ స్తంభ విపుల
గోపురాది భాసురము వైకుంఠపురము.

భావము: 
శివుడు అలా పరగెత్తుకు వెళ్ళి వైకుంఠపురం చూసాడు. ఆ వైకుంఠాన్ని నిరుపమాన ఆనందనిలయము అమృతపదం, పరమపదం అని ప్రసిద్ధమై నిఖిలలోకాలకూ అవతల సూర్యచంద్ర కిరణాలుసైతం ప్రవేశించటానికి వీలులేని విధంగా ఉండి, మనోఙ్ఞమైన సహజసిద్ధ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది. యోగులకూ భాగవతశ్రేష్టులకూ నివాసస్థలంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. మిక్కలి నిర్మలమైన అనంత తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. దివ్యమైన రత్నాలు, బంగారుమయమై ప్రకాశించే భవనాలు, మండపాలు, తోరణాలు, స్తంభాలు, విస్తారమైన గోపురాలుతో భాసిస్తూ ఉంటుంది ఆ వైకుంఠపురము.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1251

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: