Saturday, June 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౬(576)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1201-క.
అని సర్వలోక విభుఁ డగు
వనజోదరుఁ డానతిచ్చు వాక్యంబుల జా
డన భూమీసురుఁ డమ్ముని
జనులకు సద్భక్తిఁ బూజ సలిపెన్ వరుసన్.
10.2-1202-చ.
ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర భూసురులం గృపావలో
కన మొలయన్ననూనసుభగస్థితిఁ బొందఁగఁ జేసి వారి వీ
డ్కొని రథమెక్కి దివ్యమునికోటియుఁ దానును వచ్చెఁ గ్రమ్మఱన్
జనవర! మోక్షదం బగు కుశస్థలికిం బ్రమదాంతరంగుఁడై!"

భావము:
లోకాలు సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారం శ్రుతదేవుడు అత్యంతభక్తితో ఆ మునిపుంగవులను పూజించాడు. ఓ రాజా పరీక్షిత్తు! మిథిలాదేశ ప్రభువు బహుళాశ్వుని, విప్రుడు శ్రుతదేవుని ఆ విధంగా శ్రీకృష్ణుడు కరుణతో కటాక్షించి వారికి శుభాలు ప్రసాదించాడు. వారి దగ్గర సెలవు తీసుకుని సంతోషాతంరంగుడై రథం ఎక్కి మునులతోపాటు మోక్షదాయకమైన ద్వారకను తిరిగి చేరుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1202

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Thursday, June 23, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౫(575)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1199-క.
“నా మది విప్రులపైఁ గల
ప్రేమము నా తనువు నందుఁ బెట్టని కతనన్
భూమీసురు లర్హులు; నీ
వీ మునులం బూజ సేయు మిద్ధచరిత్రా!
10.2-1200-క.
ఇదియే నా కిష్టము ననుఁ
బదివేలవిధంబు లొలయ భజియించుటగా
మది కింపగు నటు గావున
వదలని భక్తిన్ భజింపు వసుధామరులన్!”

భావము:
“ఓ శుద్ధాత్మా! వారు మిక్కిలి అర్హులు అగుటచే, నా మనసులో నా శరీరం మీద కన్నా బ్రాహ్మణుల మీద నాకు ప్రేమ అధికముగా గలదు. కనుక నీవు ఈ మునులను పూజించుము. నాకు ఇష్టం కూడా అదే. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను పదివేల విధాల పూజించినట్లు భావించి సంతోషిస్తాను. కనుక, సుస్థిర భక్తితో విప్రులను పూజించు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1200

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

శ్రీకృష్ణ విజయము - ౫౭౪(574)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1198-వ.
చనుదెంచిరి; పుణ్యస్థలంబులును, విప్రులును, దేవతలును సంస్పర్శన దర్శనార్చనంబులం బ్రాణులను సమస్త కిల్బిషంబులం బాయంజేయుదు; రదియునుంగాక, బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటి యందు ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుండై మత్కలాశ్రయుండయ్యెనేని నతం డుత్తముం డై వెలుంగు; నతనిం జెప్ప నేల?” యని వెండియు నిట్లనియె.

భావము:
అంతటి మహానుభావులు నీ ఇంటికి విచ్చేసారు. పుణ్యస్థలాలూ, విప్రులూ, దేవతలూ, స్పర్శ, దర్శన, అర్చన వలన జీవుల పాపాలు సమస్తమూ తొలగిస్తారు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే సకల జీవులలోను గొప్పవాడు అయి ఉంటాడు. అతడు జపము, తపస్సు, ధ్యానము అధ్యయనము మున్నగు సాధనలతో పరిపూర్ణుడై నా భక్తుడు అయితే గొప్పగా ప్రకాశిస్తాడు.” అని పలికి కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1198

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౫౭౩(573)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1197-సీ.
“నీకు మ్రొక్కెదఁ గృష్ణ! నిగమాంత సంవేద్య!-
  లోకరక్షక! భక్తలోకవరద!
నీపాదసేవననిరతుని నన్ను నే-
  పనిఁ బంపె దానతి” మ్మనినఁ గృష్ణుఁ
డెలనవ్వు మోమునఁ జెలువొంద నా విప్రు-
  కర మాత్మకరమునఁ గదియఁ జేర్చి
పాటించి యతనితోఁ బలికెఁ “దపశ్శక్తి-
  వఱలిన యమ్మునివర్యు లెపుడుఁ
10.2-1197.1-తే.
దమ పదాంబుజరేణు వితానములను
దవిలి లోకంబులను బవిత్రంబు సేయు
వారు ననుఁ గూడి యెప్పుడు వలయు నెడల
కరుగుదెంతురు నీ భాగ్య గరిమ నిటకు.

భావము:
కృష్ణా! వేదవేద్యా! లోకరక్షకా! భక్తవరదా! నీకు నమస్కరిస్తున్నాను. నీ పాదసేవలో నిరంతరం సంచరించే నన్ను ఏమి చేయమంటావో అజ్ఞాపించు.” ఇలా పలుకుతున్న శ్రుతదేవుడి పలుకులు విని గోవిందుడు మందహాసం చేస్తూ తన చేతిలోకి అతని చేతిని తీసుకుని, ఇలా అన్నాడు. “ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా! తమ పాదధూళితో లోకాన్ని పవిత్రం చేసే వారు, పరమ తపోధనులు అయిన ఈ మునివరులు నాతోపాటు తాము కోరిన చోటికి వస్తూంటారు. ఈనాడు నావెంట నీ ఇంటికి విచ్చేసారు. నీ అదృష్టం పండింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1197

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Monday, June 20, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౨(572)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1195-క.
ముని యోగిమానసస్ఫుట
వనజంబుల నెల్ల ప్రొద్దు వర్తించు భవ
ద్ఘనదివ్యమూర్తి నా లో
చనగోచర మయ్యెఁ గాదె! సర్వాత్మ! హరీ!
10.2-1196-వ.
దేవా! నీ సచ్చరితంబులు గర్ణరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజలొనర్చుచు, నీచరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామ సంకీర్తనంబులు సేయుచుం, దమ శరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులం గానంబడుచుందువు; కర్మవిక్షిప్తచిత్తులైన వారి హృదయంబుల నుండియు, దూరగుండ వగుదు;” వని మఱియు నిట్లనియె.

భావము:
ఓ సర్వాంతర్యామీ! శ్రీహరీ! మునీశ్వరుల యోగీంద్రుల హృదయ పద్మాలలో నిరంతరం మెలిగెడి నీ యొక్క దివ్య మంగళరూపం నా కనులకు గోచరమైంది. ఓ దేవా! చెవులపండువుగా నీ దివ్యగాథలు వింటూ; నీకు పూజలు చేస్తూ; నీ పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ; నీ దివ్యనామం జపిస్తూ; తమ శరీరాలు నీ ఆధీనాలుగా సంచరిస్తూ; ఉండే సజ్జనుల హృదయాలనే అద్దాలలో నీవు కనిపిస్తూ ఉంటావు; కర్మపరతంత్రులైన వారి హృదయాలకు దూరంగా ఉంటావు.” అని స్తుతించి శ్రుతదేవుడు ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1196

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Sunday, June 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౧(571)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1193-తే.
మానితంబుగ విశ్వనిదానమూర్తి
యైన కృష్ణుండు దనయింట నారగించెఁ
దన మనోరథసిద్ధియుఁ దనకు నబ్బె
ననుచుఁ బైపుట్ట మల్లార్చి యాడుచుండె.
10.2-1194-చ.
తరుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ, త
చ్చరణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్ రమా
వరుఁ గని వల్కె "భక్తజనవత్సల! మామకభాగ్య మెట్టిదో
హర చతురాస్యులున్నెఱుఁగ నట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్.

భావము:
“సర్వ జగత్తుకు మూలకారణమైన శ్రీకృష్ణుడు నా ఇంట్లో భోజనం చేసాడు. నా కోరిక ఫలించింది.” అంటూ శ్రుతదేవుడు ఎంతో ఆనందంతో తన పైబట్ట ఆడిస్తూ చిందులు త్రొక్కాడు. తను తన భార్యాపుత్రులూ కృష్ణుడిని స్తుతిస్తూ ఉండగా, ఆయన పాదాలను ఒడిలో చేర్చుకుని మెత్తగా ఒత్తుతూ శ్రుతదేవుడు ఆ శ్రీపతితో ఇలా అన్నాడు. “భక్తవత్సలా! నా భాగ్యం ఎంత గొప్పదో కదా. పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కనలేని నిను దర్శించగలిగాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1194

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

Saturday, June 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౦(570)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1191-చ.
శిరములఁ దాల్చి, నవ్యతులసీదళదామ కుశప్రసూన వి
స్ఫుర దరవింద మాలికలఁ బూజ లొనర్చి, "గృహాంధకూప సం
చరణుఁడ నైన నాకడకుఁ జక్రి దనంతనె వచ్చునట్టి సు
స్థిరమతి నే తపంబు మును సేసితినో?" యని సంతసించుచున్.
10.2-1192-తే.
మఱియుఁ దత్పాదతీర్థంబు మందిరమునఁ
గలయఁ జిలికించి, సంప్రీతి గడలుకొనఁగఁ
బత్త్ర ఫలపుష్పతోయముల్‌ భక్తి నొసగి,
హరి మురాంతకమూర్తి నిజాత్మ నిలిపి.

భావము:
కృష్ణుని పాదజలాన్ని వారు తమ తలల మీద జల్లుకున్నారు. తులసిమాలలనూ, తామరపూల హారాలనూ వారికి సమర్పించి పూజించాడు. “ఈ ఇల్లనే చీకటినూతిలో పడికొట్టుకుంటున్న నా దగ్గరకు చక్రి శ్రీకృష్ణుడు తనంత తానుగా రావటానికి నేను ఎంతటి తపస్సు చేసానో కదా.” అని ఎంతో సంతోషించాడు. ఇంకా, తన గృహం నలుమూలలా శ్రుతదేవుడు శ్రీకృష్ణ పాదతీర్థాన్ని చల్లాడు, అతడు కృష్ణుడిని తన మనసులో భక్తిగా నిలుపుకున్నాడు. మిక్కిలి భక్తితో పత్రం పుష్పం ఫలం జలాలను సమర్పించి, అర్చించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1192

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :