Sunday, June 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౧(571)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1193-తే.
మానితంబుగ విశ్వనిదానమూర్తి
యైన కృష్ణుండు దనయింట నారగించెఁ
దన మనోరథసిద్ధియుఁ దనకు నబ్బె
ననుచుఁ బైపుట్ట మల్లార్చి యాడుచుండె.
10.2-1194-చ.
తరుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ, త
చ్చరణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్ రమా
వరుఁ గని వల్కె "భక్తజనవత్సల! మామకభాగ్య మెట్టిదో
హర చతురాస్యులున్నెఱుఁగ నట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్.

భావము:
“సర్వ జగత్తుకు మూలకారణమైన శ్రీకృష్ణుడు నా ఇంట్లో భోజనం చేసాడు. నా కోరిక ఫలించింది.” అంటూ శ్రుతదేవుడు ఎంతో ఆనందంతో తన పైబట్ట ఆడిస్తూ చిందులు త్రొక్కాడు. తను తన భార్యాపుత్రులూ కృష్ణుడిని స్తుతిస్తూ ఉండగా, ఆయన పాదాలను ఒడిలో చేర్చుకుని మెత్తగా ఒత్తుతూ శ్రుతదేవుడు ఆ శ్రీపతితో ఇలా అన్నాడు. “భక్తవత్సలా! నా భాగ్యం ఎంత గొప్పదో కదా. పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కనలేని నిను దర్శించగలిగాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1194

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: