Wednesday, September 15, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౮(338)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-694-వ.
తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామర ధరావర వణిక్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి; పుణ్యాంగనా జనంబులు పసిండిపళ్లెరంబులఁ గర్పూరనీరాజనంబులు నివాళింప నంతఃపురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్ణునిం గని పర్యంకంబు డిగ్గి కౌఁగిలింప నా యదువల్లభుఁడు మేనత్తకుం బ్రణామం బాచరించెఁ; బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందు భామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షత కుసుమ తాంబూలంబులిడి లలిత దుకూల మణి భూషణంబులం బూజించె; యుధిష్ఠిరుండును గమలనయనుని వధూజనుల ననుగత బంధుమిత్ర పుత్త్ర సచివ పురోహిత పరిచారక సముదయంబుల నుచితంబు లగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబు లగు వివిధోపచారంబులు గావించుచుండె. 

భావము:
అటు పిమ్మట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నుండి మంగళ పదార్థాలు కానుకలుగా స్వీకరించాడు. ముత్తైదువలు బంగారుపళ్ళెరాలతో కర్పూరహారతులు ఇస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజమహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి పాన్పుదిగి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేసాడు. ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుచీరలూ, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికీ, ఆయన అంతఃపుర కాంతలకూ, పరివారానికీ అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదులు ఏర్పాటు చేయించి, సకల నవ్య సౌకర్యాలూ సమకూర్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=694 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౭(337)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-693-మ.
అని యిబ్భంగి సరోజలోచనలు సౌధాగ్రంబు లందుండి య
వ్వనజాతాక్షుని దివ్యమూర్తిఁ దమభావం బందుఁ గీలించి సం
జనితానంద రసాబ్ధిమగ్న లగుచున్ సంప్రీతిఁ దద్భవ్య కీ
ర్తనలై చల్లిరి నవ్యలాజములు మందారప్రసూనావలుల్‌. 

భావము:
అలా పొగడుతూ ఆ కలువ కన్నుల కోమలులు మేడలమీద నిలుచుండి, తామరరేకులవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో నిలుపుకొన్నారు. దానితో కలిగిన ఆనంద సాగరంలో మునకలు వేస్తూ, సంతోషంతో అతనిపై కీర్తనులు పాడుతూ, మందారపుష్పాలూ, లాజలూ చల్లారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=692 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౬(336)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-690-సీ.
"విశ్వగర్భుండు నా వెలయు వే ల్పిల యశో-
  దానందులకుఁ బ్రియసూనుఁ డయ్యె;
బ్రహ్మాది సురులకు భావింపఁగా రాని-
  బ్రహ్మంబు గోపాలబాలుఁ డయ్యె;
వేదశాస్త్రంబులు వెదకి కానఁగలేని-
  గట్టి వ్రేతల ఱోలఁ గట్టుపడియె;
దివిజుల కమృతంబు దవిలి యిచ్చిన భక్త-
  సులభుండు నవనీత చోరుఁ డయ్యె
10.2-690.1-తే.
నెనయఁ గమలాసతికిఁ జిత్త మీని వేల్పు
గొల్లయిల్లాండ్ర యుల్లముల్‌ పల్లవింపఁ
జేసె" నని కామినులు సౌధశిఖరములను
గూడి తమలోన ముచ్చట లాడి రధిప!
10.2-691-వ.
మఱియును.
10.2-692-సీ.
"గోపాలబాలురఁ గూడి యాడెడి నాఁడు-
  వ్రేపల్లె లోపల నేపు రేఁగి
చల్ల లమ్మగఁ బోవు సతుల కొంగులు పట్టి-
  మెఱుఁగుఁ జెక్కిళ్ళను మీటిమీటి
కలికియై ముద్దాడఁ గౌఁగిటఁ జేర్చిన-
  పూఁబోఁడి కుచములు పుణికిపుణికి
పాయని యనురక్తి డాయఁ జీరిన యింతి-
  యధరసుధారసం బానియాని
10.2-692.1-తే.
యురుసమాధిపరాష్టాంగయోగ యుక్తు
లైన యోగీశ్వరులు గాననట్టి జెట్టి
వల్లవీజన వన కల్పవల్లి యయ్యె"
ననుచుఁ బొగడిరి కృష్ణు నయ్యబ్జముఖులు. 

భావము:
పరీక్షిన్మహారాజా! “జగత్తునే కడుపులో ఉంచుకొనే ఈ దేవుడు, అవనిపై యశోదానందులకు ముద్దుల తనయుడు అయ్యాడు; బ్రహ్మాది దేవతలకుకూడా భావింప సాధ్యంకాని పరబ్రహ్మస్వరూపం, గోవులను పారించే గొల్లపిల్లవాడు అయ్యాడు; వేదశాస్త్రాలు వెదకినా కనుగొనలేని ఘనుడు, వ్రేపల్లెలో రోటికి కట్టుబడ్డాడు; వేల్పులకు అమృతం పంచిన పరాత్పరుడు, వెన్నదొంగ అయ్యాడు; శ్రీమహాలక్ష్మికిసైతం మనసు ఇవ్వని భగవానుడు, గొల్లపడచుల హృదయాలను కొల్లగొట్టాడు” అంటూ పురస్త్రీలు మేడలపై గుంపులు గూడి కృష్ణుడిని గురించి పరస్పరం ముచ్చటించుకున్నారు. అంతేకాకుండా “గొల్లపిల్లలతో కలసి గొల్లపల్లెలో ఆడుకున్నాడు; చల్లలు అమ్ముకోటానికి వెళ్ళే గోపికాకాంతల కొంగులుపట్టి సరసాలాడాడు; ముద్దుపెట్టుకోవాలని కౌగిట్లో చేర్చిన ముద్దుగుమ్మల రొమ్ములు స్పృశించాడు; ప్రేమతో దగ్గరకు రమ్మని పిలిచిన గొల్లపడతుల అధరామృతం పానం చేసాడు; సమాధినిష్ఠలో మునిగి అష్టాంగయోగంలో ఉన్నయోగీశ్వరులకు కూడా కనబడని వేలుపు యాదవ కన్నెల పాలిటి కల్పవల్లి అయ్యాడు” అంటూ పద్మం వంటి మోములు గల ప్రమదలు కృష్ణుడిని రకరకాలుగా స్తోత్రాలు చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=692 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, September 11, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౫(335)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-688-సీ.
కొఱనెలపైఁ దోచు నిరులు నాఁ జెలువొంది-
  నొసలిపైఁ గురులు తుంపెసలు గునియ
హాటకమణిమయ తాటంకరోచులు-
  గండభాగంబుల గంతులిడఁగ
స్ఫురిత విద్రుమనిభాధరబింబరుచితోడ-
  దరహాసచంద్రిక సరసమాడ
నొండొంటితో రాయు నుత్తంగ కుచకుంభ-
  ములు మొగంబులకును బుటము లెగయ
10.2-688.1-తే.
బడుగునడుములు వడఁకంగ నడుగు లిడఁగ
రవళిమట్టెలు మణినూపురములు మొరయఁ
బొలుచు కచబంధములు భుజంబుల నటింపఁ
బయ్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ.
10.2-689-వ.
ఇట్లు కృష్ణసందర్శన కుతూహల పరస్పరాహూయమానలై గురు పతి సుత బంధు జనంబులు వారింప నతిక్రమించి సమున్నత భర్మహర్మ్య శిఖాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి. 

భావము:
అలా పురుషోత్తముడిని దర్శించడానికి పురస్త్రీలు మేడలపై గుమికూడారు. అర్థచంద్రునిమీద మబ్బులు క్రమ్ముకొన్నాయా అన్నట్లు నెన్నుదుటిమీద ముంగురులు మూగుతున్నాయి; బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళ మీద గంతులు వేస్తున్నాయి; పగడపుకాంతిని తిరస్కరించే దొండపండు అధరాల కాంతులు, చిరునవ్వులు వెన్నెలలతో సరసమాడుతున్నాయి; ఒకదానికొకటి ఒరుసుకుంటున్న ఉన్నతమైన స్తనాలు ఉత్సాహంతో ఉబుకుతున్నాయి; సన్నని నడుములు వణుకుతున్నాయి నడచేటప్పుడు మెట్టెలూ అందెలూ గల్లుగల్లున మ్రోగుతున్నాయి; జుట్టుముడులు వీడి భుజాలపై నాట్యంచేస్తున్నాయి; పైటలు జారిపోతున్నాయి. ఇలా మనోహరంగా బయలుదేరి, పౌరకాంతలు కృష్ణుడిని దర్శించాలనే కుతూహలంతో, ఒకరి నొకరు పిలుచుకుంటూ, పెద్దలూ ఇంటివారూ వద్దంటున్నా వినకుండా, ఎత్తైన మేడలు ఎక్కి, ముకుందుని దర్శించి తమలో తాము ఇలా అనుకున్నారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=688 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౪(334)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-687-వ.
ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభునిం బెద్దతడవు గాఢాలింగనంబుచేసి రోమాంచకంచుకిత శరీరుండై యానందబాష్పధారాసిక్తకపోలుండై నిర్భరానంద కందళిత హృదయుండై బాహ్యంబు మఱచియుండె; నప్పుడు హరిని వాయునందన వాసవతనూభవులు గౌఁగిటం జేర్చి సమ్మదంబు నొందిరి; మాద్రేయులు దండప్రణామంబు లాచరించి; రంతఁ బుండరీకాక్షుఁడు విప్ర వృద్ధజనంబులకు నమస్కారంబులుచేసి, వారలు గావించు వివిధార్చనలం బరితుష్టుం డై కేకయ సృంజ యాది భూవిభుల మన్నించి సూత మాగధాదుల కనేక పదార్థంబు లొసంగి, చతురంగబలసమేతుండై వివిధ మణితోరణాది విచిత్రాలంకృతంబు నతివైభవోపేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండఁ బౌరకామిను లట్టియెడ.
భావము:
ఇలా ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించాడు. గట్టిగా కౌగలించుకుని పులకితశరీరుడై, ఆనందబాష్పాలు చెక్కిళ్ళను తడుపుతుండగా, ఆనందపారవశ్యంతో ధర్మజుడు ప్రపంచాన్ని మరచిపోయీడు. వాయుసుత, ఇంద్రసుతులైన భీమార్జునులు వనమాలిని ఆలింగనం చేసుకుని ఆనందించారు. మాద్రి పుత్రులు ఐన నకులసహదేవులు నళిననాభునికి నమస్కారం చేసారు. అటుపిమ్మట, శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు పెద్దలకూ వందనం చేసి, వారు చేసిన పూజలకు సంతోషించాడు. కేకయ సృంజయాది రాజులను మన్నించాడు. వందిమాగధులకు అనేక బహుమతులు ఇచ్చాడు. అనంతరం చతురంగబలసమేతుడై మణితోరణాలతో అలంకృతమై అత్యంత వైభవోపేతమైన ఇంద్రప్రస్థ పట్టణంలోనికి ప్రవేశించాడు. అలా పరమ వైభవంగా రాజమార్గము వెంట వెళుతున్న శ్రీకృష్ణుడిని నగరకాంతలు.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=687 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :శ్రీకృష్ణ విజయము - ౩౩౩(333)
( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-685-క.
హరిరాక యెఱిఁగి ధర్మజు
డఱలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌
గురుజన సచివ పురోహిత
పరిచారక కరి రథాశ్వ భటయుతుఁ డగుచున్.
10.2-686-క.
చిందములు మొరయ గాయక
బృందంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్
డెందము దగులఁగఁ బరమా
నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్. 

భావము:
శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. అలా బయలుదేరి నప్పుడు శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వీనుల విందు చేస్తుండగా, ధర్మరాజు మిక్కిలి భక్తి, అనురక్తి నిండిన మనసుతో కృష్ణుడికి స్వాగతం చెప్పటానికి పరమ సంతోషంగా వచ్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=686 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౩(333)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-685-క.
హరిరాక యెఱిఁగి ధర్మజు
డఱలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌
గురుజన సచివ పురోహిత
పరిచారక కరి రథాశ్వ భటయుతుఁ డగుచున్.
10.2-686-క.
చిందములు మొరయ గాయక
బృందంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్
డెందము దగులఁగఁ బరమా
నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్. 

భావము:
శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. అలా బయలుదేరి నప్పుడు శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వీనుల విందు చేస్తుండగా, ధర్మరాజు మిక్కిలి భక్తి, అనురక్తి నిండిన మనసుతో కృష్ణుడికి స్వాగతం చెప్పటానికి పరమ సంతోషంగా వచ్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=686 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, September 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౨(332)

( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-683-క.
కరి హరి రథ సుభట సము
త్కరములు సేవింప మురవిదారుఁడు గడచెన్
సరి దుపవన దుర్గ సరో
వర జనపద పుర పుళింద వన గోష్ఠములన్.
10.2-684-వ.
ఇట్లు గడచి చనుచు నానర్తక సౌవీర మరుదేశంబులు దాటి యిందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీనది దాఁటి పాంచాల మత్స్యవిషయంబులు లోనుగాఁ గడచి యింద్ర ప్రస్థనగరంబు డాయం జని, తత్పురోపకంఠవనంబున విడిసిన. 

భావము:
ఈ విధంగా మురాసురసంహారుడు శ్రీకృష్ణుడు రథ, గజ, తురగ, పదాతిసేనా సమూహాలు గల చతురంగ బలాలు సేవిస్తూ ఉండగా నదులనూ, వనాలనూ, కోటలనూ, జలాశయాలనూ, గ్రామాలనూ, పట్టణాలనూ, భిల్లపల్లెలను, తపోవనాలను, గోష్ఠాలను దాటాడు. ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి; ఇందుమతీనదిని దర్శించి; దృషద్వతీ, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి; ఇంద్రప్రస్థ నగరం చేరి, ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=684 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :