Thursday, September 9, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౩(333)

( పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట ) 

10.2-685-క.
హరిరాక యెఱిఁగి ధర్మజు
డఱలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌
గురుజన సచివ పురోహిత
పరిచారక కరి రథాశ్వ భటయుతుఁ డగుచున్.
10.2-686-క.
చిందములు మొరయ గాయక
బృందంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్
డెందము దగులఁగఁ బరమా
నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్. 

భావము:
శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు. అలా బయలుదేరి నప్పుడు శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వీనుల విందు చేస్తుండగా, ధర్మరాజు మిక్కిలి భక్తి, అనురక్తి నిండిన మనసుతో కృష్ణుడికి స్వాగతం చెప్పటానికి పరమ సంతోషంగా వచ్చాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=54&Padyam=686 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: