Sunday, September 12, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౬(336)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-690-సీ.
"విశ్వగర్భుండు నా వెలయు వే ల్పిల యశో-
  దానందులకుఁ బ్రియసూనుఁ డయ్యె;
బ్రహ్మాది సురులకు భావింపఁగా రాని-
  బ్రహ్మంబు గోపాలబాలుఁ డయ్యె;
వేదశాస్త్రంబులు వెదకి కానఁగలేని-
  గట్టి వ్రేతల ఱోలఁ గట్టుపడియె;
దివిజుల కమృతంబు దవిలి యిచ్చిన భక్త-
  సులభుండు నవనీత చోరుఁ డయ్యె
10.2-690.1-తే.
నెనయఁ గమలాసతికిఁ జిత్త మీని వేల్పు
గొల్లయిల్లాండ్ర యుల్లముల్‌ పల్లవింపఁ
జేసె" నని కామినులు సౌధశిఖరములను
గూడి తమలోన ముచ్చట లాడి రధిప!
10.2-691-వ.
మఱియును.
10.2-692-సీ.
"గోపాలబాలురఁ గూడి యాడెడి నాఁడు-
  వ్రేపల్లె లోపల నేపు రేఁగి
చల్ల లమ్మగఁ బోవు సతుల కొంగులు పట్టి-
  మెఱుఁగుఁ జెక్కిళ్ళను మీటిమీటి
కలికియై ముద్దాడఁ గౌఁగిటఁ జేర్చిన-
  పూఁబోఁడి కుచములు పుణికిపుణికి
పాయని యనురక్తి డాయఁ జీరిన యింతి-
  యధరసుధారసం బానియాని
10.2-692.1-తే.
యురుసమాధిపరాష్టాంగయోగ యుక్తు
లైన యోగీశ్వరులు గాననట్టి జెట్టి
వల్లవీజన వన కల్పవల్లి యయ్యె"
ననుచుఁ బొగడిరి కృష్ణు నయ్యబ్జముఖులు. 

భావము:
పరీక్షిన్మహారాజా! “జగత్తునే కడుపులో ఉంచుకొనే ఈ దేవుడు, అవనిపై యశోదానందులకు ముద్దుల తనయుడు అయ్యాడు; బ్రహ్మాది దేవతలకుకూడా భావింప సాధ్యంకాని పరబ్రహ్మస్వరూపం, గోవులను పారించే గొల్లపిల్లవాడు అయ్యాడు; వేదశాస్త్రాలు వెదకినా కనుగొనలేని ఘనుడు, వ్రేపల్లెలో రోటికి కట్టుబడ్డాడు; వేల్పులకు అమృతం పంచిన పరాత్పరుడు, వెన్నదొంగ అయ్యాడు; శ్రీమహాలక్ష్మికిసైతం మనసు ఇవ్వని భగవానుడు, గొల్లపడచుల హృదయాలను కొల్లగొట్టాడు” అంటూ పురస్త్రీలు మేడలపై గుంపులు గూడి కృష్ణుడిని గురించి పరస్పరం ముచ్చటించుకున్నారు. అంతేకాకుండా “గొల్లపిల్లలతో కలసి గొల్లపల్లెలో ఆడుకున్నాడు; చల్లలు అమ్ముకోటానికి వెళ్ళే గోపికాకాంతల కొంగులుపట్టి సరసాలాడాడు; ముద్దుపెట్టుకోవాలని కౌగిట్లో చేర్చిన ముద్దుగుమ్మల రొమ్ములు స్పృశించాడు; ప్రేమతో దగ్గరకు రమ్మని పిలిచిన గొల్లపడతుల అధరామృతం పానం చేసాడు; సమాధినిష్ఠలో మునిగి అష్టాంగయోగంలో ఉన్నయోగీశ్వరులకు కూడా కనబడని వేలుపు యాదవ కన్నెల పాలిటి కల్పవల్లి అయ్యాడు” అంటూ పద్మం వంటి మోములు గల ప్రమదలు కృష్ణుడిని రకరకాలుగా స్తోత్రాలు చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=692 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: