Saturday, June 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౦(570)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1191-చ.
శిరములఁ దాల్చి, నవ్యతులసీదళదామ కుశప్రసూన వి
స్ఫుర దరవింద మాలికలఁ బూజ లొనర్చి, "గృహాంధకూప సం
చరణుఁడ నైన నాకడకుఁ జక్రి దనంతనె వచ్చునట్టి సు
స్థిరమతి నే తపంబు మును సేసితినో?" యని సంతసించుచున్.
10.2-1192-తే.
మఱియుఁ దత్పాదతీర్థంబు మందిరమునఁ
గలయఁ జిలికించి, సంప్రీతి గడలుకొనఁగఁ
బత్త్ర ఫలపుష్పతోయముల్‌ భక్తి నొసగి,
హరి మురాంతకమూర్తి నిజాత్మ నిలిపి.

భావము:
కృష్ణుని పాదజలాన్ని వారు తమ తలల మీద జల్లుకున్నారు. తులసిమాలలనూ, తామరపూల హారాలనూ వారికి సమర్పించి పూజించాడు. “ఈ ఇల్లనే చీకటినూతిలో పడికొట్టుకుంటున్న నా దగ్గరకు చక్రి శ్రీకృష్ణుడు తనంత తానుగా రావటానికి నేను ఎంతటి తపస్సు చేసానో కదా.” అని ఎంతో సంతోషించాడు. ఇంకా, తన గృహం నలుమూలలా శ్రుతదేవుడు శ్రీకృష్ణ పాదతీర్థాన్ని చల్లాడు, అతడు కృష్ణుడిని తన మనసులో భక్తిగా నిలుపుకున్నాడు. మిక్కిలి భక్తితో పత్రం పుష్పం ఫలం జలాలను సమర్పించి, అర్చించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1192

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: